కాంగ్రెస్ కూటమిదే జార్ఖండ్‌

జార్ఖండ్‌లో శాసన సభకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓట్ల లెక్కింపులో ఆధిక్యం అధికార బీజేపీ, కాంగ్రెస్‌ కూటమి మధ్య దోబూచులాడినా చివరకు కాంగ్రెస్‌ కూటమి వైపే జార్ఖండ్‌ ప్రజలు మొగ్గు చూపారు.

శాసన సభలో మొత్తం 81 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం కాంగ్రెస్, జార్ఖండ్‌ ముక్తి మోర్చా, రాష్ట్రీయ జనతా దళ్‌ కూటమి 4 స్థానాల్లో విజయం సాధించిగా మరో 45 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక అధికార బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించి, మరో 18 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్‌ యూనియన్‌ పార్టీ ఒక స్థానంలో విజయం సాధింకగా, మరో రెండు సీట్లలో ఆధిక్యంలో ఉండగా ఇతరులు నాలుగు స్థానాల్లో ముందజలో ఉన్నారు.

ప్రస్తుత ఫలితాల సరళీతో జార్ఖండ్‌లో కాంగ్రెస్‌ కూటమి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళుతోంది. మేజిక్‌ ఫిగర్‌ 41 సీట్లు కాగా ఇప్పటికే కాంగ్రెస్‌ కూటమి 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇందులో ఇప్పటికే 6 స్థానాల్లో విజయం ఖాయమైంది. ఫలితాలు కాంగ్రెస్, జార్ఖండ్‌ ముక్తి మోర్చా, రాష్ట్రీయ జనతాదళ్‌ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నాయి.

ఝంషెడ్‌పూర్‌ తూర్పు నియెజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత, ప్రస్తుత సీఎం రఘబర్‌ దాస్‌ వెనుకంజలో ఉన్నారు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా నేత హేమంత్‌ సోరేన్‌ పోటీ చేసిన రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా నేత బాబులాల్‌ మారండి ధన్వార్‌లో ఆధిక్యంలో ఉన్నారు. శిల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్‌ యూనియన్‌ పార్టీ నేత సుదేష్‌ కుమార్‌ మహ్‌తో గెలుపు దిశగా పయనిస్తున్నారు.

Show comments