Idream media
Idream media
ఏపీ బీజేపీ చీఫ్ మారనున్నారా? సోము వీర్రాజుకు ఉద్వాసన పలికి కొత్త చీఫ్ ను నియమించనున్నారా..? అంటే అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజును తొలగించాలని అధిష్ఠానం నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వీర్రాజు తొలి రోజుల్లో దూకుడుగా వ్యవహరించారు. ప్రముఖులను కలుస్తూ బీజేపీ బలోపేతానికి బాటలు వేసే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో అధికార వైసీపీతో పాటు తెలుగుదేశాన్ని కూడా టార్గెట్ చేశారు. నిజంగా చెప్పాలంటే.. రాష్ట్రంలో వైసీపీ పటిష్టంగా ఉందని భావించి, తొలుత టీడీపీపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలిచే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. బీజేపీలోకి వలసలు మొదలవుతున్నాయ్.. అంటూ టీడీపీని కలవర పెట్టారు. ఇది చంద్రబాబు సహా.. బీజేపీలోని బాబు నమ్మిన బంటులకు నచ్చేది కాదు. ఈ క్రమంలోనే సోము మార్పునకు పావులు కదిపారన్న ప్రచారం జరుగుతోంది.
భారతీయ జనతా పార్టీకి చేరువయ్యేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు తెలిసిందే. కానీ సోము వీర్రాజు బాబు కల నెరవేరడానికి అడ్డుపడుతున్నారు. ఇది కూడా సోము మార్పుపై వస్తున్న ఊహాగానాలకు నిజమన్న వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు సరిగ్గా ఏడాది క్రితం అధ్యక్ష పగ్గాలు చేపట్టిన వీర్రాజు.. రెండు నెలలపాటు పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటు చేసుకోలేకపోయారు. జగన్ సర్కారుపై పోరాటం మాట తర్వాత.. కనీసం సొంత పార్టీ బలోపేతానికి కనీస ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలున్నాయి. పొరుగు రాష్ట్రంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుకు అక్కడి టీఆర్‌ఎస్ పెద్దలకు చెమటలు పట్టాయి. కేసీఆర్, హరీశ్‌రావు నియోజకవర్గాల మధ్యలో ఉన్న దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం సంజయ్ పోరాడిన తీరు జాతీయ నాయకత్వాన్ని ఆకట్టుకుంది. మరింత స్వేచ్ఛ ఇవ్వడంతో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. తాజాగా హుజూరాబాద్‌లో సైతం కేసీఆర్‌కు సంజయ్ విసురుతున్న సవాళ్లు బీజేపీ కేడర్‌లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. అక్కడితో పోల్చినప్పుడు ఏపీ లో బీజేపీ బలోపేతానికి సోము వీర్రాజు చేస్తున్న కృషి చిన్నదిగా కనిపిస్తోంది.
అలాగే పార్టీలోని కొంత మందిని పూర్తిగా పక్కన పెట్టారన్న విమర్శలు వీర్రాజుపై ఉన్నాయి. ఇక తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన జట్టుకట్టినా పార్టీ అభ్యర్థికి డిపాజిట్ దక్కకపోవడం అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించింది. ఏదైనా అంశంపై జగన్ సర్కారును సూటిగా విమర్శించకుండా.. ముందు మాజీ సీఎం చంద్రబాబును ఏదో ఒకటి అనడాన్ని కొందరు హైలెట్ చేసినట్లు తెలిసింది. ఇది తెలియడంతో ఆయన ఇటీవలి కాలంలో పదే పదే ఢిల్లీ వెళ్తూ హడావుడి చేస్తున్నారని.. కానీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన్ను కలిసేందుకు సమయమివ్వడానికి ససేమిరా అనడంతో రెండుసార్లు ఉసూరుమంటూ తిరిగొచ్చారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
పార్టీని బలోపేతానికి సోము చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదని, పైగా తన వర్గాన్ని అందలం ఎక్కిస్తూ మరో వర్గాన్ని పూర్తిగా తొక్కేస్తున్నారన్న ఫిర్యాదులు ఢిల్లీకి బలంగా వెళ్లాయి. దీనిపై ఆరా తీసిన జాతీయ నాయకత్వం కొన్నాళ్లుగా రాష్ట్ర ఇన్‌చార్జి శివప్రకాశ్‌ను రాష్ట్రానికి తరచూ పంపుతోంది. ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నంలో పర్యటించిన ఆయన.. వాస్తవాలను ఢిల్లీ పెద్దలకు చెప్పడంతో వీర్రాజుపై వేటుకు నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ దఫా రాయలసీమకు ప్రాధాన్యమివ్వాలనుకుంటే.. అధిష్ఠానం మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి అవకాశమివ్వొచ్చని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంత వరకు నిజమో, దీనిపై సోము ఎలా స్పందిస్తారో చూడాలి.