సినిమా క‌థ రాయ‌డ‌మెలా? – 10

జేసుదాసు పాట హాయిగా వుంటుంది. మ‌న ఆనందం వెనుక ఆయ‌న వేల‌గంటల సాధన వుంది. ఒక జిమ్నాస్టిక్ శ‌రీరంలో మ్యాజిక్ క‌నిపిస్తూ వుంటుంది. కొన్నేళ్లు తెల్ల‌వారుజామున లేచి చ‌లిలో ప‌రిగెత్తితే , ఎన్నోసార్లు కింద ప‌డి దెబ్బ‌లు తింటేనే అది సాధ్యం. కొన్ని వేల కాగితాలు చించిప‌డేస్తే మంచి క‌థ పుడుతుంది. చించ‌క‌పోయినా పుట్టొచ్చు. స‌బ్బు నీళ్ల‌తో పిల్ల‌లు ఊదే గాలి బుడ‌గ‌ల్లా కొన్ని క్ష‌ణాలు అందంగా క‌నిపించి మాయ‌మైపోతాయి. ఎవ‌రికీ గుర్తుండ‌వు.

1974లో ఒక కుర్రాడికి ఫిజిక్స్ అర్థం కాక కాలేజీ మానేశాడు. ర‌క‌ర‌కాల ఉద్యోగాలు చేసి ట్ర‌క్ డ్రైవ‌ర్‌గా కుదురుకున్నాడు. 1977లో స్టార్‌వార్స్ సినిమాని ఊపిరి బిగ‌ప‌ట్టి చూశాడు. ఎప్ప‌టికైనా అలాంటి సినిమా తీయాల‌నుకున్నాడు. ఉద్యోగం మాని హాలీవుడ్ వెళ్లిపోయాడు. స‌రిగ్గా ఏడేళ్ల‌కు తీశాడు. దాని పేరు టెర్మినేట‌ర్‌. అత‌ని పేరు జేమ్స్ కామెరూన్‌.

స‌క్సెస్ అయిన ప్ర‌తి వాడి గురించి ఇలాంటి క‌థ చెబుతారు. అస‌లు స‌క్సెస్ కావ‌డం ఎలా? అది ప్ర‌శ్న‌. కొన్ని వేల గంట‌ల సాధ‌న చేస్తే వ‌స్తుంది. స‌క్సెస్ రావ‌డం కంటే వ‌చ్చిన స‌క్సెస్‌ని నిలుపుకోవ‌డం అంత‌కు మించిన క‌ష్టం.

మొద‌టి సినిమాకి ఎంతో క‌ష్ట‌ప‌డి క్రియేటివిటీ చూపించిన ర‌చ‌యిత / ద‌ర్శ‌కులే రెండో సినిమాకి చ‌తికిల ప‌డుతున్నారు. కేరాఫ్ కంచ‌ర‌పాళెం తీసిన వెంక‌టేష్ మహా రెండో సినిమా ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య మ‌ల‌యాళ సినిమాకి క‌ట్ పేస్ట్‌లా తీశాడు. పెళ్లి చూపులులో చిన్న పాయింట్‌ని అద్భుతంగా చెప్పిన త‌రుణ్ భాస్క‌ర్ , ఈ న‌గరానికేమైందిలో నాలుగు క‌థ‌లు చెప్పి తిక‌మ‌క పెట్టాడు.

కామెరూన్ డ‌బ్బుల కోసం ప‌నిచేయ‌లేదు. ప‌నిచేస్తే డ‌బ్బులొచ్చాయి. టైటానిక్ నాటికే ఆయ‌న‌కి పెద్ద పేరు ఉంది. ట్ర‌క్ డ్రైవ‌ర్ నుంచి డైరెక్ట‌ర్ కావ‌డ‌మే స‌క్సెస్‌. వ‌చ్చిన డ‌బ్బుల‌తో హాయిగా బ‌తికేయొచ్చు. ఏం చేసాడంటే 6 నెల‌లు ప‌గ‌లూరాత్రి టైటానిక్ మీద వ‌చ్చిన పుస్త‌కాల్ని పేప‌ర్ క‌టింగ్స్‌ని చ‌దివాడు. చ‌రిత్రకారుల‌తో నిరంతరం చ‌ర్చ‌లు చేసాడు. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ని డిజైన్ చేసాడు. ఇంతా చేస్తే టైటానిక్ సినిమా కొత్త కాదు. A Night To Remember అని 1958లో వ‌చ్చింది. పాత సినిమాలోని కొన్ని సీన్స్ , డైలాగ్‌లు య‌ధాత‌థంగా తీసుకోడానికి మొహ‌మాట ప‌డ‌లేదు. షిప్ మునిగే వ‌ర‌కూ సంగీతం వాయించే బృందం సీన్ పాత టైటానిక్‌లో వుంది. కొత్త టైటానిక్ చూసిన త‌ర్వాత పాత‌ది ఎవ‌రికీ గుర్తు లేదు. అవ‌స‌రం లేదు కూడా.

క‌థ మీద శ్ర‌ద్ధ పెడితే ఫ‌లితం వ‌స్తుంది. మ‌న డైరెక్ట‌ర్లు ఏం చేస్తారంటే పొగిడే వాళ్ల‌ని చుట్టూ పెట్టుకుంటారు. క‌థ మీద కూచుందాం, Open Discussion అంటూ వుంటారు. లోపాలు చెప్పిన వాన్ని మూర్ఖునిగా భావిస్తారు.

సినిమా లిబ‌ర్టీ పేరుతో లాజిక్‌లు వ‌దిలేస్తారు. మ‌న వాళ్ల‌కి ఇంత‌కంటే అన‌వ‌స‌రం, ఎక్క‌దు అంటూ వుంటారు. ప్రేక్ష‌కులు ఎప్పుడూ తెలివైన వాళ్లే. నువ్వు తెలివిగా చెబితే తెలివితో అర్థం చేసుకుంటారు.

విశ్వ‌నాథ్‌, బాపు, బాల‌చంద‌ర్‌ల కొన్ని సినిమాల్లో క‌థ ప‌క్కాగా , క‌రెక్ట్ దారిలో న‌డుస్తుంది. మెజార్టీ సినిమాల్లో ప్రేక్ష‌కుల్ని మూర్ఖుల్ని చేయ‌డ‌మే. ఈ సినిమాలు బ్ర‌హ్మాండంగా ఆడి కూడా వుంటాయి. అధ్య‌య‌నం చేయ‌డానికి ప‌నికి రావు.

ఒక మూల క‌థ , కొన్ని ఉప క‌థ‌లు, హీరో క్యారెక్ట‌ర్ , బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు ఇవ‌న్నీ ఒక అల్లిక‌లా కాకుండా చాలా సినిమాల్లో దేనిదారి అదే. భార‌తంలో విరాట‌ప‌ర్వం మారువేషాల‌తో న‌డుస్తుంది. ఇక్క‌డ కూడా వ్యాసుడు లాజిక్ మిస్ కాలేదు. ఎందుకంటే విరాటుడు ఎప్పుడూ పాండ‌వుల్ని చూడ‌లేదు. వాళ్ల‌ని గుర్తు ప‌ట్ట‌లేడు.

షేక్‌స్పియ‌ర్ కొన్ని నాట‌కాల్లో కూడా ఈ మారువేషాలుంటాయి. మ‌న సినిమాలు ప‌రాకాష్ట‌కి తీసుకుపోయాయి. 1984 వ‌ర‌కు కూడా అనేక క‌థ‌లు ఈ మారువేషాల చాటున బ‌తికేశాయి. ఇంట‌ర్వెల్ వ‌ర‌కూ హీరోకి విల‌న్‌కి సంఘ‌ర్ష‌ణ Establish చేస్తారు. ఆ త‌ర్వాత విల‌న్ ఎత్తుల‌కి హీరో పై ఎత్తులు వేస్తే క‌థ ర‌క్తి క‌డుతుంది. అంత ఓపిక లేక NTR కి ఒక గ‌డ్డం త‌గిలించి క్లైమాక్స్ లాగించేస్తారు.

జ‌నం తెలివిమీరి పోయారు. మారువేషాల్ని న‌మ్మ‌డం లేద‌ని అర్థ‌మైన త‌ర్వాత ఉప క‌థ‌ల్ని (Subplot) ప్ర‌యోగించ‌డం స్టార్ట్ చేసారు. ధృవ‌లో హీరో, విల‌న్ స‌మాన తెలివి తేట‌ల‌తో వ్య‌వ‌హ‌రిస్తారు (ఇది త‌మిళ క‌థ‌). ఈ క‌థ రాసుకోవాలంటే చాలా ఆలోచించాలి. అంత టైం లేని ద‌ర్శ‌కులు మారువేషాల‌కి బ‌దులు బ్ర‌హ్మానందం ఎపిసోడ్‌ని సృష్టించ‌డం మొద‌లు పెట్టారు. ఒక క‌మెడియ‌న్ సాయంతో విల‌న్ ఆట క‌ట్టించ‌డం. శీను వైట్ల త‌న‌ని తాను ప‌దేప‌దే రిపీట్ చేసుకుని మునిగిపోయాడు. అనిల్ రావిపూడి అదే దారిలో వున్నాడు. F2 ఫ‌స్టాఫ్‌ వ‌ర‌కూ హాయిగా, ఫ్రెష్‌గా వుంటుంది. సెకెండాఫ్ క‌థ లేక ప్ర‌కాష్‌రాజ్‌ని ఆశ్ర‌యించారు. అయినా ఆడిందంటే ఆ మాత్రం కామెడీ తీసే వాళ్లు కూడా లేరు క‌దా! స‌రిలేరు నీకెవ‌రులో ప్ర‌కాష్‌రాజ్‌ని తోపులా చూపించి రానురాను క‌మెడియ‌న్‌ని చేశారు. అదృష్టం బాగుండి ఇది కూడా ఆడింది. క‌థ ప‌రంగా చెప్పాలంటే చాలా వీక్‌.

Show comments