పులి భోజనం అంటే తెలుసా?

  • Published - 02:55 AM, Tue - 7 September 21
పులి భోజనం అంటే తెలుసా?

కావ్యాలు,పురాణాలు పదేపదే పులిని క్రూర జంతువుగా మన మనస్సులలో ప్రతిష్టించడంతో పిల్లిలాగే ఎంతో సౌమ్యమైన పులి క్రూర జంతువుగా నిలిచి పోయింది. నిజానికి మనిషిలోని క్రూరమైన కాంక్షకు ఎంతో అందమైన, గంభీరమైన,రాజసం ఉట్టిపడే పులి బలి అయిపోయి తన ఉనికిని కాపాడుకునేందుకే అల్లాడిపోతోంది.

నల్లమల అడవులలోని ఆత్మకూరు అటవీ డివిజన్ పెద్ద పులుల ప్రవర్ధనానికి ఎంతో అనుకూలమైన ప్రాంతంగా నిలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నాగార్జున సాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం దేశంలోనే (విస్తీర్ణంలో) అతి పెద్దది. ఆత్మకూరు అటవీ డివిజన్ ఈ అభయారణ్యంలోనిదె. ఈ అడవుల్లో సంచరించే గిరిజనులు,పశువుల కాపరుల అనుభవంలో గాని అటవీ శాఖ రికార్డుల పరంగా కూడా పెద్ద పులి ఏనాడు మనిషిపై దాడి చేసిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు.

‘పులిని నీవు ఒక్క సారి చూస్తే అప్పటికే పులి నిన్ను వేయి సార్లు చూసి ఉంటుంది.’.. ఈ మాటలు నల్లమల అటవీ ప్రాతంలో విస్తృతంగా ప్రాచుర్యంలో ఉన్నాయి.దీనర్ధం  ఏమిటంటే పులి ఎప్పుడు మనిషి ముందుకు రావడానికి ఇష్టపడదు.తనకున్న ఘ్రాణ శక్తితో మనిషి ఉనికిని గుర్తించి తప్పుకు తిరుగుతుంది.నల్లమల అడవుల్లో మొత్తం 100కు పైగా పెద్దపులులుండగా ఆత్మకూరు అటవీ డివిజన్ లో సుమారు 40 పులులున్నాయి.

Also Read:సింహాల గడ్డనూ లొంగదీసుకున్నారు..!

పెద్ద పులి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు….

పులి భోజనం:

అడవిలో అన్నీ జంతువులకంటే బలమైన పులికి తిన్నంత ఆహారం దొరుకుతుందని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. పులికి సగటున వారంలో ఒకరోజు మాత్రమే వేట ఫలిస్తుంది. పులికి ఆహార జంతువులన్నీ పులుల కంటే వేగంగా పరిగెత్తగలిగినవే. అందుకే పెద్దపులి బలహీనమైన,అనారోగ్యమైన జంతువులను గుర్తించి మాటు వేసి దాడి చేస్తుంది. అలా అతి కష్టంమీద దొరికిన ఆహారాన్ని పులి ఇతర మాంసాహార జంతువులకు దొరకకుండా దాచుకుని తింటుంది. ఇంత కష్టం ఉంటుంది కాబట్టే ఆకలితో నకనకలాడే వాడికి దొరికే భోజనాన్ని పులి భోజనంగా పిలుస్తారు. ఒక్కోసారి పులి ఆహారం దొరక్క పశువుల పేడను కూడా తిని ఆకలి తీర్చుకుంటుంది.

పులి జాడ:

పులి తన బరువును రెట్టింపు బరువు ఉన్న ఆవులు,ఎద్దుల వంటి పెంపుడు జంతువులను పిల్లి ఎలుకను నోట కరుచుకుని తీసుకు వెళ్లినంత సులభంగా లాక్కు వెళుతుంది. అడవిలో పులి అలా జంతువును లాక్కుని సురక్షిత ప్రదేశానికి తీసుకు వెళ్ళేటప్పుడు ఓ మోస్తరు చెట్లు అణిగిపోయి పులి వెళ్లిన మేర దారి ఏర్పడుతుంది.దీన్నే పులి జాడ అని అంటారు.

పులి మహా ప్రస్థానం:

పులులు జంతు ప్రదర్శన శాలల్లో 20 సంవత్సరాలవరకు, అడవుల్లో 12 ఏళ్ళు బ్రతుకుతాయి .వయసుడిగిన పులులు శక్తి నశించి వేటాడే లేకపోతాయి. ఒకవేళ ఏ జంతువు నైనా వేటాడినప్పటికి పళ్ళు అరిగి, విరిగి పోయిన కారణంతో వేట జంతువు మాంసాన్ని పీక్కుని తినలేకపోతుంది.అలాంటి పరిస్థితిలో ముసలి పులులు కొండ ప్రాంతానికి చేరుకుని ఎత్తైన కొడలపైకి ఎక్కి ఏ జంతు,మానవ సంచారం లేని ప్రాంతాలలో పడుకుని చావు కొరకు వేచి ఉండి చనిపోతాయి.

Also Read:టీవీ9 దేవి నాగవల్లి… దాసరికి ఏమవుతుంది…?

Show comments