‘షాడో’తో చాలా రిస్కులున్నాయి

ఓటిటి ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఒక్కొక్కరుగా ఇందులో దిగుతున్న నిర్మాతలను చూస్తే అర్థమవుతోంది. లాక్ డౌన్ వల్ల వెబ్ సిరీస్ లకు విపరీతమైన ఆదరణ పెరగడంతో అందరి చూపూ వీటి వైపు పడుతోంది. ఇప్పటికే అల్లు కాంపౌండ్ ఆహా రూపంలో తమ పరిధిని పెంచుకునే పనిలో ఉండగా తాజాగా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ తో అనిల్ సుంకర కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 80, 90 దశకాల్లో తన నవలల్లో షాడో అనే గూడచారి పాత్ర ద్వారా ఎనలేని పాపులారిటీ సంపాదించిన మధుబాబు కథల ఆధారంగా వెబ్ సిరీస్ నిర్మించబోతున్నారు.

అప్పట్లో చిన్నా పెద్దా తేడా లేకుండా వీటిని ఎగబడి చదివేవారు. మార్కెట్ లో మధుబాబు నవల వస్తోందంటే చాలు బుక్ షాప్స్ ముందు క్యులు కనిపించేవి. ఏదైనా పత్రికలో ఆయన సీరియల్ వస్తోందంటే దాని సర్కులేషన్ లో ఆటోమేటిక్ గా పెరుగుదల ఉండేది. ఈ రేంజ్ లో ఆయన హవా నడిచింది. షాడో అనే క్యారెక్టర్ కల్పితమైనా జనం అది నిజమని భ్రమ చెందే స్థాయిలో అవి ఆదరణ పొందాయి. ఇప్పుడు వెబ్ సిరీస్ లో షాడోకు తీసుకురావడం అనే ఆలోచన బాగుంది కాని ఒరిజినల్ కథల్లో హీరో కుదురుగా ఒక్క చోట ఉండడు. దేశ విదేశాలు తిరుగుతాడు. ప్రాణాంతకమైన ఎన్నో రిస్కులు తీసుకుంటాడు. చెట్టు పుట్ట అడవి నగరం ఇలా అక్కడా ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడు.

విలన్ పాత్రలు కూడా అంతే. ప్రమాదకరమైన డెన్లలో నివాసముంటాయి. ఇవన్ని స్క్రీన్ మీద రీ క్రియేట్ చేయాలంటే చాలా బడ్జెట్ అవసరం. అందులోనూ అవుట్ డోర్ షూటింగ్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్తేనే ప్లాట్ కు న్యాయం జరుగుతుంది. మరి వీటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పైగా ఇంత పెద్ద సబ్జెక్టుని డీల్ చేసే దర్శకుడు ఎవరో కూడా తేలాల్సి ఉంది. ఏ మాత్రం స్క్రిప్ట్ పట్టుతప్పినా షాడో కథ రివర్స్ అవుతుంది. ఇవన్ని ఒకరకమైన సవాళ్లు. ప్రకటన వెలువడ్డాక నిన్నటి తరం రీడర్స్ లో ఒకరకమైన యాంగ్జైటీ కనిపిస్తోంది. ఆ అంచనాలు నిలబెట్టుకునేలా ఉండాలంటే షాడో ఏ విషయంలోనూ రాజీ పడకూడదు.

Show comments