ఆత్మకూరులో ఉద్రిక్తత…విధ్వంసం

  • Updated - 10:26 PM, Fri - 11 March 22
ఆత్మకూరులో ఉద్రిక్తత…విధ్వంసం

ప్రార్థనా మందిరం నిర్మాణంపై నెలకొన్న వివాదం..అగ్గికి ఆజ్యం పోసిన బిజెపి నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డి..పోలీస్‌ స్టేషన్‌పై దాడికి దిగిన ముస్లీంలు…గాలిలోకి 10 రౌండ్ల కాల్పులు జరిపిన పోలీసులు…

కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఇరువర్గాల మధ్య వాగ్వివాదం తీవ్రమై ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకునే వరకు వెళ్లిన ఈ ఘటన చివరకు పోలీసు కాల్పుల వరకు వెళ్ళింది. ప్రశాంతంగా ఉండే ఆత్మకూరులో మత ఉద్రిక్తలకు దారి తీసిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇవి…

ఆత్మకూరు పట్టణంలోని పద్మావతి ఉన్నత పాఠశాల సమీపంలో కొందరు ముస్లీంలు ప్రార్థనా మందిరం నిర్మించ పూనుకున్నారు.అయితే స్థానికుల అభ్యంతరాలతో ప్రార్థనా మందిర నిర్మాణం పెండింగ్‌లో పడింది.అభ్యంతరాలు తొలగించి మసీదు నిర్మాణం తిరిగి మొదలు పెట్టే ప్రయత్నాలలో కొందరు ఉండగా స్థానికులు తెలుగుదేశం నాయకుడు మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డిని, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని కలిసి మసీదు నిర్మాణం ఆపించాలని విన్నపాలు చేశారు.

ఈ నేపథ్యంలో శనివారం ముస్లీంలు తాత్కాలికంగా మసీదును ఏర్పాటు చేసేందుకు పనులు మొదలు పెట్టారు.దీన్ని ఆ ప్రాంతంలో నివసించే హిందువులు అడ్డుకునేయత్నం చేశారు.ఇరువర్గాల నడుమ పోలీసుల సమక్షంలోనే తీవ్రమైన వాగ్వివాదం జరిగింది.చివరకు రెండు వర్గాల వారు ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు.పోలీసులు శ్రమించి ఇరువర్గాల వారిని అక్కడినించి తరిమి వేశారు.

అయితే కొంత సేపటికి సంఘటనా స్థలానికి బిజెపి నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి వచ్చారు.అక్కడ మసీదు నిర్మించడానికి అనుమతులు లేవంటూ పెద్దగా అరుస్తూ నిర్మాణంలో ఉన్న గోడను కూల్చేయత్నం చేశారు.దీనితో మరోమారు ఇరు వర్గాలు రాళ్ళ వర్షం కురిపించాయి.గొడవ తీవ్రంగా మారి బుడ్డా శ్రీకాంత్ రెడ్డి వాహనంపై కొందరు వ్యక్తులు దాడికి దిగారు.ఆ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి అక్కడ నుంచి పారిపోయే యత్నంలో గాయపడ్డారు. వందలాది మంది ఆయన వాహనంను వెంటాడుతూ ఉంటే ఎలాగోలా పోలీస్‌స్టేషన్ చేరుకున్నారు.సుమారు రెండు వేల మంది పోలీస్‌స్టేషన్‌ను చుట్టుముట్టి శ్రీకాంత్ రెడ్డిని తమకు అప్పగించాలని నినాదాలు చేశారు. పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. స్టేషన్ ఆవరణలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి సఫారీ వాహనాన్ని ధ్వంసం చేశారు.ఈ ఘటనను వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా దాడి చేశారు.రాత్రి పొద్దుపోయే వరకు వారు పోలీస్‌స్టేషన్ చుట్టే గుమిగూడి ఉన్నారు.

ఈ నేపథ్యంలో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతుంటే అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు 10 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపారు.పట్టణానికి ఇతర ప్రాంతాలనుంచి అదనపు బలగాలను పంపించారు.చివరకు రాత్రి పొద్దుపోయిన తరువాత పతిస్థితి అదుపులోకి వచ్చింది. 

కానీ ఆత్మకూరులో 37 ఏళ్ల నాటి మత కలహాల ఘటనలను తాజా సంఘటన గుర్తు చేస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Show comments