టార్గెట్ కొడాలి… టీడీపీ నాటకం తేలాలి!

  • Published - 03:37 PM, Tue - 2 February 21
టార్గెట్ కొడాలి… టీడీపీ నాటకం తేలాలి!

ఏదైనా మాట మాట్లాడితే దానిలో అందరికి కనిపించే న్యాయం ఉండాలి.ఒక అంశాన్ని ఎంచుకొని దాని మీద వివాదం చేయాలి అనుకుంటే బలమైన విషయం ఉండాలి.అంతేగాని పులి మేక కథ లాగా ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి దాని నుంచి రాజకీయ ప్రయోజనం పొందాలని, ప్రభుత్వాన్నీ ఇరుకున పెట్టాలని కలలు కంటే ప్రజలు నమ్మరు. ఈ పాత కాలపు ఎత్తుగడల రాజకీయాన్ని టిడిపి మానుకుంటే బావుంటుంది.

ప్రతి అంశానికి , ప్రతి నేరానికి వెంటనే శిక్షలు పడడానికి, పరిష్కారాలు దొరకడానికి ఇవేమి నియంతృత్వ దేశాలు కాదు ,పాత కాలం నాటి రాజుల రాజ్యాలు అసలే కాదు. కొంత సంయమనం ఉండాలి ఒక విషయం జరిగిన తర్వాత నిందితులు ఎవరో ప్రాథమికంగా తెలిసే వరకు అయినా టిడిపి నాయకులు ఓపిక పట్టాలి. అంతేగాని ప్రతి అంశానికి రాజకీయ రంగు పులిమి జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రణాళిక రచించడం సరైంది కాదు. దీన్నంతటినీ ప్రజలు గమనిస్తున్నారన్న కనీస స్పృహ లేకుండా టిడిపి నాయకులు వ్యవహరిస్తే ఆ పార్టీ చివరకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అందులోనూ సోషల్ మీడియా విస్తృతం అయిన సమయంలో.. టిడిపి నాయకులు చెప్పింది నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. క్షణాల్లో ఏం జరిగిందనేది ప్రజల మధ్యలో కి వెళ్ళిపోతుంది. ఈ సమయంలో ప్రతి విషయం మీద రాజకీయ రంగు వేసి… దానిని చూసి ఆనంద పడడం టిడిపి ఎక్కడైనా ఆపితే మేలు.

ఏమి తెలిందని??

ఏదైనా నేరం జరిగినప్పుడు దానిలో కనీసం ప్రాథమిక ఆధారాలు సాక్ష్యాలు లభించిన తర్వాతే నిందితుల మీద పోలీసులు ఓ అవగాహనకు వస్తారు. విజయవాడలో మంగళవారం టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి మీద జరిగిన దాడి విషయంలో తెలుగుదేశం నాయకులు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఎవరు చేశారో తెలుసుకోకుండానే నానా హంగామా చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం సంఘటనా స్థలానికి హుటాహుటిన వెళ్లి పోలీసుల మీద కస్సుబుస్సు లాడటం విశేషం. కేసు లో ఏమి జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులకు కాస్త సమయం ఇవ్వాలి. విచారణ చేసేందుకు వారికి వీలు కల్పించాలి. అప్పుడు నిందితులు ఎవరు అనేది ప్రాథమికంగా ఆయన తెలుస్తుంది. దాని తర్వాత రాజకీయంగా దానిలో ఏమైనా కుట్ర కోణాలు దాడి కోణాలు ఉంటె అప్పుడు తెలుగుదేశం పార్టీ దానిని రాజకీయం చేస్తే ఎవరూ కాదనరు. భౌతిక దాడులకు సైతం రాజకీయంగా ఎవరు ప్రోత్సహించరు.

కనీస ప్రాథమిక విచారణ దర్యాప్తు లేకుండానే మంత్రి కొడాలి నాని ఇదంతా చేయించారని,తెలుగుదేశం నాయకులు మీడియా ముందుకు వచ్చి కొడాలి నానికి హెచ్చరికలు చేయడం,నానా రకాలుగా ఆరోపణలు, బూతులు తిట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఈ కేసులో మంత్రి అనుచరులు లేదా మంత్రి పంపించినా వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లు తేలితే మంత్రి వెళ్ళినా తప్పు లేదు. అలా కాకుండా అసలు పట్టాభి మీద దాడి చేసింది ఎవరో తెలియకుండానే, రాష్ట్రంలో ఏదో శాంతిభద్రతలు విఘాతం కలిగినట్లు నానా హంగామా చేయడం వల్ల మంత్రి కొడాలి నాని పేరు ఉపయోగించడం వల్ల టీడీపీ కు పెద్దగా వచ్చేది ఏమీ ఉండదు.

పాత వివాదాలా ?!

టిడిపి నాయకుడు పట్టాల మీద దాడి కేసుకు సంబంధించి పోలీసులు కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ సంపాదించారు. ద్విచక్ర వాహనాల మీద వచ్చిన నిందితుడు ఒక గుంపుగా వచ్చి పట్టాభి కారును ధ్వంసం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిలో పట్టాభి మీద కూడా దాడి చేసినట్లు ఎక్కడా లేదు. మరి పట్టాభి తనకు తీవ్ర గాయాలు అయినట్లు చెప్పడం వెనుక అసలు విషయం ఏమిటనేది పోలీసులు కనుక్కోవాలి.

నాలుగు ద్విచక్ర వాహనాలు మీద వచ్చిన దుండగులు నిమిషాల్లో మొత్తం కారు అద్దాలు ధ్వంసం చేసి మళ్లీ ద్విచక్ర వాహనాల మీద పరారవడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆ ఫుటేజీలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో వేగం పెంచారు. అసలు ఈ దాడి వెనుక ఎలాంటి కుట్ర లు ఉన్నాయి అసలు ఎందుకు ఈ దాడి చేశారు అన్నది నిందితుల్లో ఒకరు దొరికినా మొత్తం కథ బయటకు వచ్చే అవకాశం ఉంది. అందులోనూ సీసీ కెమెరాల్లో ద్విచక్రవాహనాల నెంబర్ ప్లేట్లు సైతం స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో నిందితులను పట్టుకోవడం పోలీసులకు పెద్ద పని కాదు. వారిలో ఒకరు దొరికిన మొత్తం కథ బయటకు వస్తుంది. అంతమాత్రానికే ఏమాత్రం ఆగకుండా టిడిపి నేతలు దీనిని రాజకీయ రంగు పులిమేలా ఇష్టానుసారం మాట్లాడడం. ప్రభుత్వం మీద అనవసరమైన ఆరోపణలు చేయడం వల్ల రాజకీయంగా పెద్దగా లాభపడే అవకాశం అయితే లేదు.

ఆలయాల కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించటానికేనా ?

హిందూ ఆలయాల మీద దాడుల విషయంలో ప్రభుత్వం నియమించిన సిట్ బృందం రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దాడి విషయంలో టిడిపి నాయకులను నిందితుడిగా చేర్చింది. సాక్షాత్తు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సైతం ఆ కేసులో నిందితుడిగా ఉండడంతో ఇప్పుడు ఆ కేసును కప్పిపుచ్చుకునేందుకు ఈ కొత్త నాటకం ఆడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఏదైనా ఒక వివాదంలో తమ పార్టీ వారు ఉన్నట్లు తేలితే కొత్త వివాదం సృష్టించి… పాత వివాదాన్ని మరుగున పెట్టేందుకు ప్రజల నుంచి దానిని దూరం తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తారు. మీడియా సైతం దాని మీద ఫోకస్ పెట్టకుండా జాగ్రత్త పడతారు. ఇప్పుడు పట్టాభి విషయంలోనూ సరిగ్గా రాజమండ్రి వివాదంలో టిడిపి నేతలు అరెస్టు అవుతున్న సమయంలోనే ఇప్పుడు విజయవాడ అంశాన్ని తెర మీదికి తేవడం చూస్తే దీనిలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Show comments