వెలిగొండపై మాట్లాడే అర్హతుందా..?

వెలిగొండ ప్రాజెక్టును కేంద్రంగా చేసుకుని టీడీపీ తెరతీసిన రాజకీయాలు చూస్తున్న ప్రకాశం జిల్లా ప్రజలు ముక్కునవేలేసుకుంటున్నారు. ప్రాజెక్టును పూర్తి చేయడంపై జగన్‌సర్కార్‌ కట్టుబడి ఉండాలంటూ టీడీపీ నేతలు మంగళవారం మార్కాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడడం హాస్యాస్పదంగా ఉంది. పైగా ధర్నా కార్యక్రమానికి పట్టిసీమ నేతలైన చింతమనేని ప్రభాకర్‌ రావడం విశేషం. ప్రకాశం జిల్లా నేతలు మాట్లాడితే ప్రజలు రాళ్లేస్తారేమోనన్న భయంతో.. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ చరిత్ర తెలియని పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేతను తీసుకొచ్చి మాట్లాడించినట్లుగా తెలుస్తోంది.

1996 మార్చిలో ఈ ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. నాడు 9 ఏళ్లు కాలంలో కనీసం ప్రాజెక్టు సర్వే పని కూడా చంద్రబాబు చేయలేదు. వైఎస్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ శంకుస్థాపన చేసే వరకూ ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వైఎస్‌ హాయంలో గొట్టిపడియ, కాకర్ల, సుంకేసుల గ్యాప్‌లు పూర్తి చేయడంతోపాటు విదేశాల నుంచి సొరంగం తొలిసే యంత్రాలను తెప్పించి పనులు చేయించారు. ఆయన మరణం తర్వాత ప్రాజెక్టు పనులు కుంటుపడ్డాయి. గత ఐదేళ్లలోనూ చంద్రబాబు సొరంగం పని పూర్తి చేయలేకపోయారు. నాడు 9 ఏళ్లు, మొన్న 5 ఏళ్లు వెరసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. 18.8 కిలోమీటర్ల సొరంగం తొవ్వించలేకపోయారు. ఏడాదికి సరాసరి 1.3 కిలోమీటర్ల పని చేస్తే పూర్తయ్యే సొరంగం పనిపై సీతకన్ను వేసి.. ఇప్పుడు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలంటూ టీడీపీ నేతలు చేస్తున్న ధర్నా నాటకాలను ప్రకాశం జిల్లా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

జగన్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మొదటి సొరంగం పని పూర్తయింది. 11.5 కిలోమీటర్ల వరకూ పూర్తయిన రెండో సొరంగం పనిని వేగంగా చేసేందుకు చర్యలు చేపట్టింది. రాబోయే 18 నెలల్లో రెండో సొరంగం పూర్తి చేసేందుకు 16.5 కిలోమీటర్లు, 17.5 కిలోమీటర్ల వద్ద రెండు ఆడిట్‌ పాయింట్లు ఏర్పాటు చేసి నాలుగు వైపులా సొరంగం తొవ్వే పనులు చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రకాశం జిల్లాకు వెళ్లిన ప్రతిసారి వెలిగొండ ప్రాజెక్టు పూర్తిపై తేదీలు చెబుతూనే వచ్చారు.

2015 మార్చి 14వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనకు వచ్చిన చంద్రబాబు… వెలిగొండ ప్రాజెక్టును 2016 సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. మళ్లీ మరుసటి ఏడాది అంటే.. 2016 ఏప్రిల్‌ 16వ తేదీన మార్కాపురం పర్యటనకు వచ్చిన బాబు ఈ సారి అదే మాట చెప్పారు. కానీ తేదీ మార్చారు. 2017 చివరి నాటికి వెలిగొండ పూర్తి చేస్తామన్నారు. 2018 జనవరి 2వ తేదీన దర్శి పర్యటనకు వచ్చిన చంద్రబాబు.. వెలిగొండ ప్రాజెక్టును 2018 జూన్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. 2018 ఏప్రిల్‌లో కందుకూరు వచ్చిన సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టును 2018 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తానన్నారు. ఇక చివరగా.. 2018 జూలై 28న ఒంగోలు పర్యటనకు వచ్చినప్పుడు కూడా వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడారు. ఈ సారి వెలిగొండ ప్రాజెక్టును 2019 సంక్రాంతి నాటికి పూర్తి చేస్తానన్నారు.

ఇలా ప్రాజెక్టు పూర్తిపై మాటలు తప్ప చేతలు చూపించని చంద్రబాబును ఆది నుంచి పశ్చిమ ప్రకాశం వాసులు ఆదరించలేదు. ఎప్పుడూ ఇక్కడ టీడీపీకి చేదు ఫలితాలే వచ్చాయి. ఈ విషయాలు మరచి ప్రస్తుతం వేగంగా పనులు జరుగుతున్న ప్రాజెక్టు పనులను తమ రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తుండడం విడ్డూరంగా ఉంది. వెలిగొండ ప్రాజెక్టు గురించి తమకు మాట్లాడే అర్హత ఉందా..? అనే విషయం పై టీడీపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవడం సబబుగా ఉంటుంది.

Also Read : ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో అసలు నిజాలేంటి, చంద్రబాబు పాత్రే ఏమీ లేదన్నట్టుగా రాతలెందుకు?

Show comments