Keerthi Suresh’s Chinni Movie Review చిన్ని రిపోర్ట్

నిన్న చిన్న సినిమాల థియేటర్ సందడిలోనూ ఓటిటి డైరెక్ట్ మూవీస్ వచ్చాయి. అందులో ఎక్కువగా దృష్టిలో పడ్డది చిన్ని. తమిళంలో సాని కడియం పేరుతో రూపొందిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో చిన్నిగా తెలుగు వెర్షన్ స్ట్రీమ్ అయ్యింది. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించడమే ప్రధాన ఆకర్షణగా నిలవగా ఎన్నడూ లేనంత డీ గ్లామర్ గా ఇందులో తను కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్ లోనే ఇది హింసాత్మక రివెంజ్ డ్రామా అనే క్లూ ఇచ్చారు కాబట్టి ఇదే ఏ జానరో ముందే క్లారిటీ వచ్చేసింది. సెల్వ రాఘవన్ తనతో సమానంగా జర్నీ చేసే కీలకమైన క్యారెక్టర్ చేశారు. మరి ఈ చిన్ని మెప్పించిందో లేదో రిపోర్ట్ లో చూద్దాం.

అగ్రకులాల ఆధిపత్యం ఉండే ఒక పల్లెటూరిలో వెనుకబడిన వర్గానికి చెందిన చిన్ని(కీర్తి సురేష్) పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తూ ఉంటుంది. భర్త ఒక ఫ్యాక్టరీ వర్కర్. కులానికి సంబంధించి మాట తగాదా వచ్చి యజమానితో గొడవ పెట్టుకుంటాడు. దీంతో కక్ష కట్టిన ఓనర్లు అతనితో పాటు కూతుర్ని సజీవదహనం చేస్తారు. అంతే కాదు చిన్నిని అందరూ కలిసి గ్యాంగ్ రేప్ చేసి వదిలిపెడతారు. కోర్టుకు వెళ్లిన చిన్నికి న్యాయం దక్కదు. హంతుకులు తప్పించుకుని పారిపోతారు. ఇలా అయితే లాభం లేదని ఉద్యోగం వదిలేసిన చిన్ని బంధువు(సెల్వ రాఘవన్)తో కలిసి ఒక్కొక్కరిని వెతికి దారుణంగా చంపేస్తుంది. రెండుంపావు గంటల్లో చెప్పిన కథ ఇదే.

కీర్తి సురేష్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ అవుట్ డేటెడ్ ప్లాట్ తీసుకున్న దర్శకుడు అరుణ్ మాతేష్వరన్ ఏ దశలోనూ ఈ ప్రతీకారపు హత్యాకాండను ఆసక్తికరంగా మలచలేకపోయాడు. విపరీతమైన హింస, జుగుప్సాకరంగా చంపడమే రా స్టోరీ టెల్లింగ్ అనే భ్రమలో డ్రామాకు చోటు ఇవ్వకుండా చాలా డ్రైగా తీశాడు. పిల్లలకు చూపించకపోవడమే మంచిది. కథనం ఎక్కడా పట్టుగా సాగదు. చిన్ని తన స్థితికి కారణమైన వాళ్ళను ఎలా పట్టుకుంటుందన్న ప్రాధమిక ఆసక్తిని కూడా అరుణ్ కలిగించలేకపోయాడు. కేవలం కీర్తి సురేష్ అభిమానులు అయ్యుండి ఆమె నటన కోసమే చూడాలనుకుంటే తప్ప చిన్నికి దూరంగా ఉండటం మంచిది

Show comments