ఏపీ కాంగ్రెస్.. రాహుల్ ఫోక‌స్..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ ప‌రిస్థితి గ‌తించిన కాలంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన త‌ర్వాత అక్క‌డ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రాష్ట్రం విడిపోయిన అనంత‌రం రెండు సార్లు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా, రెండు సార్లూ జీరోకే ప‌రిమిత‌మైంది. మ‌రో ఇర‌వై ఏళ్ల‌యినా ప‌రిస్థితిలో మార్పు వ‌స్తుందా అంటే.. క‌చ్చితంగా అవును అని ఆ పార్టీ నాయ‌కులే చెప్ప‌లేని దుస్థితి. ద‌శాబ్దాల చ‌రిత్ర గ‌ల పార్టీ క‌నుమ‌రుగు కాకుండా క‌నీసం ఉనికి చాటేలా బ‌లోపేతం చేసేందుకు హై క‌మాండ్ మాత్రం తీవ్ర త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డుతోంది. ఈ క్ర‌మంలో రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ నేత‌ల‌తో వ‌రుస‌గా భేటీ అవుతున్నారు.

మెగా హీరో, కాంగ్రెస్ మాజీ ఎంపీ చిరంజీవి ఎప్ప‌టి నుంచో పార్టీకి దూరంగా ఉంటున్నారు. కానీ కాంగ్రెస్ నేత‌లు మాత్రం ఆయ‌న మా పార్టీ నాయ‌కుడే అంటూ చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా.. ఆయ‌న ద్వారా ఏపీలో కాంగ్రెస్ కు జ‌వ‌స‌త్వాలు నింపాల‌ని హై క‌మాండ్ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేశారు. చేస్తూనే ఉన్నారు. చిరంజీవి మాత్రం నో, ఎస్ఏ.. అని ఏదీ చెప్పుకుండా చిరున‌వ్వుతో సాగ‌నంపుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. తెలంగాణ కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించ‌డం ద్వారా వ‌చ్చిన ఊపుతో.. ఏపీ కాంగ్రెస్‌కు బ‌ల‌మైన వ్య‌క్తిని అధ్య‌క్షుడిగా నియ‌మించి కొత్త జవసత్వాలు నింపే దిశగా చర్యలు చేప‌డుతున్నారు.

టీపీసీసీ చీఫ్ నియామ‌కం త‌ర్వాత గ‌త నెల‌లోనే రాహుల్ గాంధీ ఏపీ లోని కీల‌క నాయ‌కుల‌కు ఫోన్ చేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం మ‌రి కొద్ది రోజుల్లో ఢిల్లీ కి రావాల్సి ఉంటుంద‌ని కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు, రఘువీరారెడ్డి సహా పలువురు నేతలకు ఈ మేరకు చెప్పిన‌ట్లు స‌మాచారం. ఇప్పటికే పంజాబ్, తెలంగాణ, కర్నాటక, మహరాష్ట్ర, అస్సాం,కేరళ సహా పలు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ నేప‌థ్యంలో నేడు ఏపీకి సంబంధించిన ముఖ్య కాంగ్రెస్ నేతలతో రాహుల్ స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. కేవీపీ, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పల్లంరాజుతో విడివిడిగా రాహుల్ గాంధీ భేటీకానున్నారు. పార్టీలోని దళిత నేతలు హర్షకుమార్, చింతమోహన్, జేడీ శీలంతో ఇప్పటికే రాహుల్ చర్చించారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే ఏం చేయాలనే దానిపై ఆ పార్టీ హైకమాండ్ ఇప్పటికే సమాలోచనలు జరుపుతోంది. దీనిపై ఓ సమగ్ర నివేదిక ఇవ్వాలని రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీని ఆదేశించారని.. ఆయన ఈ అంశంపైనే కసరత్తు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల‌లో ఏపీ కాంగ్రెస్‌లో సమూల మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్‌ను మార్చి.. ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తారా లేక ఆయనను కొనసాగిస్తూనే మిగతా ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగిస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది.

Show comments