Idream media
Idream media
గద్వాల్ విజయలక్ష్మి మేయర్ కావడం వెనుక ఆమె తండ్రి రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు చేసిన మంత్రాంగం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళకే గ్రేటర్ మేయర్ గా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని మొదటి నుంచీ ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే విజయలక్ష్మి పేరు కూడా రేసులో ఉంది. చివరకు ఆమెనే మేయర్ పదవి వరించింది. దీని వెనుక తండ్రి కేశవరావు చాణక్యత ఉంది. చివరి క్షణం వరకు మేయర్ ఎవరనేది ఉత్కంఠ కలిగించినా.. కేకేకు మాత్రం తమ బిడ్డే మేయర్ అన్న విషయం ముందే తెలిసినట్లు సమాచారం. ఆ విషయం బిడ్డకు కూడా తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు.
కె కేశవరావు తన కుమార్తెకు మేయర్ పదవి ఇప్పించడంలో ముఖ్య భూమిక పోషించారు. గ్రేటర్ ఎన్నికలు ముగిసిన వెంటనే సీఎంను కలిసి కుమార్తె గురించి ప్రస్తావించారట. విజయలక్ష్మి ఉన్నత విద్యావంతురాలు కావడం, గతంలో కూడా కేకేకు మాట ఇవ్వడం వంటి కారణాలతో ముఖ్యమంత్రి కూడా అప్పుడే పచ్చజెండా ఊపారట. ఈ విషయం బయటకు పొక్కకుండా చివరి వరకూ అప్రమత్తంగా ఉన్నారు.
టీఆర్ఎస్ లో సముచిత స్థానం
రాజ్యసభ ఎంపీ హోదాలో కాంగ్రెస్ పార్టీ వీడి టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి కేకేకు కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముందుగా ఆయనను పార్టీ సెక్రటరీ జనరల్‌గా నియమించారు. రాజ్యసభ ఎంపీ పదవీకాలం ముగియగానే 2014 ఏప్రిల్ లో టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు పంపారు. ఆ పదవీకాలం 2020 ఏప్రిల్‌లో ముగియగానే మరోసారి రాజ్యసభ సీటు ఇచ్చారు. ఇలా పార్టీలో కేకే కు మొదటి నుంచీ మంచి ప్రాధాన్యమే సీఎం కేసీఆర్ ఇచ్చేవారు. టీఆర్ఎస్ పట్ల కేకే పూర్తి విధేయుడిగా ఉండటం వల్లే అంతలా ప్రాధాన్యత దక్కుతోందని పార్టీ లీడర్లు భావిస్తున్నారు. ఆ విధేయతను గుర్తించే కేకే మాటను కొట్టేయకుండా విజయలక్ష్మిని కేసీఆర్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన శ్రీలతా శోభన్ రెడ్డి కుటుంబం కూడా కేసీఆర్ కు అత్యంత సన్నిహితమైంది. కేకే కంటే ముందు నుంచే వారికి కేసీఆర్ తో ఉద్యమ బంధంతో పాటు రాజకీయ బంధం ఉండేది. శ్రీలత భర్త శోభన్ రెడ్డి కి టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా పేరు ఉంది. ఉద్యమంలో కేసీఆర్ తో పాటు శోభన్ రెడ్డి కుటుంబం కూడా వెన్నంటి ఉంది. ఈ నేపథ్యంలో శోభన్ రెడ్డి తన సతీమణికి మేయర్ పదవి కేటాయించాలని కేసీఆర్ ను కోరారు. కానీ చివరకు డిప్యూటీ మేయర్ పదవి దక్కింది.
మూడు పదవులు
టీఆర్ఎస్ పార్టీ నుంచి కేకే రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన కొడుకు విప్లవ్ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. గత ఐదేండ్లుగా ఆ పదవిలో ఉంటున్న విప్లవ్.. తదుపది ఉత్తర్వులు వచ్చే వరకు చైర్మన్ గా కొనసాగే విధంగా ప్రభుత్వం జీవో ఇచ్చింది. కేకే రాజకీయ వారసురాలిగా యూఎస్ నుంచి వచ్చిన కూతురు విజయలక్ష్మి గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే కార్పొరేటర్ గా గెలిచారు. అప్పుడే తన కూతురును మేయర్ చేసేందుకు కేకే తీవ్రంగా ప్రయత్నించినట్లు ప్రచారంలో ఉంది. అప్పుడు సక్సెస్ కాలేకపోయారని, ఈ సారి మాత్రం సక్సెస్ అయ్యారని పార్టీ లీడర్లు చెప్తున్నారు.