Vande Bharat Sleeper Trains Photos: వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌ ఎలా ఉందో చూశారా.. వైరలవుతోన్న ఫొటోలు

వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌ ఎలా ఉందో చూశారా.. వైరలవుతోన్న ఫొటోలు

దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించి.. వేగంగా గమ్య స్థానం చేరుకోవడం కోసం.. కేంద్ర ప్రభుత్వం.. వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఖర్చు తక్కువ మాత్రమే కాక.. ప్రయాణ సమయం చాలా వరకు తగ్గిందని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వందే భారత్‌ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఇప్పటి వరకూ వందే భారత్ రైళ్లల్లో కేవలం కూర్చొని ప్రయాణించే అవకాశం మాత్రమే ఉంది. చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ క్లాసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

కానీ త్వరలోనే వందే భారత్‌ రైళ్లలో స్లీపర్‌ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి అని గతంలోనే తెలిపారు. ఈ క్రమంలో తాజాగా వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వచ్చే ఏడాది అనగా 2024, ఫిబ్రవరి నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రాథమిక డిజైన్‌కు ఆమోదం తెలిపామని.. తయారీ కూడా మొదలైందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ప్రొటోటైప్‌కు దాదాపు ఆమోదం తెలిపామన్న అశ్విని వైష్ణవ్.. డిసెంబర్లో ట్రాక్ టెస్ట్ సైతం నిర్వహిస్తామన్నారు. ట్రాక్ టెస్ట్ విజయవంతమైన తర్వాత ఈ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. 2023 డిసెంబర్‌లో స్లీపర్-ఎడిషన్ వందేభారత్ ప్రోటోటైప్ సిద్ధమవుతుందని, మార్చి 2024లో విడుదల చేస్తామని తెలిపారు. వందే భారత్ స్లీపర్‌ రైలు తుది డిజైన్ అనేక మార్పులకు గురైందని వైష్ణవ్ వివరించారు.

వందే భారత్ స్లీపర్ రైళ్లను చెన్నైలోని ఇంటీగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐఎఫ్‌సీ), బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీ మాన్యుఫాక్చర్ చేస్తున్నాయి. ప్రస్తుతమున్న వందే భారత్ రైళ్లతో పోలిస్తే.. స్లీపర్ రైళ్లలో డిజైన్‌లో చాలా మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో వందే భారత్ స్లీపర్ రైలులో 22, 24 బోగీలు ఉంటాయి. ప్రస్తుతం చెన్నైలో తయారవుతోన్న వందే భారత్ స్లీపర్ రైళ్లో 857 బెర్త్‌లు ఉన్నాయి. ఇందులో 823 బెర్త్‌లు ప్రయాణికుల కోసం ఉద్దేశించినవి కాగా.. 34 బెర్తులను సిబ్బందికి కేటాయిస్తారు.

అప్పర్ బెర్త్‌లకు ఎక్కేందుకు ఏర్పాటు చేసే మెట్లను సైతం అందంగా డిజైన్ చేయనున్నారు. సాధారణ రైళ్లలో ఒక బోగీలో నాలుగు టాయిలెట్లు ఉంటాయి. కానీ వందే భారత్ స్లీపర్ రైళ్లలో మూడు టాయిలెట్లు మాత్రమే ఉంటాయి. నాలుగో టాయిలెట్ బదులు మినీ ప్యాంట్రీని ఏర్పాటు చేస్తారు.

Show comments