Idream media
Idream media
ముఖ్యమంత్రిగా ఇంకా మూడేళ్ల అనుభవం కూడా లేదు. తలపండిన రాజకీయ నాయకుడూ కాదు. కానీ.. ఆలోచనా విధానంలో, పాలనా సంస్కరణల్లో, సంచలన నిర్ణయాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అందరినీ ఆలోచింపచేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేక అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రతిపక్ష పార్టీ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. రాష్ట్రంలో కల్లోలం సృష్టించేందుకు యత్నిస్తోంది. మరోవైపు కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన నిధులు, విధుల విషయంలో దోబూచులాడుతోంది. అయినప్పటికీ జగన్ రాష్ట్ర ప్రగతి, సంక్షేమంపై దృష్టి మరల్చకుండా వాటి అమలుకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నారు. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో సంక్షేమానికి జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. విద్య, వైద్య రంగాలలో సరికొత్త అధ్యాయాలకు శ్రీకారం చుట్టారు.
నేటి రాజకీయ సమాజంలో విమర్శలు, దూషణలకే మెజార్టీ నాయకులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు తాము గొప్ప అని చాటిచెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. హంగు, ఆర్భాటాల ద్వారా ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం జగన్ కంటే ముందు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అయితే మామూలు మాయాజాలం చేయలేదు. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలన్నీ ప్రదర్శించారు. గ్రాఫిక్స్ తో కనికట్టు చేశారు. ఎప్పుడూ ప్రతిపక్షాన్ని ఎలా అణగదొక్కాలనే చూశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఎలా తెచ్చుకోవాలి అనే అంశంపై ప్రధాన దృష్టి సారించారు. కానీ జగన్ మాత్రం మొదటి నుంచీ భిన్నత్వం చూపుతున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకే నిరంతరం శ్రమిస్తున్నారు.
ఉదాహరణకు అప్పుల విషయాన్నే తీసుకుందాం. రాష్ట్ర అవసరాలకు అప్పు చేయడం జగనే మొదలుపెట్టారన్నంత హడావిడి చేస్తోంది టీడీపీ. లేనిపోని అపోహలు సృష్టించి ఉద్యోగులు, ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కానీ జగన్ మాత్రం.. రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో మునగడానికి మూల కారణమైన చంద్రబాబును ఏనాడూ దూషించలేదు. అయిదేళ్లు ఇసుకను బొక్కేసిన టీడీపీ ఇసుకాసురులను ఎలా ఇరుకున పెట్టాలని చూడలేదు. సమస్యలను అధిగమించి సాఫీగా ఇసుకను ప్రజలకు అందించడంపైనే దృష్టి పెట్టారు. కరెంటు కాంట్రాక్టుల్లో వేలకు వేల కోట్లు అప్పనంగా దోచుకుని ఆంధ్రరాష్ట్రాన్ని అంధకారంలో నెట్టినా.. బకాయిలన్నింటినీ తీర్చుతూ చిరునవ్వుల వెలుగులు నింపారు.
పోలవరం ప్రాజెక్టు చేపట్టాలంటేనే డబ్బులు పుట్టని పరిస్థితి సృష్టించి ప్రభుత్వాన్ని కలవర పెట్టాలని చూసినా.. ఫలానా సమయానికి పోలవరం పూర్తిచేస్తానని మాటిచ్చి మరీ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నారు. పనులకు అడ్డంకులు కలగకుండా సీజన్, సమయానుగుణంగా దిశానిర్దేశం చేస్తూ ప్రాజెక్టు ముందుకు సాగేలా చూస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కులం, మతం పేరుతో బురదజల్లాలని చూసినా.. ప్రజలకు అందాల్సిన హక్కులకు మోకాలొడ్డుతున్నా.. పేపర్లు, టీవీ ఛానల్స్‌తో పచ్చమీడియా నిత్యం విషం చిమ్ముతున్నా.. చిరునవ్వుతో ముందుకు సాగుతూ అనుకున్న మంచిని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నిత్య నూతన నిర్ణయాలతో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే రాజకీయంగాను, సామాజికంగాను జగన్ అనురిస్తున్న విధానం అనుభవజ్ఞులను సైతం అబ్బురపరుస్తోంది.