ఏపీలోనూ ఈఎస్‌ఐ స్కాం… మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పాత్ర

కార్మిక రాజ్య భీమా సంస్థ (ఈఎస్‌ఐ)లో మందులు, వైద్య పరికరాల్లో వందల కోట్ల రూపాయల కుంభకోణం తెలంగాణాలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లోనూ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఏపీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈ కుంభకోణం వెనుక వాస్తవాలను బట్టబయలు చేసింది. దాదాపు 151 కోట్ల రూపాయల మేర దోపిడీ జరిగినట్లు నిర్థారించింది. 2014 –19 మధ్య ఈ తంతు సాగినట్లు తేల్చింది. ఈ వ్యహారంలో అప్పట్లో రాష్ట్ర కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రస్తుత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కీలక పాత్ర పోషించారు.

అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫారుసు లేఖ ద్వారా వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లు టెండర్లు ఏకుండానే నామినేషన్‌పై సరఫరా చేసేలా కాంట్రాక్టులు ఇవ్వడంతో ఈ దోపిడీ జరిగినట్లు వెల్లడైంది. గత ఐదేళ్లలో కొనుగోలు చేసిన మందుల విలువ 38.58 కోట్ల రూపాయలు కాగా 51.02 కోట్లు అధనంగా చెల్లించారు. వైద్య పరికరాలను నామినేషన్‌పై కొనుగోలు చేశారు. అయితే వాటి వాస్తవ విలువ కన్నా 10.43 కోట్లు అధికంగా చెల్లించారు. ల్యాబ్‌ కిట్‌లలో 85.32 కోట్లు అధికంగా చెల్లించారు. ఫర్నీచర్‌లో 4.63 లక్షలు మింగేసినట్లు తేల్చారు. ఐదేళ్లలో మందుల కొనుగోళ్లకు సగటును 132.30 శాతం అధికంగా చెల్లించారని విజిలెన్స్‌ అండ్‌ ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాజేంద్రనాథ్‌ రెడ్డి వెల్లడించారు.

తెలంగాణలోని ఈఎస్‌ఐ కుంభకోణంలో ఉన్న సంస్థలే ఇక్కడ ఉన్నట్లు తేలింది. అచ్చెన్నాయుడు సిఫారుసుతోపాటు ఈఎస్‌ఐలోని ఉన్నతాధికారులు ఈ దోపిడీలో ఉన్నట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తెలిపింది. ఈఎస్‌ఐ అప్పటి డైరెక్టర్లు డా.బి.రవికుమార్, డా. విజయ్‌కుమార్, ఫార్మసిస్ట్‌ ధనలక్ష్మీ, సీనియర్‌ అసిస్టెంట్‌ ఈ.రమేష్‌బాబు, జాయింట్‌ డైరెక్టర్లు డా. జి. జగదీప్‌గాంధీ, డా. వి. కృష్ణ కుమారి, డా. వి. జనార్థన్, డా. వి. చంద్రశేఖర్, డా. టి. సరళతోపాటు పలువురు డాక్టర్లు, అధికారులు ఉన్నారు.

Show comments