Idream media
Idream media
రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ లోని చాలా మంది సీనియర్లు చివరి వరకూ ప్రయత్నాలు చేశారు. రేవంత్ కు వ్యతిరేకంగా ఎంత మంది గళం విప్పినా, లేఖలు రాసినా అధిష్ఠానం మాత్రం రేవంత్ కే పగ్గాలు అప్పగించింది. టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి అధిష్ఠానం నమ్మకం ఒమ్ము కాకుండా ఆరంభంలోనే కాంగ్రెస్ కు కాస్త ఊపు తెచ్చారు. ఎలా చూసుకున్నా ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులకు ఆశాదీపం రేవంత్ రెడ్డి మాత్రమే.
తనను తిట్టిన, కాదన్న సీనియర్ నేతలను కూడా ప్రసన్నం చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. అలాగే పలువురు మాజీ నేతలను, ఇతర ప్రముఖులను కాంగ్రెస్ గూటికి తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చారు. ఈ మేరకు రేవంత్ మాట్లాడడం.. విశ్వేశ్వర్ రెడ్డి సానుకూలంగా స్పందించడం అన్నీ జరిగిపోయాయి. కాంగ్రెస్ లో త్వరలోనే చేరుతానని ఆయన చెప్పారు. ఆ తర్వాత.. వెంటనే మరో కీలక నేతకు కాంగ్రెస్ కండువా కప్పేందుకు రంగం సిద్ధం చేశారు. మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మరాఠా చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్ ను కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చి అలజడి సృష్టించారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ కు వలసలను పెంచారు. ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రస్తుత టీఆర్ఎస్ నాయకుడు డి.శ్రీనివాస్ కుమారుడు సంజయ్ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అనంతరం టీడీపీ సీనియర్ నేతగా ఒకప్పుడు చక్రం తిప్పిన దేవేందర్ గౌడ్ ను కూడా పార్టీలోకి ఆహ్వానించారు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారు.
ఈ విధంగా.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పీసీసీ అధినేతగా రేవంత్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. అయినప్పటికీ .. కాంగ్రెస్ లోని కొంత మంది సీనియర్ల నుంచి మాత్రం ఆయనకు సహకారం లభించట్లేదు. ఒక్కరిద్దరు సీనియర్లు మినహా.. ఆయనకు ఎవరూ సపోర్టు చేయట్లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. కోమటిరెడ్డి వంటి నేతలైతే.. ఏదో విధంగా రేవంత్ కు వ్యతిరేక స్వరం వినిపించేందుకే ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హుజూరాబాద్ లో తాను సర్వే చేశానని కాంగ్రెస్ కు 5శాతం ఓట్లు మాత్రమే వస్తాయని చెప్పడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.
ఇలా.. సీనియర్లుగా ఉన్నవారు సహకారం అందించకపోగా.. పార్టీని బలోపేతం చేస్తున్న రేవంత్ ను ఇలా కిందకు లాగే ప్రయత్నం చేయడమేంటని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగిలిన సీనియర్లలో కూడా చాలా మంది బయట పడకుండా ఉన్నారని వారు కూడా రేవంత్ కు పీసీసీ ఇవ్వడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. మరి ఎన్నికల సంగ్రామం మొదలైతే అందరూ కలిసి వస్తారా, లేదా చూడాలి.