హుజూరాబాద్ లో ఈట‌ల‌కు షాక్ ఇచ్చే ప‌రిణామాలు?

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో స్థానిక రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. తెర‌పై ఒక‌లా.. తెర వెనుక మ‌రోలా రాజ‌కీయాలు సాగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ప్ర‌చారం, ప్ర‌జ‌ల్లో చూస్తే ఈట‌ల రాజేంద‌ర్ కు భారీగానే బ‌లం క‌నిపిస్తోంది. అలాగే సానుభూతి కూడా ఉంది. కానీ.. వాటి నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెర వెనుక భారీగానే మంత్రాంగం న‌డుపుతున్నార‌న్న అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే పండ‌గ‌ల సాకు చూపి ఉప ఎన్నికను వాయిదా వేయించిన ఆయ‌న ఈ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు పావులు క‌దుపుతున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈట‌ల రాజేంద‌ర్ గెలిస్తే.. నియోజ‌క‌వ‌ర్గానికి ఏం వ‌స్తుంది, టీఆర్ఎస్ గెలిస్తే ఎలా ఉంటుంది.. అనే తేడాల‌ను వివ‌రిస్తూ ఆక‌ట్టుకుంటున్న‌ట్లుగా తెలుస్తోంది. అలాగే.. తెరపై దళితబంధు కనిపిస్తోంది. ఒక్కో కుటుంబం ఖాతాలో 10లక్షల రూపాయలు పడుతున్నాయి. కానీ తెరవెనక జరిగేది ఏంటంటే, దాదాపు 35వేల ఓట్లు ఈటల చేజారిపోతున్నాయి. ప్రభుత్వం తరపున దళితులకు సాయం, వారి ఓట్లన్నీ టీఆర్ఎస్ పార్టీకి ఖాయం అనేలా ఉంది అక్కడ పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని వైరి పక్షాలు డిమాండ్ చేస్తూ, తామేదో కేసీఆర్ ని ఇరుకున పెట్టినట్టు భావిస్తున్నాయి. కానీ కేసీఆర్ అన్నిచోట్లా అమలు చేస్తామంటూనే, ముందు హుజూరాబాద్ లో చేయాల్సింది చేస్తున్నారు.

దీనికి తోడు.. తెరవెనక నుంచి పరిస్థితి గమనిస్తే, అంతా టీఆర్ఎస్ కోవర్టులే బీజేపీ వ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. పక్కనే ఉండి ఈటల ఓటమి కోసం కృషి చేస్తున్న బ్యాచ్ ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆమధ్య ఈటల బావమరిది వాట్సప్ చాటింగ్, ఈటల గడియారాలు పంచే కార్యక్రమాల ఫుటేజీ, ఈటలకు దళితులు పాలాభిషేకం చేసి కాళ్లు కడిగిన వీడియోలు.. వైరిపక్షానికి నిముషాల్లో చేరిపోతున్నాయి. ఇవన్నీ ఓ కోవర్ట్ బ్యాచ్ చేస్తోంది, చేయిస్తోంది. తనవారెవరు, టీఆర్ఎస్ కోవర్టులెవరో తేల్చుకోలేక ఈటల తలపట్టుకుంటున్నారు. దీంతో పాటు.. కులాల వారీగా పంపకాలు జ‌రుగుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దళితుల్ని ఇప్పటికే తనవైపు తిప్పుకున్న కేసీఆర్.. ఇతర సామాజికవర్గాలన్నింటినీ తెరవెనక సంతోషపెట్టారనే టాక్ వినిపిస్తోంది.

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి ఆకాశాన్నంటుతుందనే హామీలు కనపడుతున్నాయి. తెరవెనక మాత్రం ఈటల గెలిస్తే హుజూరాబాద్ నాశనం అనే వార్నింగులు వినపడుతున్నాయి. దళితబంధు అందకుండా చేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు కింది స్థాయి నేతలు. ఈటలను గెలిపిస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావని తేల్చి చెప్పేస్తున్నారట‌. ఈటల వైపు నిలబడి తామెందుకు నష్టపోవాలి, నియోజకవర్గ అభివృద్ధికి ఎందుకు అడ్డుపడాలనే ఆలోచ‌న స్థానిక నాయ‌కుల్లోనూ, మెజార్టీ వ‌ర్గాల్లోనూ తెచ్చే ప్ర‌య‌త్నం గులాబీ శ్రేణులు జోరుగా చేస్తున్నారు. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే.. తెర ముందు చేసే రాజ‌కీయాల క‌న్నా.. తెర వెనుక చేసే రాజ‌కీయాలే అక్క‌డ ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

Also Read :  తెలంగాణ‌లో చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు దేనికి సంకేతం?

Show comments