Idream media
Idream media
తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠకు తెరపడుతోంది. ఒక్కొక్కరి పేర్లను అధిష్టానం ప్రకటిస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, టి.రవీందర్ రావు పేర్లను ఫైనల్ చేసినట్లుగా ప్రకటన వెలువడింది. ఈ ప్రకటన వెలువడుతున్న సందర్భంలోనే మరో బ్రేకింగ్ న్యూస్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదే సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి రాజీనామా. టీఆర్ఎస్ లో చేరేందుకే ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీగా అధిష్టానం అవకాశం ఇచ్చిందని, ఈ మేరకు ప్రగతిభవన్ నుంచి ఆయనకు సమాచారం ఇవ్వగానే రాజీనామా చేశారని, ప్రభుత్వం కూడా ఆమోదించినట్లు తెలుస్తోంది. వెంకట్రామిరెడ్డికి కూడా ఎమ్మెల్యే కోటాలోనే ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎవరీ వెంకట్రామరెడ్డి..
పి. వెంకట్రామరెడ్డి పెద్దపల్లి జిల్లా ఓదెలలో జన్మించారు. 1991లో గ్రూప్-1 ఆఫీసర్‌గా ప్రభుత్వ సర్వీసుల్లో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బందర్, చిత్తూరు, తిరుపతిలో ఆర్డీవోగా పని చేశారు. మెదక్ జిల్లాలో డ్వామా పీడీగా సేవలందించారు. హుడా సెక్రటరీ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా కూడా వెంకట్రామరెడ్డి సేవలు అందించారు. సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఏడేళ్లుగా జేసీగా, కలెక్టర్ గా సిద్దిపేటలో ఆయన సేవలు అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచీ కూడా ఆయన రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచేవారు. మంత్రి హరీశ్‌రావు వద్ద తమ అభిమతాన్ని పలుమార్లు తెలియజేసినట్లుగా కూడా తెలిసింది. దీంతోనే ఎన్నికలు వచ్చినప్పుడల్లా వెంకట్రామరెడ్డి రాజీనామా, రాజకీయ ప్రవేశంపై చర్చ జరుగుతూనే ఉండేది. తాజాగా వెంకట్రామరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు అందజేయడం, వెంటనే ఆమోదించడం వడివడిగా జరిగిపోయాయి.
Also Read : Telangana Election Code -కోడ్ ముగిశాక వార్ పెరగనుందా..?
గతంలో కూడా..
వెంకట్రామరెడ్డి రాజకీయరంగ ప్రవేశంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయన ఎంపీ సీటు ఆశించారు. ఒకానొక దశలో మల్కాజిగిరి ఎంపీ స్థానానికి టిఆర్ఎస్ పార్టీ తరఫున వెంకట్రామిరెడ్డికి టికెట్ దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. చివరి క్షణంలో అది కూడా చేజారడంతో ఆయన కొంత నిరాశకు లోనయ్యారు. తర్వాత కలెక్టర్ గా తన పని తాను చేసుకుపోతున్నారు. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక టికెట్ ను కూడా ఆయన ఆశించారని, ఆ సందర్భంగానే ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
అందుకే రాజీనామా చేశా..
రాజీనామా, రాజకీయ రంగ ప్రవేశంపై వెంకట్రామరెడ్డి స్పందించారు. దేశాన్ని సీఎం కేసీఆర్ అత్యున్నత స్థానంలో ఉంచారని, వారి కృషి, శ్రమ దగ్గరుండి చూశానని వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రావడం ఓ అదృష్టమైతే, కేసీఆర్ సీఎం కావడం మరో అదృష్టమన్నారు. సిద్దిపేట జిల్లాలో ఎనిమిదేళ్లు పని చేసే అవకాశం దక్కడం తన అదృష్టమన్నారు. భారతదేశంలోనే అన్ని విధాలుగానూ రాష్ట్రాన్ని అభివృద్ది మార్గంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి వెంబడి ఉండాలనే కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేశాను అన్నారు. ముఖ్యంగా ఏడేళ్లలో తెలంగాణ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని, గంటలు, రోజుల తరబడి అభివృద్ధి కార్యక్రమాలపై ఆలోచిస్తూ, రానున్న వందేళ్ల తెలంగాణ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్న కేసీఆర్ కు తాను కూడా అతి సమీపంలో ఉండి, ఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశానని పేర్కొన్నారు. అయితే, టీఆర్ఎస్ లో ఎప్పుడు చేరేది ఇంకా తెలీదని, ప్రగతిభవన్ నుంచి ఎటువంటి పిలుపూ రాలేదని చెప్పడం గమనార్హం.
Also Read : Telangana KCR MLC -తెలంగాణలో కొత్త ఎమ్మెల్సీలు వీరేనా?