ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీశ్ దూకుడు పెంచారు…

తెలంగాణలో ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ కాబడి.. ఆ తరువాత ఎమ్మెల్యే పార్టీ పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల మరోసారి తన పాగా వేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఇందులో భాగంగా పాదయాత్ర చేస్తూ ఊరూరా తిరిగారు. మోకాలికి శ‌స్త్ర చికిత్స జ‌ర‌గ‌డంతో ప్ర‌స్తుతం విశ్రాంతిలో ఉన్నారు. త్వ‌ర‌లోనే కుర్చీలోనే ప్ర‌చారం చేప‌ట్టేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అదే జ‌రిగితే మ‌రింత సానుభూతి పొందే అకాశం ఉంది. ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ నుంచి నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు స్వీక‌రించిన హరీశ్ రావు దూకుడు పెంచారు. ఈట‌ల వైపు సానుభూతి ప‌వ‌నాలు వీచ‌కుండా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

పాదయాత్రతో అస్వస్థతకు గురైన ఈటల రాజేందర్ ఇటీవల ఆసుపత్రిలో చేరికి చికిత్స పొందాడు. ఆ తరువాత నిన్న డిశ్చార్జి అయిన ఈటల అధికార పార్టీపై మాటల బాణాలు ఎక్కుపెట్టాడు. టీఆర్ఎస్ అధికారంలో ఉండి ఓట్లను కొనుగోలు చేస్తోందని ఓట్లను కొనుక్కుంటే నాయకుడు అనిపించుకోరని బ్రోకర్ అంటారని విమర్శించారు. ప్రజల మన్ననలను పొందేవాడు ప్రజానాయకుడు అనిపించుకుంటారని కానీ టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు డబ్బులు పంచి ఓట్లను కొనుక్కుంటున్నారని అంటూ తీవ్ర‌స్థాయిలో మాట‌ల‌కు ప‌దును పెడుతున్నారు ఈట‌ల రాజేంద‌ర్. తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్లకే టీఆర్ఎస్ పట్టం కడుతుందని కేసీఆర్ దగ్గర ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో రాళ్లు విసిరారన్న విషయం గుర్తుకురాలేదా..? అని ప్రశ్నించారు. ఎంతో మంది మంత్రులు నాయకులు వచ్చి హుజూరాబాదోలో పాగా వేస్తున్నారని నన్ను ఓడించడానికి ఇంత పెద్ద వ్యూహం రచిస్తున్నారంటే ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులు చేస్తుందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ కేడ‌ర్ బ‌లోపేతం, నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ ను క్షేత్ర‌స్థాయిలోకి తీసుకెళ్లేందుకు వ‌రుస స‌మావేశాల‌తో బిజిగా గ‌డిపిన హ‌రీశ్ రావు ఈట‌ల దూకుడుకు చెక్ పెట్ట‌డంపై దృష్టి పెట్టారు. రాజేంద‌ర్ కు స్థానికంగా ఉన్న బ‌లాన్ని దృష్టిలో పెట్టుకుని స్పందిస్తున్నారు. ప్రజలు వ్యక్తి కంటే వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ వినూత్న త‌ర‌హాలో ప్ర‌చారం చేస్తున్నారు. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ప్ర‌చారంలో మోదీ ని వాడుకోక‌పోవ‌డం, మోడీ ఫొటో చూడగానే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు గుర్తుకు వచ్చి ఓట్లు పడవని అనుకుంటున్నారా..? అంటూ వ్య‌క్తిగ‌తంగానే కాకుండా పార్టీ ప‌రంగా కూడా ఈట‌ల‌ను ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బీజేపీలో చేరిన ఈటల గెలిస్తే నియోజకవర్గానికి కేంద్రం నుంచి రూ.1000 కోట్లు తెచ్చే సత్తా ఉందా..? అంటూ స‌మాధానం చెప్ప‌లేని ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. ఇన్ని రోజులు కామ్ గా ఉన్న హరీశ్ రావ్ ప‌దునైన మాట‌ల ద్వారానే కాకుండా, పొలిటిక‌ల్ పాయింట్లు లేవ‌నెత్తుతూ ఈట‌ల దూకుడుకు బ్రేక్ వేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి చివ‌ర‌కు ఎంత వ‌ర‌కు హ‌రీశ్ స‌క్సెస్ అవుతారో వేచి చూడాలి.

Show comments