Idream media
Idream media
తెలంగాణలో విపక్షాలు కొంచెం కొంచెం బలపడుతున్నాయి. ఇప్పటి వరకూ బీజేపీ మాత్రమే అధికార పార్టీకి పోటీ అన్నట్లుగా ఉండేది. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ కూడా పోటీకి సిద్ధమవుతోంది. ఆ మేరకు కేసీఆర్‌పైనా, టీఆర్‌ఎస్‌పైనా విమర్శల దాడితో వార్తల్లోకెక్కే ప్రయత్నం చేస్తోంది. విపక్షాల చర్యలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వాటికన్నా నాలుగు అడుగులు ముందే ఉంటున్నారు. గతానికి మించి జనజీవన స్రవంతితో సమ్మేళనం అవుతూ విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు అధికారంలో ఉన్నారు.., జనాల్లో ఎంతో కొంత వ్యతిరేకతే ఉండే ఉంటుంది. దీనికి తోడు విపక్షాలు యాక్టివ్ అవుతున్నాయి. దీంతో కేసీఆర్ మరింత యాక్టివ్‌గా దూసుకెళ్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా 2018లో పార్టీని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిన కేసీఆర్ తన నిర్ణయం సరైనదేనని నిరూపించారు. అలాగే, దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో అప్రమత్తమై పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా పీవీ కుమార్తెను రంగంలోకి దింపి గెలిపించడం ద్వారా తన నిర్ణయానికి తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో సీనియర్ నాయకుడు జానారెడ్డిపై రాజకీయాల్లో ఓనమాలు కూడా నేర్వని భగత్‌ను నిలబెట్టి గెలిపించడానికి కేసీఆర్ రచించిన ప్రణాళిక అంతా ఇంతా కాదు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు మూడు నెలల ముందే కేసీఆర్ హాలియాలో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. అంతర్లీనంగా ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే ఇక్కడ సభ ఏర్పాటు చేసినప్పటికీ ప్రాజెక్టుల ప్రగతి నివేదిక పేరును తెరపైకి తెచ్చారు. సభకు హాజరైన కేసీఆర్ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించి స్థానికులను ఆకట్టుకున్నారు. ఉప ఎన్నికలో గెలవడానికి అది కూడా దోహదపడింది. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా కూడా కేసీఆర్ అదే వ్యూహం అవలంబిస్తున్నారు. ప్రతిష్టాత్మక ‘దళిత బంధు’ పథకాన్ని హుజూరాబాద్‌లోనే ప్రారంభిస్తున్నారు. కేవలం ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఇరవై వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ముందు హాలియా సభలో ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేరాయో సమీక్ష కోసం అంటూ మరో సభ ఏర్పాటు చేసి కొత్త సాంప్రదాయానికి తెర తీశారు. అంతేకాకుండా పర్యటనలు, సమావేశాలు, సమీక్షలతో తాను ఉరుకులు, పరుగులు పెడుతూ పార్టీ శ్రేణుల్ని, యంత్రాంగాన్ని పెట్టిస్తున్నారు. తాజాగా యాదాద్రి భువన గిరిజిల్లా తుక్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలోని దళిత వాడల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సుమారు మూడు గంటల పాటు పర్యటించారు. దళిత కుటుంబాల మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బొట్టుపెట్టి స్వాగతం పలికారు. దళిత వాడల్లోని సుమారు 60 ఇండ్లలోకి వెళ్లి కాలినడకన పర్యటిస్తూ ప్రతి ఒక్కరినీ యోగ క్షేమాలును, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇండ్లులేని వారందరికీ డబుల్‌బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా, దళిత బంధు పథకం గురించి తెలుసా? అని అడుగుతూ తానే పథకం లక్ష్యాలను, ఉద్దేశాన్ని వివరించారు. ఇలాంటివన్నీ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. పథకాన్ని స్వయంగా కేసీఆర్ ప్రచారం చేస్తుండడంతో ఆయన ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థమవుతోంది. రానున్న ఎన్నికల నాటికి ఎలాగైనా బలపడాలని ప్రయత్నిస్తున్న విపక్షాలకు ఆ చాన్స్ ఇవ్వకుండా కేసీఆర్ రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. ఈ క్రమంలో ఇప్పుడే కేసీఆర్ ఇంతలా దూసుకెళ్తుంటే.. మున్ముందు మరింత దూకుడుగా వెళ్లడం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు.