గ్రామ స‌చివాల‌యాలు ఇక మ‌రింత మెరుగు

అన‌డానికి, విన‌డానికే ప‌రిమిత‌మైన గ్రామ స్వ‌రాజ్యాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఆవిష్క‌రించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన ప్రజల గుమ్మం ముందుకే వచ్చింది. ‘కులం చూడం, మతం చూడం.. పార్టీలు చూడం.. రాజకీయాలు చేయం..’ అని ఎన్నికలకు ముందు జ‌గ‌న్ చెప్పిన మాట‌ల‌కు అనుగుణంగా స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా అంద‌రికీ నాణ్య‌మైన సేవ‌లు అందుతున్నాయి. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన ఐదు నెల‌ల‌కే అందుబాటులోకి వ‌చ్చిన గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయ‌న‌డం అతిశ‌యోక్తి కాదు. ఓ సంద‌ర్భంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కూడా ‘మీ సచివాలయ వ్యవస్థ బాగుంది’ అని స్వ‌యంగా జ‌గ‌న్ తో పేర్కొన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు వాటి ప‌నితీరుకు మెరుగులు దిద్దుతూ జ‌గ‌న్ చేస్తున్న దిశా నిర్దేశం కార‌ణంగానే వాటికి అంతటి ఖ్యాతి.

తాజాగా జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో కూడా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను మ‌రింత మెరుగ్గా తీర్చిదిద్ద‌డంపై చ‌ర్చ జ‌రిగింది. సామాన్యుడు తన కష్టాన్ని ప్రభుత్వానికి చెప్పుకునేందుకు ఈ వ్య‌వ‌స్థ ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఇప్ప‌టికే రుజువైంది. ఓ వ్యక్తికి, కుటుంబానికి ఇబ్బందులు వస్తే అధికారులకు చెప్పుకుందామంటే గ‌తంలో ఎవ‌రు ఎక్క‌డ ఉండేవారో తెలియ‌దు. స‌రిగ్గా అందుబాటులో ఉండే వారు కూడా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా మార్పు వ‌చ్చింది. గ్రామ సచివాలయంలో అన్ని శాఖలూ ఉంటాయి. ఏదైనా సమస్య వస్తే ఇక్కడ పరిష్కారం దొరుకుతుందన్న న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో క‌లిగింది. అందుకే అటువంటి వ్య‌వ‌స్థ‌ను ఎప్ప‌టిక‌ప్పుడు న‌వ్యీక‌రించేలా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చ‌ర్య‌లు చేప‌డుతూనే ఉన్నారు.

దానిలో భాగంగానే నెలలో ప‌న్నెండు రోజుల పాటు పాటు ఎమ్మెల్యేలు గ్రామ సచివాలయాలను సంద‌ర్శించాల‌నే స‌రికొత్త నిర్ణ‌యాన్ని తాజా కేబినెట్ భేటీ లో జ‌గ‌న్ ప్ర‌తిపాదించారు. దీనికి మంత్రి వ‌ర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ మేర‌కు గ్రామ సచివాలయాలకు మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలు ఉండ‌నున్నాయి. దీని వ‌ల్ల ప్ర‌భుత్వం నిర్దేశించిన ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ప్ర‌జ‌లకు సేవ‌లు అందుతున్నాయా లేదా అనేది తేల‌నుంది. అంతేకాదు.. అధిక వేగంగా, చురుగ్గా ప్ర‌జ‌ల ప‌నుల‌ను పూర్తి చేయాల‌న్న త‌ప‌న అధికారుల్లో పెర‌గ‌నుంది. ఈ వ్య‌వ‌స్థ ద్వారా ప్ర‌భుత్వానికి ఎన‌లేని పేరు వ‌చ్చింది. ప్ర‌జ‌ల‌కు గ‌తంలో ఎప్పుడూ లేని మేలు జ‌రుగుతోంది. అందువ‌ల్ల వీటిపై జ‌గ‌న్ ప్ర‌త్యేక దృష్టి పెట్టారు.

‘ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటా’ అని ప్రమాణ స్వీకారం చేసిన రోజునే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పారు. అందుకోసం ఐదు నెల‌ల్లో స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తెచ్చి పాల‌న‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు తెచ్చారు. పాలకుడు.. సేవకుడు అయితే సంక్షేమ పథకాలు గుమ్మం ముందుకే వస్తాయని నిరూపించిన జ‌గ‌న్ తాజా నిర్ణ‌యంతో ప్ర‌జ‌ల‌కు స‌చివాల‌యాల‌ను మ‌రింత చేరువ చేయ‌నున్నారు. ప్ర‌క‌టించాం.. ప్ర‌వేశ‌పెట్టాం.. అని అంత‌టితో ఆగిపోకుండా నిరంత‌రం స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌లో జ‌వ‌స‌త్వాలు నింపుతున్నారు జ‌గ‌న్.

Show comments