Idream media
Idream media
అధికార పార్టీ టీఆర్ఎస్ లోనూ అక్కడక్కడ అంతర్గత పోరు బయటపడుతూనే ఉంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన నేతల మధ్య ఉప్పు, నిప్పులా వైరం ఉండేది. పైకి గులాబీవనంలా అందంగా కనిపిస్తున్నా.. లోపల అంతా అంతర్గత పోరు నడిచేది. కొందరు పార్టీ కార్యక్రమాలకు, మరి కొందరు ప్రైవేటు కార్యక్రమాలకే పరిమితమవుతూ భవిష్యత్ లో ఎవరికి వారే తమదే పై చేయి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సిట్టింగ్ లు ప్రభుత్వ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ.. నియోజకవర్గాలకు తామే బాస్ లం అన్నట్లు వ్యవహరిస్తుంటే.. ఇతర నేతలు తమ అనుచరుల, పార్టీ శ్రేణులకు సంబంధించిన కార్యక్రమాలకు హాజరవుతూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఇలా ఎవరికి వారు వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్నారు. ప్రధానంగా మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహిరంగంగానే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. కార్యకర్తలు కూడా రెండు వర్గాలుగా విడిపోయి వాదోపవాదాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఒకే వేదికపై ఆ ఇద్దరు నేతలు ఐక్యతా రాగాన్ని ఆలపించడం గమనార్హం.
గత అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచీ మంత్రి పువ్వాడ, ఎంపీ పొంగులేటి మధ్య పొసగడం లేదని ఖమ్మం జిల్లాలో వార్తలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఓ సందర్భంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తాను చేపట్టే కార్యక్రమాలకు వస్తోన్న ప్రజాప్రతినిధులపై అధికారంలో ఉన్న నేతలు కక్ష కడుతున్నారని ఆరోపించారు. తానూ అధికార పార్టీ నేతనే అనే విషయాన్ని మరిచారని వ్యాఖ్యానించారు. నేడు పదవిలో ఉన్న ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ చెట్టు నీడలో ఉన్నవారే అని పేర్కొన్నారు. తనపట్ల జరుగుతున్న పరిణామాల విషయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధైర్యపడొద్దని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పదవులు శాశ్వతం కాదని, సమయం వచ్చినప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మంత్రి పువ్వాడను ఉద్దేశించినవే అని టీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా చర్చించుకున్నారు. దీనికి తోడు పొంగులేటి పుట్టిన రోజు సందర్భంగా ఖమ్మంలో ఫెక్సీల ఏర్పాటు భారీ వివాదాన్నే రేపింది. ఫ్లెక్సీల ఏర్పాటుకు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి రాకపోవడం విమర్శలకు తావిచ్చింది. మంత్రి పువ్వాడ ఆదేశాల మేరకే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని పొంగులేటి అనుచరులు ఆరోపించారు. అంతటితో ఆగకుండా హోర్డింగులు సైతం ఎక్కి రచ్చరచ్చ చేశారు.
పార్టీపై మార్పుపై కూడా ఊహాగానాలు
ఆ ఇద్దరి నేతల మధ్య చోటుచేసుకుంటున్న విబేధాల నేపథ్యంలో పొంగులేటి పార్టీ మారబోతున్నారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. పొంగులేటి పుట్టిన రోజునాడు సత్తుపల్లిలో అభిమానులు కేక్ కట్ చేసి, ఆయనకు పదవి రాకుండా కొందరు అడ్డుపడుతున్నారంటూ విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా పొంగులేటి ప్రధాన అనుచరులు కొందరు బీజేపీలో చేరారు. దీంతో పొంగులేటి కూడా బీజేపీలో చేరేందుకు వీలుగా ముందు తన అనుచరులను ఆ పార్టీలోకి పంపుతున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొంత కాలం ఇద్దరు నేతలూ స్తబ్దుగా ఉన్నారు. కానీ తాజాగా ఇద్దరు నేతలు ఒకే వేదికను పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.
కలిసే ఉన్నాం.. కలిసే ఉంటాం..
‘నేనూ.. శీనన్న కేటీఆర్‌కు రెండు కళ్లలాంటి వాళ్లం. మేమిద్దరం కలిసే పనిచేస్తున్నాం. పార్టీలో అంతా సహృద్భావవాతావరణం ఉంది. మేమంతా మంచిగానే ఉన్నాం. మీరెందుకు బుర్రలు పగలగొట్టుకుంటారు. కలిసికట్టుగా పనిచేద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపించుకుందాం’ అంటూ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా వైరాలోని ఓ కల్యాణమండపంలో బుధవారం రాత్రి ఎమ్మెల్యే రాములునాయక్ అధ్యక్షతన జరిగిన వైరా, కొణిజర్ల మండలాల స్థాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పొంగులేటిని ఉద్దేశించి కార్యకర్తలు నినాదాలు చేసిన సమయంలో మంత్రి ఆసక్తికరంగా మాట్లాడారు. సమావేశానికి మాజీ ఎంపీ పొంగులేటి కాస్త ఆలస్యంగా వచ్చారు.
అదే సమయంలో మంత్రి పువ్వాడ ప్రసంగిస్తుండగా.. పొంగులేటి రాకతో కార్యకర్తలు ఒక్కసారిగా ‘శీనన్న జిందాబాద్, శీనన్న నాయకత్వం వర్థిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో మంత్రి జోక్యం చేసుకుని కార్యకర్తలు, నాయకులు ఇక నిశబ్దంగా ఉండాలని, ఇది ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశమని, ఇక్కడ వ్యక్తిగత నినాదాలు సరికాదని హితవు పలికారు. తాను, పొంగులేటి కేటీఆర్‌కు రెండు కళ్లలాంటి వాళ్లమని, తాము కలిసే పనిచేస్తున్నామని, ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించుకునేందుకు సమష్టిగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇక్కడ బలప్రదర్శన సరికాదని, తాము కలిసికట్టుగా పనిచేస్తున్నామని, తాను టీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని, టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. బీజేపీ మైండ్‌గేమ్‌ను చిత్తు చేసి.. అధికారంలోకి వస్తామన్న కలలను కల్లలు చేయాలని, పార్టీ అప్పగించే ఏ బాధ్యతనైనా చిత్తశుద్ధితో నిర్వహిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కేటీఆర్ తో భేటీ మార్పు తెచ్చిందా?
జీహెచ్ ఎంసీ ఎన్నికల ఫలితాలు తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ ప్రగతిభవన్‌లో ఒక్కో జిల్లాకు చెందిన ముఖ్యనేతలతో విడతలవారీగా సమావేశాలు నిర్వహించారు. అలాగే గత నెలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ, మాజీమంత్రి తుమ్మల, ఎంపీ నామ, మాజీ ఎంపీ పొంగులేటి సహా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, ముఖ్యనేతలు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, పట్టభద్రుల ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణుల మధ్య ఉన్న అంతర్గత పోరుపైనా కేటీఆర్ చర్చించారు. మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ పొంగులేటి మధ్య జరిగిన పరిణామాలపై ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలిసింది. అంతర్గత విభేదాల వల్ల
ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతోందని, అంది మంచిది కాదని పేర్కొన్నారని, కార్పొరేషన్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని చెప్పినట్లు తెలిసింది. దీనిలో భాగంగానే ఆ ఇద్దరు నేతలు పల్లా రాజేశ్వరరెడ్డి కి మద్దతుగా ఒకే వేదికపై ప్రచారం నిర్వహించినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఐక్యత ఎప్పటి వరకూ నిలుస్తుందో వేచి చూడాలి.