కొరోనా దెబ్బకి కోడి విలవిలా..

  • Published - 08:24 AM, Sat - 15 February 20
కొరోనా దెబ్బకి కోడి విలవిలా..

ఒకపక్క కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తి పట్ల చైనా తో పాటు ప్రపంచమంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మనదేశంలో ఈ వ్యాధి పై సామాజిక మాధ్యమాలలో అనేక పుకార్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయితే ఈ పుకార్ల వెనుకున్న నిజానిజాలు ఆలోచించకుండా సోషల్ మీడియాలో ప్రచారమౌతున్న ఈ వదంతలును ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారు. అందుకు తాజా ఉదాహరణే దేశ వ్యాప్తంగా మరి ముఖ్యంగా మన తెలుగురాష్ట్రాల్లో కోళ్లలో కరోనా వైరస్ ఉన్నట్టు.. కోడిగుడ్డు, చికెన్ తినడం ద్వారా కరోనా వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్టుగా.. ఒక తప్పుడు వార్త సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తుంది.

అయితే ఇవి ఒట్టి వదంతులేనని డాక్టర్లు తెలిపారు. కోళ్లు కోడిగుడ్లతో కరోనా వైరస్ వున్నట్టుగా జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, కరోనా వైరస్ కు కోళ్లకు అసలు సంబంధమే లేదని, ఆ ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మవద్దని డాక్టర్లు, వైద్యాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వదంతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారికంగా స్పందించాయి. కోడిగుడ్డు, చికెన్ ఆరోగ్యకరమైన సురక్షితమైన ఆహారమని, ప్రజలు ఎలాంటి ఆందోళన లేకుండా నిర్భయంగా కోడిగుడ్లు, చికెన్ లు తినవచ్చని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.

మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ప్రసారామౌతున్న వదంతుల నేపథ్యంలో ప్రజలు కోడిగుడ్లు చికెన్ తినడానికి బెంబేలెత్తుతున్నారు. దీనితో కొనేవాళ్ళులేక చికెన్, కోడిగుడ్లు ధరలు భారీగా పడిపోయాయి. నగరాలు, పట్టణాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్ వంటకాలు తినేవాళ్ళే కరువయ్యారు. పౌల్ట్రీ పరిశ్రమ పై పుకార్ల ప్రభావం దారుణంగా పడింది. పౌల్ట్రీ రంగం పై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది కుటుంబాలు జీవిస్తున్న తరుణంలో, కరోనా వైరస్ వదంతుల వల్ల పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో ధరలు గిట్టుబాటు కాక నష్టాలు చెవి చూస్తున్నామని, ఇప్పుడు ఈ కరోనా వైరస్ వదంతులతో తామ పరిస్థితి దారుణంగా ఉందని పౌల్ట్రీ రైతులు, పౌల్ట్రీఫారాల యజమానులు వాపోతున్నారు.

Show comments