iDreamPost
iDreamPost
మొన్న 2019 ఎన్నికల్లో ఎంతమంది మంత్రులు గెలిచారు?ముగ్గురే ముగ్గురు గంటా, అచ్చెం నాయుడు , చినరాజప్ప మాత్రమే బయటపడింది.. లోకేష్ తో సహా మిగిలిన మంత్రులు అందరు ఓడిపోయారు… జగన్ సునామీలో కూడా అచ్చెం నాయుడు ఎలా గెలవగలిగాడు? పార్టీని మించిన బలం ఉందా? అచ్చెం నాయుడు రాజకీయ పునాది ఏంటి?
చరిత్రలో చాలా విషయాలు కన్వీనియంట్ గా మరుగున పడుతుంటాయి,మరుగున పరుస్తుంటారు కూడా… ఐదేళ్లకొకసారి వొచ్చే ఎన్నికలతో పాటు చరిత్ర కూడా తిప్పి రాయబడుతుంది … ఆ చరిత్రను తెలుసుకుంటేనే వర్తమానాన్ని విశ్లేషించగలం ..
ఎర్రం నాయుడు…
పరిచయం అక్కరలేని పేరు.. చనిపోయి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి శ్రీకాకుళం జిల్లా టీడీపీ రాజకీయాలు ఆయన వేసిన పునాదుల మీదనే జరుగుతున్నాయి… మొన్నటి ఎన్నికల్లో కూడా ఎర్రం నాయుడి తమ్ముడు అచ్చెo నాయుడు, కూతురు ఆదిరెడ్డి భవాని(రాజమండ్రి సిటీ నుంచి) ఎమ్మెల్యేలుగా గెలవగా కొడుకు రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలిచాడు… ఆ కుటుంబం టీడీపీతో అంతగా మమేకం అయ్యింది మరి . ఎర్రం నాయుడు రాజకీయ ప్రయాణము సాఫీగానే సాగిందా? ఎన్టీఆర్ , చంద్రబాబు ఆయన్ని అన్నీ సందర్భాలలో ఆదరించారా? ఆయనకు కాంగ్రెస్ పార్టీ రంగులు ఎప్పుడూ అంటుకోలేదా? అసలు ఎర్రం నాయుడు రాష్ట్ర మంత్రిగా ఎన్నిసార్లు పనిచేశాడు?
టీడీపీ-ఎర్రం నాయుడు
పాతిక ఏళ్ళు వయస్సులో ఎర్రంనాయుడు 1983లో టీడీపీ తరుపున హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. టీడీపీ కొత్త యువకులకు అవకాశం ఇచ్చింది నిజమే కానీ వారిలో అనేక మంది రాజకీయాల కుటుంబాల నుంచి వొచ్చిన వారే… ఎర్రం నాయుడు బాబాయి కింజరాపు కృష్ణమూర్తి 1967లో స్వతంత్ర పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. 1978లో జనతా పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఓడిపోయారు.ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పనిచేసారు.
ఆంధ్ర యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివిన ఎర్రం నాయుడు వామపక్ష విద్యార్థి సంఘాల రాజకీయాల్లో పాల్గొనేవాడు. సిపిఎం నేత బీవీ రాఘవులు ఎర్రం నాయుడికి సీనియర్. ఊరిలో కృష్ణమూరి నాయుడు తో పాటు తిరిగేవాడు .
1983 ఎన్నికల్లో ప్రతిభా భారతి పోటీచేసి గెలిచిన ఎచ్చెర్ల నియోజకవర్గం అన్నిటికన్నా ముందు వెల్లడైన ఫలితం.. అంటే టీడీపీ గెలిచిన తొలి నియోజకవర్గం ఎచ్చెర్ల.. ఆ సెంటిమెంటుతోనే లేక ప్రతిభా భారతి తండ్రి జస్టిస్ పున్నయ్య మీద అభిమానంతోనే ఎన్టీఆర్ ప్రతిభాభారతిని మంత్రిని చేసాడు . 1983,1984 రెండు మంత్రి వర్గాలలో ఎన్టీఆర్ మంత్రి వర్గంలో ప్రతిభా భారతి ఏకైక మహిళా మంత్రి. 1986లో పత్తి మణెమ్మ మంత్రి అయ్యేంత వరకు ప్రతిభా భారతి మాత్రమే మహిళా ఎమ్మెల్యే. ప్రతిభా భారతి కూడా రాజకీయ కుటుంబం నుంచి వొచ్చారు ,ఆవిడ తండ్రి పున్నయ్య జడ్జి కాక ముందు ఎమ్మెల్యేగా పనిచేశారు, తాత నారాయణ రావ్ కూడా ఎమ్మెల్యేగా పనిచేసాడు.
తమ్మినేని సీతారాం పెదనాన్న తమ్మినేని పాపారావు కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు,1978 ఎన్నికల్లో జనతాపార్టీ తరుపున పోటీచేసి ఓడిపోయాడు .
ప్రతిభాభారతి కి ప్రాధాన్యత దక్కటం వలనో లేక కళా వెంకట్రావు లాబీయింగ్ వలనో కానీ ఎర్రం నాయుడికి మంత్రి పదవి దక్కలేదు.
Also Read: దేవినేని సోదరుల రాజకీయ ప్రస్థానం
శ్రీకాకుళం టీడీపీ వర్గ పోరు
అప్పట్లో శ్రీకాకుళం జిల్లాలో అందరూ దగ్గుబాటి వర్గంలోనే ఉండేవారు. తమ్మినేని సీతారాం వాగ్ధాటితో రాణిస్తే, కళా వెంకట్రావు ఎన్టీఆర్ తో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ మంత్రి పదవి, ప్రాధాన్యత సంపాదించాడు. వంగవీటి రంగా హత్య తరువాత హోమ్ మంత్రి కోడెల రాజీనామాతో కళా వెంకట్రావు హోమ్ మంత్రి కూడా అయ్యారు.. కళా వెంకట్రావు హోమ్ మంత్రి కావటం వెనుక కుల సమీకరణ కూడా ఒక కారణం.
మరో వైపు ఎర్రం నాయుడు, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ జంటగా రాజకీయాలు చేస్తుండేవారు. గౌతు లచ్చన్న కొడుకుగా శివాజీకి మంచి గుర్తింపు ఉండేది. ఒక దశలో ఎర్రం నాయుడు నా దత్త పుత్రుడని లచ్చన్న అన్నారు.
శ్రీకాకుళం ఎంపీగా ఉన్న హనుమంతు అప్పయ్య దొరతో ఎర్రం నాయుడు & శివాజీలకు సరిపడేది కాదు, తీవ్ర విబేధాలు ఉండేవి.
1989 ఎన్నికలు
శ్రీకాకుళం వర్గ పోరులో హోమ్ మంత్రిగా ఉన్న కళా వెంకట్రావు , ఎంపీ అప్పయ్య దొర ఏకమయ్యి ఎర్రం నాయుడు, శివాజీలకు టీడీపీ టికెట్ దక్కకుండా చేసారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి టీడీపీలో ఎర్రం నాయుడు వైభవాన్ని చూసిన వారికి 1989లో ఆయనకు టికెట్ కూడా దక్కలేదన్న విషయం షాకింగ్ గానే ఉంటుంది.
బొండం తొండం
టీడీపీ టికెట్ రాకపోవటంతో ఎర్రం నాయుడు,శివాజీ ఇద్దరి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీకి దిగారు. సోంపేటలో శివాజీకి కొబ్బరి బొండం గుర్తు,హరిశ్చంద్రపురం ఎర్రం నాయుడికి తొండం గుర్తు వొచ్చాయి. ఎన్నిక ప్రచారంలో అప్పయ్యదొర “బొండం తొండం” అంటూ వెటకారంగా మాట్లాడేవాడు.
ఎన్టీఆర్ హరిశ్చంద్రపురం టికెట్ ను ఎర్రం నాయుడు పెదనాన్న కొడుకు కింజరపు ప్రకాష్ కు, సోంపేట టికెట్ ను యుగంధర్ అనే నాయుడికి ఇచ్చాడు. ఎర్రం నాయుడు సోదరులు ప్రకాష్ ని కిడ్నప్ చేసారని అభియోగం, అది నిజం అయినా కాకపోయినా ప్రకాష్ నామినేషన్ వేయలేదు, గడువు ముగిసే వరకు ఎవరికీ కనిపించలేదు.ఇతరులెవరూ టీడీపీ తరుపున పోటీకి ముందుకు రాలేదు. ఈ విషయాలను చూస్తే అప్పుడు ఎంత ఘర్షణ వాతావరణం ఉందో అర్ధమవుతుంది.
సోంపేటలో కూడా టీడీపీ బి-ఫారం దక్కిన యుగంధర్ కిడ్నప్ అయ్యాడు.. కానీ చివరి నిముషంలో వడిశ బాలకృష్ణ అనే నాయకుడితో టీడీపీ తరుపున నామినేషన్ వేయించారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత ప్రకాష్,బాలకృష్ణ ఆయా నియోజకవర్గాల టీడీపీ ఇన్ ఛార్జ్ లుగా కొనసాగారు
కాంగ్రెస్ తో అనుబంధం
1989 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఎర్రం నాయుడు,శివాజీ అభ్యర్ధన మేరకు స్పీకర్ వారిని కాంగ్రెస్ అనుబంధ సభ్యులుగా గుర్తించారు. వారు కాంగ్రెస్ లెజిస్లేటివ్ సమావేశాలకు హాజరయ్యేవారు. వారి నియోజకవర్గాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ప్రోటోకాల్ పొందారు.
Also Read : వైఎస్సార్ ఓటమి అంచుల వరకు వెళ్లిన 1996 లోక్ సభ ఎన్నిక
నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రారంబోత్సవాల కోసం హైద్రాబాదు నుంచి వెళ్లిన హెలీకాఫ్టర్లో ఎర్రం నాయుడు, శివాజీ ఇద్దరు ప్రయాణం చేసారు. దీనితో కాంగ్రెస్ సభ్యులకు వీరి మీద కోపం పెరిగింది.. అప్పటి వరకు టీడీపీ ప్రభుత్వంలో పెత్తనం చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పెత్తనం చేస్తున్నారని కక్ష కట్టారు.. సహజంగానే వీరికి కాంగ్రెసులో క్రమంగా ప్రాధాన్యాత తగ్గటం మొదలైంది.
1991లోక్ సభ ఎన్నికలు – ఎర్రం నాయుడు పోటీ..
టీడీపీ తరుపున శ్రీకాకుళం లోక్ సభకు సిట్టింగ్ ఎంపీ అప్పయ్య దొర , కాంగ్రెస్ తరుపున కణితి విశ్వనాథం పోటీకి దిగారు. 1989 శాసనసభ ఎన్నికల్లో అప్పయ్యదొర వలనే తమకు టీడీపీ టిక్కెట్లు దక్కలేదన్న కోపంతో ఉన్న ఎర్రం నాయుడు అప్పయ్యదొర ఓటమే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 83,000 ఓట్లు సాధించాడు, 27,000 ఓట్ల తేడాతో అప్పయ్యదొర ఓడిపోయి కాంగ్రెస్ అభ్యర్ధీ కణితి విశ్వనాథం గెలిచాడు..
ఎర్రం నాయుడు తాను ఓడినా అప్పయ్యదొరను ఓడించానన్న తృప్తి పొందాడు. కానీ అనుకున్న స్థాయిలో ఓట్లు సాధించలేదు, శ్రీకాకుళం లోక్ సభ పరిధిలోని తన సొంత నియోజకవర్గం హరిశ్చంద్రాపురంలో కూడా మెజారిటీ సాధించలేదు, సోంపేటలో అయితే మూడో స్థానానికే పరిమితం అయ్యాడు.. దీనితో తనకు ఒక పార్టీ అవసరమని గుర్తించాడు..
టీడీపీ ఘర్ వాపసీ
1994 ఎన్నికల్లో ఓడిపోతే ఎన్టీఆర్ టీడీపీ భూస్థాపితం అయిపోతుందని ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీకి వివిధ కారణాలతో దూరమైన వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించే క్రమంలో చంద్రబాబు చొరవతో తమ్మినేని సీతారాం మధ్యవర్తిత్వంతో ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఎర్రం నాయుడు, శివాజీ టీడీపీలో చేరారు.
1989 ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ .వడిశ బాలకృష్ణలకే టికెట్స్ ఇస్తానని ఎన్టీఆర్ మొదట ప్రకటించినా చివరికి ఎర్రం నాయుడు, శివాజీలకు 1994 ఎన్నికల్లో టికెట్లు దక్కాయి.తెరవెనుక అప్పయ్యదొర ప్రోత్సహంతో సోంపేటలో వడిశ బాలకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రెండవ స్థానములో నిలిచాడు కానీ శివాజీని ఓడించలేకయాడు.
1994 ఎన్నికల్లో టెక్కలి,హిందుపూర్ నుంచి గెలిచిన ఎన్టీఆర్ టెక్కలి స్థానానికి రాజీనామా చేయటంతో ఉప ఎన్నికల్లో టీడీపీ తరుపున అప్పయ్యదొర గెలిచాడు.
1994 ఎన్నికల్లో టీడీపీ స్వీప్ చేసింది కానీ కళా వెంకట్రావ్ మాత్రం ఓడిపోయాడు.. ఉత్తరాంధ్రలోని 37 స్థానాలలో కాంగ్రెస్ గెలిచినా ఏకైక స్థానం కళా వెంకట్రావ్ పోటీచేసి ఓడిన వణుకూరు .. ఎర్రం నాయుడు వలెనే కళా వెంకట్రావు ఓడిపోయాడని చెప్పందుకు కారణాలు లేవు కానీ వ్యతిరేకంగా పనిచేసింది మాత్రం నిజం.
1994 ఎన్టీఆర్ ప్రభుత్వంలో తమ్మినేని సీతారాం కు తొలిసారి మంత్రి పదవి దక్కగా , ప్రతిభాభారతి మరోసారి మంత్రి అయ్యారు.
మూడు దశాబ్దాలుగా శ్రీకాకుళం రాజకీయాలను పరిశీలిస్తున్న ఒక సీనియర్ నేత “కళా వెంకట్ రావు కళ్ళతో మాట్లాడతాడు, ఎర్రం నాయుడు చెవులతో వింటాడు ,నోటితో మాట్లాడుతాడు ,చేతులతో సహాయం చేస్తాడు ” అంటూ ఎర్రం నాయుడు ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరును ఒక్కమాటలో వివరించాడు.
వైశ్రాయ్ – చంద్రబాబు
వైశ్రాయ్ సంఘటనతో ఎన్టీఆర్ ను పదవి నుంచి దించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు.. అనేక మంది రాజకీయ దశ తిరిగింది కానీ ఎర్రం నాయుడు మాత్రం “చీఫ్ విప్” పదవితోనే సరిపెట్టుకోవలసి వొచ్చింది. తమ్మినేని సీతారాం ప్రమోషన్ పొంది మున్సిపల్ మంత్రి కాగా , ప్రతిభా భారతికి మంత్రి పదవి రాలేదు,తరువాత విస్తరణలో విద్యాశాఖ మంత్రి అయ్యారు .ప్రతిభా భారతి కళావేంకట రావు,ఎంవీ కృష్ణా రావ్ తరితరులు అతి కొంత కాలం దగ్గుబాటి వర్గంలోనే కొనసాగి ఎన్టీఆర్ ఉన్నారు.
1996 లోక్ సభ ఎన్నికలు
ఎన్టీఆర్ మరణం, తాను ముఖ్యమంత్రి అయిన తరువాత ఎదుర్కుంటున్న తొలి ఎన్నికలు, ఎన్టీఆర్ ను పదవి నుంచి దించటం, ఆయన చనిపోయిన నాలుగు నెలలకే ఎన్నికలు రావటం … తేడా వస్తే తన నాయకత్వం మీద తిరుగుబాటు రావొచ్చు… అందుకే బలమైన మంత్రులు,ఎమ్మెల్యేలు, నాయకులను లోక్ సభ బరిలోకి దించాడు.
శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్ కుమారుడు నందమూరి జయకృష్ణ లక్ష్మి పార్వతి వర్గం తరుపున పోటీకి దిగటం,వీరికి సీనియర నేత అప్పయ్య దొర అండగా నిలబడటంతో ఆ ఎన్నికలలో చంద్రబాబుది చావో రేవో పరిస్థితి…
మంత్రిగా ఉన్న తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం లోక్ సభకు పోటీచేయమని చంద్రబాబు అడగ్గా, ఆయన ఎర్రం నాయుడు పేరును ప్రతిపాదించాడు.. హోరా హోరి పోరులో ఎర్రం నాయుడు 34,000 ఓట్ల మెజారిటీతో నందమూరి జయకృష్ణ మీద గెలిచాడు,కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. 1996 నవంబర్ లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో మాత్రం లక్ష్మిపార్వతి గెలిచింది.
1998లో లక్ష్మి పార్వతి వర్గం తరపున పోటీచేసిన తన చిరకాల శత్రువు అప్పయ్యదొర ను ఓడించి ఎర్రం నాయుడు మరోసారి ఎంపీగా గెలిచాడు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీచేసిన ధర్మాన ప్రసాద్ రావ్ మూడు స్థానానికి పరిమితమయ్యారు.
ఎర్రం నాయుడు 1999, 2004 ఎన్నికల్లో గెలిచి 2009 లో ఓడిపోయారు.2004 ఎన్నికలప్రచారంలో నక్సల్ పెట్టిన ల్యాండ్ మైన్ దాడి నుంచి ఎర్రం నాయుడు గాయాలతో బయటపడ్డాడు. 2012 నవంబర్లో రోడ్ ఆక్సిడెంట్ లో చనిపోయారు.
యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో 1996-1998 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎర్రం నాయుడు,వాజ్ పాయ్ ప్రధాని అయిన 1998 లో లోక్ సభ స్పీకర్ గా నామినేషన్ వేయవలసిన బాలయోగి పార్లమెంటుకు సమయానికి చేరుకుంటాడు లేడా అన్న పరిస్థితుల్లో స్పీకర్ పదవికి నామినేషన్ వేయటానికి సిద్ధపడ్డ ఎర్రం నాయుడిని చంద్రబాబు వారించారు. టీడీపీ తరుపున అయితే బాలయోగి స్పీకర్ అవుతాడు లేదంటే ఎవరూ వొద్దని చంద్ర బాబు చెప్పాడు.. దానితో ఎర్రం నాయుడు నొచ్చుకున్నాడు కానీ వారి సంబంధాలు బలంగానే కొనసాగాయి…
అచ్చెం నాయుడు రాజకీయ రంగ ప్రవేశం
ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రం నాయుడు 1996 లోక్ సభ కు పోటీచేసి గెలవటంతో ఖాళీ అయినా హరిశ్చంద్రాపురం ఎమ్మెల్యే సీటుకు ఎర్రం నాయుడు కుటుంబంలో పోటీ నెలకొంది. ఎర్రం నాయుడు శ్రీమతి,సోదరుడు పోలీస్ అధికార అయిన ప్రభాకర్ రావ్ పేరు ప్రముఖంగా వినిపించింది . ఒక దశలో ప్రభాకర్ రావ్ కు టికెట్ ఖాయం అని పత్రికలూ రాశాయి కానీ చివరికి టీడీపీ టికెట్ అచ్చెం నాయుడిని వరించింది. ఆ టికెట్ కోసం అచ్చెం నాయుడు ఎర్రం నాయుడుతో గొడవకు దిగాడంటారు.. కుటుంబంలో విబేధాలు తలెత్తకుండా నివారించటానికి ఎర్రం నాయుడు టికెట్ అచ్చెం నాయుడికి ఇప్పించారు.
అచ్చెం నాయుడు అభ్యర్ధీత్వం వైపు ఎర్రం నాయుడు మొగ్గు చూపటానికి మరొక ఆసక్తికర కారణం ఉంది. 1994 ఎన్నికల్లో పోలింగ్ రోజు పిన్నింటిపేట పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘర్షణలో స్థానికుడు ఒకరు చనిపోయారు. దానితో స్థానికులు తిరగబడటంతో జరిగిన గొడవలో అచ్చెం నాయుడు గాయపడ్డాడు.. ఆ రోజు పెద్ద గొడవే జరిగింది.. అచ్చెం నాయుడు ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు ..
నీ కోసం ఇంత తెగించి పోరాడితే నాకు టికెట్ ఇవ్వవా?అని అచ్చెంనాయుడు అడగటంతో ఎర్రం నాయుడు ఆయనకే టికెట్ ఇప్పించాడు.
ఎర్రం నాయుడిది పెద్ద తరహా రాజకీయం అయితే అచ్చెం నాయుడిది దూకుడు వైఖరి. కానీ అన్న లాగానే అచ్చెం నాయుడు కూడా ప్రజలతో మమేకం అయ్యేవాడు. ప్రజలకు అందుబాటులో ఉంటాడన్న మంచి పేరు నియోజకవర్గంలో ఉంది.
అచ్చెం నాయుడు హరిశ్చంద్రపురం నియోజక వర్గం నుంచి 1996,1999,2004లో గెలిచి ,నియోజక వర్గాల పునఃవిభజంలో అది రద్దు కావటంతో టెక్కలి నుంచి పోటీ చేసి 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచిన రేవతీపతి మరణంతో అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికలో కూడా ఓడిపోయి,2014 మరియు 2019 ఎన్నికల్లో గెలిచాడు.
గూగుల్లో అచ్చెం నాయుడు ఫోటో కోసం చూస్తే ఒక్కటన్నా ప్రశాంతంగా ఉన్న ఫొటో దొరకదు.. అన్ని వేలు ఎత్తి చూపేవో లేదా మొహమంతా కోపంతో ఉన్న ఫొటోలే కనిపిస్తాయి..దీనిలో ఆశ్చర్యం ఏమీ లేదు .. అచ్చెం నాయుడు 2014-2019 మధ్య అయినదానికి కానిదానికీ ఒంటి కాలితో జగన్ మీద, వైసీపీ మీద ఆవేశపడిపోయేవాడు …మంత్రి హోదాలో శాసనసభలో మైక్ పొంది అర్ధం లేని వాదనలతో వైసీపీ ఎమ్మెల్యేల మీద పడిపోయేవాడు.. ఒక దశలో బుర్ర పెంచాలి అచ్చెం నాయుడు అని జగన్ అనే స్థాయికి వాదనలు వెళ్లాయి…
తమ ప్రవర్తనతో చెడ్డపేరు తెచ్చుకున్న దేవినేని ఉమా,చింతమనేని ప్రభాకర్,అనితా లాంటి వారు ఓడిపోగా అచ్చెం నాయుడు ఒక్కడే గెలిచాడు.. వీరిలో చింతమనేనికి ప్రజలకు అందుబాటులో ఉంటాడన్న మంచి పేరు ఉంది కానీ అది ఆయన ఓటమిని అడ్డుకోలేక పోయింది.మొన్న ఎన్నికల్లో వైసీపీ తరుపున కొత్త అభ్యర్ధీ తిలక్ పోటీ చేయటం,ఆ నియోజకవర్గంలోని సామాజిక వర్గాల సమీకరణలు కుదరకపోవడం కూడా అచ్చెం నాయుడు గెలుపుకు కారణం… అచ్చెం నాయుడు మరో 20 ఏళ్ళు రాజకీయాల్లో రాణించాలంటే ఎర్రం నాయుడు పద్దతి పాటించాలి..