మేనిఫెస్టోల తర్వాత యూపీలో లెక్కలు మారబోతున్నాయా..?

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వరుసగా రెండోసారి గెలవాలని బీజేపీ, మళ్లీ అధికారం సంపాదించాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. పూర్వవైభవం కోసం కాంగ్రెస్‌ పార్టీ, ఉనికి కోసం బీఎస్పీలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఏడుదశల్లో జరగబోయే ఎన్నికలకు తొలి దశ ప్రచార పర్వం ముగిసేరోజున ప్రధాన పార్టీలైన బీజేపీ, ఎస్సీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలను ప్రకటించాయి. రైతు రుణాల మాఫీ చేస్తామని ఎస్పీ ప్రధానంగా హామీ ఇవ్వగా.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇంటికొక ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామనే హామీలను బీజేపీ ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ నెల 10వ తేదీన తొలి దశలో 58 స్థానాలకు పోలింగ్‌ జరగబోతోంది. మొత్తం ఏడు దశల్లో 403 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.

ప్రస్తుతం బీజేపీకే మొగ్గు..

అధికారం సాధించడంపై ఎవరికి వారు ధీమాగా ఉన్నా.. ఇప్పటి వరకు జరిగిన సర్వే ఫలితాలు అన్నీ బీజేపీవైపునకే మొగ్గు చూపాయి. 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 403 సీట్లకు గాను బీజేపీ 384 సీట్లలో పోటీ చేసి ఏకంగా 312 సీట్లను గెలుచుకుని అధికారం చేపట్టింది. అప్పటి వరకు లోక్‌సభ సభ్యుడుగా ఉన్న యోగీ ఆధిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అంతకుముందు ఎన్నికల్లో 224 సీట్లు గెలుచుకుని అధికారంలో ఉన్న ఎస్పీ 2017 ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైంది. ఆ ఎన్నికల్లో ఎస్పీ కేవలం 47 సీట్లకు పరిమితమైంది. మరో ప్రధాన పార్టీ అయిన బీఎస్పీ కేవలం 19 సీట్లకు పరిమితమైంది.

ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఇప్పటి వరకు జరిగిన సర్వేలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో గెలుచుకున్న సీట్లలో చాలావరకు బీజేపీ కోల్పోతుందని, ఆ పార్టీకి 220 సీట్లు రావొచ్చనే అంచనాలు ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు వేశాయి. బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అయిన ఎస్పీ.. 150 సీట్లు గెలుచుకుని అధికారానికి 50 సీట్ల దూరంలో ఆగిపోతుందని అంచనాలు కట్టాయి. ఉత్తరప్రదేశ్‌లో మేజిక్‌ ఫిగర్‌ 202 సీట్లు. సర్వే అంచనాల ప్రకారం బీజేపీకి మేజిక్‌ ఫిగర్‌ కన్నా 20 సీట్లు అధికంగా వస్తుండగా.. ఎస్పీ మాత్రం 50 సీట్ల దూరంలో ఉంది.

మేనిఫెస్టోలు మార్చబోతున్నాయా..?

ఇప్పటి వరకు ఉన్న అంచనాలు తాజాగా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోల తర్వాత మారబోతున్నాయా..? అనే చర్చలు సాగుతున్నాయి. ఐదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ పట్ల సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. దీనికి తోడు ఇటీవల వరకు జరిగిన రైతు ఉద్యమం, రైతులపై కారును నడిపి ఏడుగురు రైతుల మరణానికి కేంద్ర మంత్రి కుమారుడు కారణం అవడం.. బీజేపీకి నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. వీటితోపాటు ఎస్పీ ప్రకటించిన రైతు రుణాల మాఫీ రైతు కుటుంబాలను ఆ పార్టీ వైపు చూపేలా చేస్తోంది. 2025 కల్లా రాష్ట్రంలోని రైతులను రుణ విముక్తి చేయడమే తమ లక్ష్యమని ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ చెప్పడం రైతుల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలను తమ ఆందోళనతో వెనక్కి తీసుకున్నా.. మళ్లీ ఆయా చట్టాలను బీజేపీ తీసుకువస్తుందనే అనుమానాలు, భయాలు రైతుల్లో ఉండడం ఈ ఎన్నికల్లో బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే అంచనాలున్నాయి.

హిందుత్వ అజెండాలోనూ పోటాపోటీ..

ఎన్నికల హామీలు, మేనిఫెస్టోలతోపాటు మతం కూడా యూపీ ఎన్నికల్లో ప్రధాన ప్రాత పోషిస్తోంది. బీజేపీ, ఎస్పీ నేతలు మతపరమైన అంశాలను ప్రచారాస్త్రాలుగా చేసుకున్నారు. తాను సీఎం అవ్వబోతున్నట్లు కృష్ణుడు తన కలలోకి వచ్చి చెప్పాడని అఖిలేష్‌ యాదవ్‌ చెబుతుండగా.. ఈ ఎన్నికలు 80 శాతానికి 20 శాతానికి మధ్య అంటూ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ మాట్లాడుతున్నారు. బీజేపీ బాహాటంగానే హిందూ, ముస్లింల మధ్య పోరు అంటూ చెబుతుండగా.. ఎస్పీ అధినేత అఖిలేష్‌ మాత్రం సున్నితమైన హిందుత్వం అజెండగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ అంశాలతోపాటు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రస్తుతం ఉన్న సమీకరణాలను మార్చబోతాయా..? లేదా.. అంచనాల ప్రకారమే బీజేపీకి అధికారం దక్కుతుందా..? వేచి చూడాలి.

Also Read : మిగిలిన ఐదుగురూ జంప్‌.. మేఘాల‌యలో కాంగ్రెస్ ఖాళీ..!

Show comments