Idream media
Idream media
ప్రస్తుతం రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణపై అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా పోరాడుతున్నాయి. కచ్చితంగా 3 రాజధానులు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అంతటిని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలోని అధికారపక్షం వాదిస్తుండగా.. అధికార వికేంద్రీకరణ తప్పు అమరావతి ముద్దు 3 రాజధాని వద్దు అంటూ తెలుగుదేశం ఇప్పటికే దీనిపై కొన్ని పోరాటాలు సాగిస్తోంది.
అమరావతి ఉద్యమం పేరుతో రాజధాని ప్రాంతంలో ఇప్పటికే ధర్నాలు దీక్షలు ఉద్యమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతోపాటు విశాఖను రాజధానిగా చేస్తూ ఇచ్చిన కొన్ని ఉత్తర్వులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఇప్పటికే విశాఖను పరిపాలన రాజధానిగా గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ ఇపుడు విశాఖపై మరో వరం కురిపించారు. విశాఖలో మిలీనయం టవర్స్ నిర్మాణానికి 19.73 కోట్ల రూపాయలను విడుదల చేశారు. విశాఖలో టవర్ బీ నిర్మాణం కోసం ఐటీశాఖకు నిధులు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ మిలీనయం టవర్ -బి లో సెక్రటేరియట్ కార్యకలాపాలు నిర్వహించేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. విశాఖపట్నం నుండి భీమిలి బీచ్‌రోడ్డుకు వెళ్లే రుషికొండ ఐటీ పార్కులో ఉన్న నిర్మించిన మిలీనియం టవర్ ను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోనున్నారు. ఈ భవనాన్ని నాలుగు ఎకరాల్లో సుమారుగా రూ.145 కోట్లతో నిర్మించారు. పది అంతస్థులతో అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ భవనంలో 2 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలం ఉంది. అలాగే మరో 1.5లక్షల చదరపు అడుగుల పార్కింగ్ స్థలం ఉంది.
అలాగే ఫిబ్రవరి నెలాఖరులోపు కీలక కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం ఓవైపు కసరత్తులు చేస్తోంది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ కార్యాలయాన్ని కూడా తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. ప్రస్తుతం విజయవాడల ఆర్టీసీ ప్రాంగణంలో ఉన్న అడ్మిన్ బ్లాకులో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం కూడా మరికొద్ది రోజుల్లోనే విశాఖకు తరలిపోనుంది.
పలు ప్రభుత్వ శాఖలను న్యాయపరిపాలన పరమైన రాజధాని కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుల కార్యాలయాలను కర్నూలుకు తరలించింది. ప్రస్తుతం వెలగపూడిలోని సచివాలయం ఉన్న ఈ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఈ కార్యాలయాల ఏర్పాటుకు భవనాలను గుర్తించాల్సిందిగా కర్నూలు జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్‌చీఫ్‌లను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు. త్వరలో మరిన్ని కార్యాలయాలను అమరావతి నుంచి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది.