వీరప్పన్ – సూపర్ స్టార్… 15 కోట్ల కిడ్నాప్ కథ

  • Published - 03:59 AM, Wed - 10 February 21
వీరప్పన్ – సూపర్ స్టార్… 15 కోట్ల కిడ్నాప్ కథ

బాగా పేరున్న ప్రముఖులను,సినీ నటులను కిడ్నాప్ చేసి కోట్ల రూపాయలను డిమాండ్ చేయడాన్ని ఎన్నో సినిమాల్లో చూసి ఉంటాం. ఇలాంటి కిడ్నాప్ థ్రిల్లర్ సినిమాల్లో విలన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కిడ్నాపర్ల బారి నుండి బాధితులను విడిపించే బాధ్యత హీరో భుజాన వేసుకుంటాడు. కిడ్నాప్ డ్రామా ఆధారంగా రూపొందిన ఎన్నో చిత్రాలు బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. కానీ విలన్లకు సింహ స్వప్నంగా కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవంగా కన్నడ ప్రజల గుండె చప్పుడుగా నీరాజనాలు పొందిన కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ను రెండు రాష్ట్రాలను గడగడ వణికించిన గంధపు చెక్కల దొంగ స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేయడం ఓ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించడంతో పాటు రాజ్ కుమార్ అభిమానులకు ఎన్నో నిద్రలేని రాత్రులు మిగిల్చింది.

రాజ్ కుమార్ కిడ్నాప్

2000 జూలై 30.. దివంగత కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్‌‌ తన భార్య పార్వతమ్మతో కలిసి ఈరోడ్ జిల్లా తొట్టకాజనూరు ఫార్మ్ హౌస్ కి వెళ్లగా స్మగ్లర్,బందిపోటు వీరప్పన్ తన 14 మంది అనుచరులతో కలిసి రాజ్ కుమార్ తో పాటు మరో ఇద్దరిని ఆయుధాలతో బెదిరించి కిడ్నాప్ చేసాడు. కిడ్నాప్ చేసిన వారిని అడవుల్లోకి తరలించి రాజ్ కుమార్ అభిమానులతో పాటు కర్ణాటక ప్రభుత్వానికి సవాల్ విసిరాడు. దీంతో యావత్ భారతం షాక్ కి గురయ్యింది. అప్పట్లో బందిపోటు వీరప్పన్ గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. అతని క్రూరత్వం గురించి తెలియజెప్పేందుకు వీరప్పన్ చేసిన హత్యలను ప్రస్తావిస్తూ ఎన్నో కథనాలు వార్త పత్రికల్లో ప్రతిరోజూ వస్తుండేవి. చిన్న అనుమానం వచ్చినా సరే ఎంతో క్రూరంగా హత్యలు చేసే వీరప్పన్ సత్యమంగళం అడవుల్లో ఉంటూ దంతాల కోసం ఏనుగులను చంపుతూ, పోలీసులను,పోలీసు ఇంఫార్మర్లను హత్య చేస్తూ కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలకు సవాల్ విసిరాడు.

వీరప్పన్ సంఘ విద్రోహ శక్తిగా మారడంతో తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు కలిపి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ని ఏర్పాటు చేసి సత్యమంగళం అడవులను జల్లెడ పట్టాయి. కానీ అత్యంత దట్టమైన సత్యమంగళం అడవుల్లో వీరప్పన్ ఆచూకీ పసిగట్టలేకపోయాయి. రాజ్ కుమార్ కిడ్నాప్ తర్వాత రెండు రోజులకోసారి మకాం మారుస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు వీరప్పన్. సత్యమంగళం అడవుల్లో అణువణువు తెలిసిన వాడు కావడం పక్షులు,జంతువులు చేసే శబ్దాలను బట్టి కొత్తవారు ఎవరైనా అడవుల్లోకి ప్రవేశిస్తే గుర్తు పట్టి మరో కొత్త ప్రాంతానికి చేరి మకాం పెట్టడం.. ఇలా రోజులు గడుస్తున్నాయి. రాజ్ కుమార్ కిడ్నాప్ అనంతరం ప్రజలనుండి ఒత్తిడి ఎక్కువ కావడంతో కర్ణాటక ప్రభుత్వం వీరప్పన్ తో రాయబారం నడిపేందుకు తమిళనాడు ప్రభుత్వాన్ని సహాయం అడిగింది. నక్కీరన్ పత్రిక వ్యవస్థాపకుడు గోపాల్ ని వీరప్పన్ తో సంప్రదింపులు జరపడానికి తమిళనాడు ప్రభుత్వం పంపడంతో రాజ్ కుమార్ విడుదల గురించి చర్చలు జరిగాయి.

రాజ్ కుమార్ ను విడుదల చేయడానికి వీరప్పన్ విచిత్రమైన డిమాండ్లు చేసాడు. కావేరీ నదీ జలాల విషయంలో తమిళనాడుకు న్యాయం జరగాలని కర్ణాటకలో తమిళ భాషను రెండో అధికార భాషగా ప్రకటించాలని వీరప్పన్ విచిత్రమైన డిమాండ్లను పెట్టాడు. అప్పటికే రాజ్ కుమార్ అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తుండడంతో కర్ణాటక ప్రభుత్వం ఒత్తిడిలో కూరుకుపోయింది. దాంతో అప్పటి కర్ణాటక సీఎం ఎస్‌ఎం కృష్ణ శాటిలైట్‌ ఫోన్లో వీరప్పన్‌తో చర్చలు జరిపారు. దాదాపు 108 రోజుల అనంతరం కన్నడ కంఠీరవుడికి వీరప్పన్ చెర నుండి విముక్తి లభించింది. 2000 సంవత్సరం నవంబర్‌ 15న రాజ్ కుమార్ ను విడుదల చేయడంతో కర్ణాటక ప్రభుత్వంతో పాటు అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. రాజ్ కుమార్ విడుదల కోసం వీరప్పన్‌కి కర్ణాటక ప్రభుత్వం భారీ మొత్తంలో డబ్బును ముట్టజెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి వివరాలు బయటకు పొక్కకుండా కర్ణాటక ప్రభుత్వం జాగ్రత్త పడింది.

తాజాగా ప్రముఖ పాత్రికేయుడు శివ సుబ్రహ్మణ్యం వీరప్పన్ జీవితంపై ఒక పుస్తకాన్ని రాసారు. “రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ వీరప్పన్” పుస్తకంలో ఆనాటి సంఘటనలను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు శివ సుబ్రహ్మణ్యం. రాజ్ కుమార్ విడుదల కోసం మూడు విడతలుగా సుమారు 15 కోట్ల రూపాయల మొత్తాన్ని వీరప్పన్‌కి కర్ణాటక ప్రభుత్వం ముట్టజెప్పినట్లు చెప్పుకొచ్చిన శివ సుబ్రహ్మణ్యం మొదటి రెండు విడతల్లో ఐదు కోట్లు చొప్పున మూడో విడతలో 5.22 కోట్ల మొత్తాన్ని వీరప్పన్‌కి ఇచ్చిందని తెలిపారు. దీంతో అప్పట్లో భారీ మొత్తం ఇచ్చి రాజ్ కుమార్ ని విడిపించినట్లు వచ్చిన కథనాలకు బలం చేకూరినట్లయింది.

రాజ్ కుమార్ కిడ్నాప్ అనంతరం అదే తరహాలో 25 ఆగస్టు 2002లో కర్ణాటక మాజీ మంత్రి నాగప్పను వీరప్పన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. కానీ వీరప్పన్ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో నాగప్పని వీరప్పన్ దారుణంగా హత్య చేశాడు. 8 డిసెంబర్ 2002 లో నాగప్ప మృతదేహం చంగడి అడవుల్లో దొరికింది.

ఆపరేషన్ కకూన్

2004 సంవత్సరంలో వీరప్పన్ గ్యాంగులో సభ్యులు ఒక్కొక్కరిగా తగ్గుతూ వచ్చారు. వీరప్పన్ బలహీన పడ్డాడని తెలుసుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు వీరప్పన్ కదలికలపై నిఘా పెట్టారు. వీరప్పన్ ని పట్టుకోవడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ కకూన్.. 18 అక్టోబర్ 2004న కంటి చూపు మందగించడంతో చికిత్స కోసం ఒక అంబులెన్స్ లో అడవి దాటి బయటకు వచ్చిన వీరప్పన్ గ్యాంగుని చుట్టిముట్టిన ఎస్టీఎఫ్ అధికారులు లొంగిపొమ్మని హెచ్చరించారు. కానీ వీరప్పన్ గ్యాంగ్ కాల్పులు జరపడంతో ఎస్టీఎఫ్ అధికారులు బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. దాంతో 40 సంవత్సరాల పాటు రెండు రాష్ట్రాలను గడగడలాడించిన వీరప్పన్ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. ఆ విధంగా ఆపరేషన్ కకూన్ ముగిసింది. వీరప్పన్ తన జీవిత కాలంలో మొత్తం 184 మందిని హత్య చేయగా ఎన్నో ఏనుగులను దంతాల కోసం మట్టుబెట్టాడు.

రీల్ లైఫ్ లో పగ తీర్చుకున్న రాజ్ కుమార్ కుమారుడు

వీరప్పన్ ప్రధాన పాత్రగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ చిత్రాన్ని రూపొందించగా వీరప్పన్ ను మట్టుబెట్టే ఎస్టీఎఫ్ అధికారి విజయ్ కుమార్ పాత్రను కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుమారుడు శివ రాజ్ కుమార్ పోషించాడు. రియల్ లైఫ్ లో తండ్రిని కిడ్నాప్ చేసిన వీరప్పన్ ను ఎన్ కౌంటర్ చేసే పాత్రలో శివ రాజ్ కుమార్ జీవించాడు. ఆ విధంగా రియల్ లైఫ్ లో తండ్రిని కిడ్నాప్ చేసిన వీరప్పన్ పై రీల్ లైఫ్ లో పగ తీర్చుకునే అవకాశం కిల్లింగ్ వీరప్పన్ సినిమా ద్వారా శివ రాజ్ కుమార్ కి లభించింది.

ఆ తొమ్మిది మంది నిర్దోషులే

కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ని వీరప్పన్ 14 మంది అనుచరులతో కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును విచారించిన తమిళనాడులో ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాళయం న్యాయస్థానం ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిది మంది నిందితులను వీరప్పన్ మనుషులనేందుకు సరైన సాక్ష్యాల్లేవని నిర్దోషులుగా ప్రకటించింది. కాగా 2004 అక్టోబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరప్పన్, అతని అనుచరులు గోవిందన్, చంద్రగౌడ తదితరులు హతమవ్వడంతో రాజ్ కుమార్ కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు మృతి చెందారు. మిగిలిన 9 మందిని నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది.

Show comments