“అదానీ” ఎయిర్ పోర్టు బోర్డును పీకేసిన శివ‌సేన‌

ఏవియేషన్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అదానీ గ్రూపు ప్ర‌య‌త్నిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ గా మారిన సివిల్ ఏవియేషన్ పై కన్నేసింది. దీనిలో భాగంగా ప్ర‌ముఖ ఎయిర్ పోర్టుల‌ను ఒక్కొక్క‌టిగా హ‌స్త‌గ‌తం చేసుకుంటోంది. కేవలం మెట్రో నగరాల్లోని ఎయిర్ పోర్టులపైనే కాకుండా, దేశంలోని టైర్ 2, 3 సిటీల్లోనూ ఏవియేషన్ సేవల విస్తరణకు ఆ గ్రూప్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జైపూర్, కొచ్చి, తిరువనంతపురం, గువాహటి సహా 6 ఎయిర్ పోర్టుల నిర్వహణకు ఒప్పందం చేసుకున్న అదానీ ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ, అభివృద్ధి కాంట్రాక్టు ను ఇటీవ‌ల జీవీకే గ్రూపు నుంచి అదానీ గ్రూప్ చేతికి వెళ్లింది. ఈ ప్ర‌తిపాద‌న‌ను ఆది నుంచీ శివ‌సేన వ్య‌తిరేకిస్తోంది.

ముంబైలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం పేరును ‘అదానీ ఎయిర్ పోర్టు’ గా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ శివసేన కార్యకర్తలు సోమవారం ఈ బోర్డును లాగివేసి ధ్వంసం చేశారు. అదానీ గ్రూప్ ఈ విమానాశ్రయాన్ని అదానీ ఎయిర్ పోర్టుగా మార్చాలని తీసుకున్న నిర్ణయాన్ని శివసేన తీవ్రంగా తప్పు పడుతోంది. ఈ ఎయిర్ పోర్టు పేరును మార్చడానికి ఈ గ్రూప్ కు హక్కు లేదని పేర్కొంది. విమానాశ్రయ ఏరియా లోని వీఐపీ గేటు వద్ద ఈ కొత్త బోర్డును గ్రూప్ ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రతిపాదనను తాము ఏనాడో వ్యతిరేకించామని, అలాంటిది మళ్ళీ ఈ బోర్డు పెట్టారేమిటని శివసేన ప్రశ్నిస్తోంది. జీవీకే గ్రూపు నుంచి ఈ ఎయిర్ పోర్టు నిర్వహణ కార్యకలాపాలను అదానీ గ్రూప్ గత జులైలో చేపట్టింది. ఈ కొత్త యాజమాన్యంలో ఈ గ్రూప్ కి 74 శాతం వాటా ఉండగా జీవీకే గ్రూపు 50.5 శాతం, ఇతర ఎయిర్ పోర్ట్స్ కంపెనీ, సౌతాఫ్రికా, బిద్వెస్ట్ గ్రూప్ వంటి చిన్న సంస్థలు 23.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

అయితే దీని పేరు మార్పు కోసం తాము ఏనాటి నుంచో యత్నిస్తున్నామని అదానీ గ్రూప్ అంటోంది. ఇక ఇది మహారాష్ట్రలో..ముఖ్యంగా ముంబైలో చినికి చినికి గాలివానగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విమానాశ్రయం పేరు మార్పును ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అంగీకరించే ప్రసక్తి లేదని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో భాగస్వామి అయిన శివసేన తేల్చి చెబుతోంది. ఇక ఇతర పార్టీలు కూడా దీనికి పరోక్షంగా మద్దతునిస్తున్నట్టు కనిపిస్తోంది.

ముంబై ఎయిర్ పోర్టును అదానీ గ్రూపున‌కు అప్ప‌గించ‌డం శివ‌సేన‌, బీజేపీ మ‌ధ్య వైరాన్ని మ‌రింత పెంచింది. మహారాష్ట్ర ఆస్తులను గుజరాతీలకు కట్టబెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని శివసేన ఆరోపించింది. ముంబై ఎయిర్‌పోర్ట్‌ను అదానీకి అమ్మేశారని నిరసనకు దిగారు శివసేన కార్యకర్తలు. ఎయిర్‌పోర్ట్‌లో అదానీ బోర్డును ధ్వంసం చేశారు. ఈ సంద‌ర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో శివసేన జెండాలు పాతారు.

ఈ విమానాశ్రయం దేశంలోనే రెండో అతిపెద్ద రద్దీ విమానాశ్రయంగా ఉంది. కాగా తాజా ఘటన నేపథ్యంలో అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (ఏఏహెచ్‌ఎల్‌) అధికారప్రతినిధి మాట్లాడుతూ.. క్రితం బ్రాండింగ్‌ స్థానంలో అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ బ్రాండింగ్‌ను భర్తీ చేశామని, ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌ (సీఎస్‌ఎంఐఏ) బ్రాండింగ్‌ లేదా టెర్మినల్‌ వద్ద పొజిషనింగ్‌లో ఎలాంటి మార్పు చేయలేదని పేర్కొన్నారు. సీఎస్‌ఎంఐఏ వద్ద బ్రాండింగ్‌ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిబంధనలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నట్టు తెలిపారు.

Show comments