పవన్ కళ్యాణ్ 30కి గ్రీన్ సిగ్నల్

అజ్ఞాతవాసి తర్వాత జనసేన కోసం రెండేళ్లు గ్యాప్ తీసుకుని మళ్ళీ వకీల్ సాబ్ తో మేకప్ వేసుకోవడం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ ఏకధాటిగా సినిమాలను ఒప్పుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడు ఏది ముందు పూర్తవుతుందో ఏవి ఫస్ట్ రిలీజవుతాయో ఎవరికీ తెలియవు కానీ వరసబెట్టి గ్రీన్ సిగ్నల్స్ మాత్రం ఇచ్చేస్తున్నాడు. క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలను ఇప్పటికే లైన్ లో పెట్టిన పవన్ తాజాగా నిర్మాత కమ్ భక్తుడు బండ్ల గణేష్ కు ఓకే చెప్పినట్టు తెలిసింది. ఈ విషయాన్నీ గణేష్ స్వయంగా నా దేవుడు మరోసారి ఓకే చెప్పాడు, నా కలలు నిజం కాబోతున్నాయి అని ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

ఇక్కడ రాజకీయ కోణం లేదు. ఎందుకంటే ఇక పాలిటిక్స్ లోకి రానని బండ్ల చాలా స్పష్టంగా ఎప్పుడో చెప్పేశాడు. అందులోనూ మరోసారి నా స్వప్నం ఫలించబోతోందని మెసేజ్ పెట్టడం చూస్తే అది సినిమా గురించి తప్ప మరొకటి అయ్యుండదు. ఈ ఇద్దరి కాంబోలో గతంలో తీన్మార్, గబ్బర్ సింగ్ వచ్చాయి. మొదటిది డిజాస్టర్ కాగా రెండోది ఇండస్ట్రీ హిట్టు కొట్టి ఏకంగా బండ్ల గణేష్ ని స్టార్ ప్రొడ్యూసర్ ని చేసింది. కానీ ఆ తర్వాత దాన్ని దాటే సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. వరస ఫ్లాపులతో కాస్త వెనక్కు తగ్గి ఎక్కువ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పవన్ సరే అన్నాడు అంటే అంతకన్నా పండగ ఏముంటుంది. కాకపోతే ఒక్కో ప్రాజెక్ట్ షూటింగ్ కు ఎంత సమయం అవసరం అవుతుందన్నది పెద్ద చిక్కే. 
అయితే పైన చెప్పినవన్నీ పూర్తయ్యేలోపు ఎంతలేదన్నా 2024 వచ్చేస్తుంది. చాలా టైం ఉంది. ఈలోగా కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు. పవన్ కు వ్యక్తిగతంగా దర్శకుడు డాలీతో ఓ కమిట్ మెంట్ పెండింగ్ ఉంది. గోపాల గోపాల టైంలోనే మాట ఇచ్చాడు. మరి ఇప్పుడు బండ్లతో కూడమంటే డైరెక్టర్ ఎవరన్న సస్పెన్స్ కూడా తొలగిపోతుంది. అయితే దీనికి క్లారిటీ రావడం ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. ఎన్నికలు వచ్చేలోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకున్న పవన్ కళ్యాణ్ కు లాక్ డౌన్ ఏకంగా ఏడెనిమిది నెలల విలువలైన కాలాన్ని వృధా చేసింది. లేదంటే ఈపాటికి వకీల్ సాబ్ విడుదలైపోయి క్రిష్ సినిమా ఫినిషింగ్ లో ఉండేది. ఇప్పుడంతా ఏడాది తేడాతో మొత్తం మారిపోయింది. ఇవన్నీ ఎలా ఉన్నా పవర్ స్టార్ అభిమానులు వరస గుడ్ న్యూస్ లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు
Show comments