మరోమారు అమ్ముడుపోయిన మహా టీవీ.

తెలుగులో సీనియర్ జర్నలిస్టుగా ఎన్టీఆర్, చంద్రబాబు ఆశీస్సులతో ఎదిగిన ఐ వెంకట్రావు ఆరంభించిన మహాటీవీ మరో మారు అమ్మకం జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చానెల్ పలుమార్లు చేతులు మారింది. ఐ వెంకట్రావు తర్వాత సుజనా చౌదరి, ఆ తర్వాత టీడీపీకి చెందిన లోకేష్ సన్నిహితులు, వారి నుంచి పరకాల ప్రభాకర్ సారధ్యంలో ముంబై కి చెందిన కంపెనీ పేరుతో కూడా కొనుగోళ్లు, అమ్మకాలు జరిగాయి. ఇక తాజాగా పీపుల్స్ మీడియా గ్రూప్ సంస్థ పేరుతో ఈ చానెల్ ని కొందరు ఎన్ ఆర్ ఐ లు కొనుగోలు చేసినట్టు సమాచారం.

పీపుల్స్ మీడియా పేరుతో ఇప్పటికే కొన్ని చానెళ్లలో స్లాట్స్ తీసుకుని ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అందులో మహాటీవీ కూడా ఉంది. ఆ చానెల్లో సీనియర్ యాంకర్ స్వప్న నిర్వహించే కార్యక్రమం పీపుల్స్ మీడియా ప్రొడక్షన్. 99టీవీలో కూడా వారు కొన్ని స్లాట్స్ తీసుకున్నారు. కానీ వచ్చే ఎన్నికలకు సన్నద్ధంలో భాగంగా ఒక చానెల్ మొత్తంగా తీసుకోవాలనే వారి ప్రయత్నం మహాటీవీతో ఫలించినట్టు కనిపిస్తోంది. మహాటీవీ ఎండీగా ఉన్న వంశీ కృష్ణ తదితరులను డిసెంబర్ నెలతో సాగనంపేందుకు అంతా సిద్ధమయ్యిందని సమాచారం.

చానెల్ యాజమాన్యం మారినప్పటికీ ఇప్పటి వరకూ తన పోస్టుకి ఢోకా లేకుండా చూసుకోవడంలో వంశీ సక్సెస్ అయ్యారు. ఆయన టాల్కమ్ పౌడర్ సహా వివిధ సందర్భాల్లో సోషల్ మీడియాలో ట్రోల్ అయినప్పటికీ తన ధోరణిలోనే సాగిపోతున్నారు. కానీ ప్రస్తుతం యాజమాన్యం చేతులు మారుతుండడంతో వంశీ పరిస్థితి ఏమిటన్నది ఆసక్తిగా మారింది. అయితే ఆయన ఇప్పుడు కూడా కొత్త మేనేజ్ మెంట్ తో అన్నీ మాట్లాడుకుని తన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశాలు లేకపోలేదన్నది మీడియా వర్గాల్లో కొందరి వాదన.

అమెరికాలో ఉంటున్న కొందరు ఎన్ ఆర్ ఐ లు ఈ చానెల్ కొనుగోలు చేసినట్టు సమాచారం. వారిలో టీడీపీ మద్ధతుదారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్న తరుణంలో చానెళ్లు చేతులు మారే ప్రక్రియ ఆసక్తికరమే. ఇటీవలే స్టూడియో ఎన్ చానెల్ మళ్లీ ప్రారంభించారు. జూనియర్ ఎన్టీఆర్ సొంతమామ ప్రారంభించిన ఆ చానెల్ కూడా పలువురి నిర్వహణలో చేతులు మారింది. తాజాగా కొందరు తెలంగాణా కి చెందిన నేతలు తెరవెనుక ఉండి చానెల్ పునః ప్రారంభించినట్టు చెబుతున్నారు. తాజాగా అదే పరంపరంలో మహాటీవీ కూడా చేరుతుండడం విశేషం.

మహాటీవీ ప్రారంభించి పుష్కరకాలం దాటినప్పటికీ పెద్దగా ఆదరణ పొందిన దాఖలాలు లేవు. ఎంతమంది యాజమాన్యాలు మారినా ఆ చానెల్ తలరాత మాత్రం మారలేదు. అంతంతమాత్రంగానే టీఆర్పీలలోనూ, ఆ తర్వాత బార్క్ రేటింగ్స్ లోనూ కనిపించింది. ప్రస్తుతం రేటింగ్స్ లేకపోయినా చానెల్ పెద్దగా జనాదారణ దక్కించుకున్న ఆనవాళ్లు లేవు. దాంతో కొత్త యాజమాన్యం వచ్చిన తర్వాతైనా మహా టీవీ ఇమేజ్ మారుతుందో లేదో చూడాలి.

Show comments