Idream media
Idream media
రాష్ట్ర విభజన శాపం నుండి ఇంకా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బయటపడడం లేదు. విభజనకు ముందు పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తో తన మరణ శాసనాన్ని తానే రాసుకుంది. రాష్ట్ర విభజనతో తెలుగు రాష్ట్రాల్లో దెబ్బ తిన్న కాంగ్రెస్ తెలంగాణ మాత్రం ఎంతోకొంత బలాన్ని కూడగట్టిన, ఏపీలో మాత్రం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 2004,2009 ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను సాధించి యూపీఏ1, 2లో కీలక మంత్రులుగా తెలుగు కాంగ్రెస్ నాయకులు చెలామణి అయ్యారు.
2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కస్థానం కూడా గెలుచుకో లేకపోయింది. విభజనతో తమకు అన్యాయం చేశారని ప్రజలు కాంగ్రెస్ కు కర్రుకాల్చి వాతపెట్టారు. ఒక్క సీటు కూడా గెలవలేదు. కాంగ్రెస్ ఓటింగ్ శాతం 3శాతానికి పడిపోయింది. దీన్ని బట్టి ప్రజల్లో ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.
పార్టీని వీడిన నాయకులు..
కాంగ్రెస్ పదేళ్ల ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రి,కేంద్ర మంత్రి,పార్టీ అధ్యక్ష పదవులు అనుభవించిన నాయకులు 2014 తరువాత మెల్లిగా ఎవరిదారి వాళ్ళు చూసుకున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి మళ్ళీ నిలబెట్టాలిసిన నేతలు ఒక్కొక్కరుగా విడడంతో ఏపీలో మనుగడ కూడా కష్టమనే పరిస్థితికి కాంగ్రెస్ చేరింది. దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొన్ని కుటుంబాలు తరతరాలుగా కంచుకోటలాగా ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు మాత్రమే మిగిలారు. కొద్దోగొప్పో నాయకులు ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు.
2004 2009 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో అత్యధిక ఎంపీ సీట్లు ఇచ్చి ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పార్టీకి పునరుజ్జీవం పోసేందుకు ఒక్క నేత కూడా ముందుకు రాలేదంటే కాంగ్రెస్ పార్టీ ఎంతటి దుస్థితి లోకి చేరిందో అర్థం చేసుకోవచ్చు.చివరికి మాజీమంత్రి రఘువీరారెడ్డి బాధ్యతలు భుజాన వేసుకొని కాంగ్రెస్ ను బతికించే ప్రయత్నం చేశారు. కానీ చివరికి పీసీసీ బాధ్యతల నుండి తప్పుకొని రఘువీరారెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తరువాత అనంతపురంకు చెందిన మాజీ మంత్రి సాకె శైలజానాథ్ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించారు. అయినా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో మార్పు రాలేదు. మాజీ కేంద్రమంత్రుల అనుభవం, రాష్ట్ర ముఖ్యమంత్రులు, మెగాస్టార్ లాంటి నటుల చరిష్మా కూడా ఎం పని చేయలేదు.
Also Read : సోనియా గాంధీ మమతాల కలయిక ప్రతిపక్షాలను ఏకం చేస్తుందా?
కొత్త పీసీసీ కోసం కసరత్తు…
దింపుడు కల్లం ఆశగా కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ కు పునర్వైభవం తెచ్చేందుకు 20మది సీనియర్ నేతతో సమావేశం అయ్యేందుకు సిద్ధం అయ్యారు. తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఇచ్చినట్లుగా ఏపీలో కూడా యువనేతకు కాంగ్రెస్ బాధ్యతలు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది హైకమాండ్. అయితే త్వరలో ఏపీ కాంగ్రెస్ ఇంచార్జి ఉమెన్ చాందీ, 20మంది కాంగ్రెస్ నేతలతో రాహుల్ సమావేశం కానున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పరిస్థితి కాదు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇలానే ఉంది. మరోవైపు జాతీయ కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేయాలని సీనియర్ నేతలంతా తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారి పోయింది. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా సక్సెస్ కాకపోవడంతో దేశంలో ముందుండి కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకుడు లేకపోవడం తో అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది.
అయితే 2024 ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పీసీసీ లను ప్రక్షాళన చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లోని పీసీసీ చీఫ్ లను మార్చి కొత్త నాయకత్వానికి అప్పగించాలని భావిస్తున్నారు. ఇందుకోసం కొత్త పీసీసీ కోసం అన్వేషించాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిలను ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేలా పని చేసేది ఎవరు..? మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న నాయకుల జాబితా తయారు చేయాలని రాహుల్ గాంధీ ఆదేశాలు జారీ చేశారు.
కాంగ్రెస్ లో ప్రశాంత్ కిషోర్ కొత్త జోష్..
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో పని చేస్తున్నట్లు సంకేతాలు రావడంతో కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరడానికి నాయకులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 20శాతం కాంగ్రెస్ ఓటు బ్యాంకు చేజారకుండా ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ ముందుకు పోతుంది. నాయకులు మారిన ఓటు బ్యాంకు ఇంకా కాంగ్రెస్ వైపే ఉన్నట్లు భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ఆశావహులకు ఉత్సహం ఇచ్చేలా కొత్త పీసీసీ ఎన్నిక ఉండాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. కొత్త పీసీసీ రేసులో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ముందంజలో ఉంది. మెగాస్టార్ చిరు పేరుకుడా వినిపిస్తుంది. ఎవరు పీసీసీ చీఫ్ అయినా ఏపీలో కాంగ్రెస్ కు పునర్వైభవం తేవడం కత్తిమీద సామే.
Also Read : రేవంత్ కు సీనియర్ల పోటు తప్పడం లేదా?