iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరోసారి తన చిత్తశుద్ధిని చాటుకునే యత్నం చేశారు. దానిని కార్మిక సంఘాల నేతలు హర్షించారు. ముఖ్యమంత్రి స్పందన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి జగన్ మరోసారి స్పష్టం చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా ఎయిర్ పోర్ట్ లాంజ్ లో కార్మిక సంఘాల నేతలతో ఆయన భేటీ అయ్యారు. వారి నుంచి వినతిపత్రం స్వీకరించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ తమ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తోందని తేల్చిచెప్పారు. దానికి అనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తామని హామీ ఇచ్చారు.
ఈసందర్భంగా సీఎం జగన్ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. టీడీపీ సహా వివిధ విపక్షాల నేతలు పోస్కో ప్రతినిదులు వచ్చి సీఎంతో భేటీ అయిన విషయాన్ని ప్రస్తావిస్తున్న నేపథ్యంలో జగన్ వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన అసలు లక్ష్యాన్ని చాటిచెప్పారు. పోస్కో కంపెనీ త్వరలోనే ఏపీలో కొత్త ప్లాంట్ నిర్మించబోతున్న విషయాన్ని వెల్లడించారు. విపక్షాల నోటికి తాళం వేసే రీతిలో సీఎం చేసిన ప్రకటన రాజకీయంగా కీలకాంశం కాబోతోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ కి జగన్ అంగీకరించారని, అందుకే పోస్కో ప్రతినిధులతో భేటీ అయ్యారని టీడీపీ నేతలు వారం రోజుల నుంచి అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. అయితే సీఎం జగన్ దానికి సంబంధించి పోస్కో ఏపీలోని కృష్ణపట్నం లేదా భావనపాడు పోర్టుల సమీపంలో ప్లాంట్ నిర్మాణానికి సుముఖంగా ఉందనే విషయాన్ని వెల్లడించారు. పోస్కో ప్రతినిధులు తనను వచ్చి కలిసిన మాట వాస్తవమే అయినప్పటికీ దానికి అసలు కారణం వేరని చెప్పారు. పోస్కో విశాఖ ప్లాంట్ కోసం ప్రయత్నిస్తుందనడంలో వాస్తవం లేదన్నారు. కడప, కృష్ణపట్నం, భావనపాడు వంటి ప్రాంతాల్లో ప్లాంట్ నిర్మించాలని తాను కోరితే వారు మాత్రం కృష్ణపట్నం, భావనపాడు వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఎక్కడ పరిశ్రమ వచ్చినా తాను సంతోషిస్తానని సీఎం జగన్ కార్మిక సంఘాల నేతలకు వివరించారు.
సీఎం ప్రకటనతో పోస్కో మాటున చంద్రబాబు అండ్ కో చేస్తున్న ప్రచారం నిరాధారమని తేలిపోయింది. పైగా విశాఖ ప్లాంట్ కోసం పోస్కో వస్తుందనడంలో నిజం లేదని సీఎం చెప్పడం, అదే సమయంలో కొత్త ప్లాంట్ ఏర్పాటుకి ఆ సంస్థ సుముఖంగా ఉందని తేలడంతో విపక్షాల నోటికి తాళం పడినట్టయ్యింది.