Idream media
Idream media
అధికారంలోకి వచ్చిన 2014లోనే నెల్లూరులో తెలుగుదేశం పార్టీ పరిస్థితి పెద్ద ఆశాజనకంగా లేదు. ఆ జిల్లా నుంచి కేవలం మూడు సీట్లే గెలిచారు. ఆ ఎన్నికల్లో కూడా అక్కడ వైసీపీ సత్తా చాటింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఎదురైన పరాభవమే నెల్లూరులో కూడా ఎదురైంది. చావుదెబ్బ తింది. వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. గతంలో సాధించిన మూడు సీట్లను కూడా కోల్పోయింది. ఒక్క సీటు గెలవలేదు సరికదా, నెల్లూరు నగరం, సర్వేపల్లి, కావలి నియోజకవర్గాలలో తప్పితే మిగతా అన్ని నియోజకవర్గాలలోనూ భారీ తేడాతో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. దీంతో టీడీపీ అధ్వాన్నస్థితికి వెళ్లిపోయింది.
వరుస ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జిల్లాలో టీడీపీ తరఫున నిలబడే నాయకులు తగ్గిపోతున్నారు. మొత్తంగా చూస్తే సోమిరెడ్డి, బీద రవిచంద్ర వంటి ఇద్దరు, ముగ్గురు నాయకులు మినహా.. కొన్ని నియోజకవర్గాలకు పార్టీ బాధ్యతలు మోసేవాళ్ళు కనిపించడం లేదు. నెల్లూరు నగరం నుండి పోటీ చేసి కొద్దితేడాతో ఓడిపోయిన పి.నారాయణ ప్రస్తుతం నెల్లూరుకే దూరంగా వుంటున్నాడు. రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదు. వ్యాపారాలు చేసుకుంటున్నాడు. కోవూరు నుండి ఓడిపోయిన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కూడా యాక్టివ్ గా లేరు. పరిస్థితులను బట్టి రియాక్ట్ అవుతున్నాడు. ఖర్చులకు భయపడి చాలా మంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో అయినా కలిసి రాకపోతాదా అనే ఆశాదృక్పథంతో కొందరు ఏదోలా పార్టీని అంటిపెట్టుకుని ఉంటున్నారు. పార్టీ తరఫున, అధినేత తరఫున ఒకాల్తా పుచ్చుకుని అప్పుడప్పుడు స్పందిస్తున్నారు. పార్టీని గట్టెక్కించేందుకు వారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కలిసిరావడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను వారిని నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల నుంచి పరిషత్ ఎన్నికల వరకు ప్రజలు వైఎస్సార్‌సీపీకే పట్టం కడుతున్నారు.
నెల్లూరులో వైసీపీ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. జెడ్పీటీసీ స్థానాలను అయితే ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఎంపీటీసీ స్థానాల్లో 90 శాతం సీట్లను దక్కించుకుంది. టీడీపీ 6.13 శాతానికి పరిమితమైంది. దాదాపు 20 నెలల పాలన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు జగన్ కే జై కొడుతున్నారు. గ్రామీణులకు అందుతోన్న సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల తీర్పులో ప్రతిబింబించింది. మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో, ఇప్పటి వరకూ టీడీపీ మినహా మరే పార్టీ గెలుపొందని గ్రామాల్లో సైతం వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగరవేసింది. ఎన్నికలు జరిగిన 550 స్థానాలకు 495 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం చేజిక్కించుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు లభించిన మెజార్టీ కంటే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో లభించిన గణనీయంగా పెరిగింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లోనూ పరాభవం తప్పలేదు. వెంటకగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్వగ్రామం కమ్మవారిపల్లె పంచాయతీలోని లింగసముద్రం ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నావూరు కోటేశ్వరరావు విజయం సాధించారు. అక్కడ టీడీపీ కంటే బీజేపీకి నాలుగు ఓట్లు అధికంగా రావడంతో టీడీపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సొంతూరు పెద్దకొండూరులో టీడీపీ మట్టి కరిచింది.ఇక కీలక నేత, టీడీపీ జాతీయ స్థాయి నేతగా ప్రకటించుకునే మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం సర్వేపల్లెలో టీడీపీ కేవలం రెండు ఎంపీటీసీ స్థానాలకు పరిమితమైంది. సోమిరెడ్డి నివాసం ఉంటున్న అల్లీపురం ఎంపీటీసీ సైతం వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి స్వగ్రామం నార్త్‌రాజుపాళెం రెండు ఎంపీటీసీలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్వగ్రామం ఇసకపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపొందారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం స్వగ్రామం భీమవరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నెలవల మమత విజయం దక్కించుకున్నారు.
నెల్లూరులో టీడీపీ కంచుకోటలుగా ఉండే స్థానాల్లో కూడా ఘోర ఓటమి చవిచూడాల్సిన రావడంతో తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి పెరిగిపోతోంది. నియోజకవర్గాల్లోనే ఉండి పార్టీని నడిపిస్తున్న నాయకుల ఇలాకాల్లో కూడా టీడీపీ గెలవలేకపోయింది. ఈ పరిణామాలన్నీ నెల్లూరు లో టీడీపీ భవిష్యత్ ను ప్రశ్నార్థకంగా చేస్తున్నాయి.