Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులకు త్వరలోనే అధికారిక ముద్ర పడనుందా? దీనికి సంబంధించి జగన్ సర్కారుకు సమాచారం ఉందా? కర్నూలుకు హైకోర్టు తరలింపు సంబంధిత నోటిఫికేషన్ జారీ కానుందా? అంటే అవును అన్నట్లుగానే ఏపీ ప్రభుత్వం ముందస్తు సన్నాహాలు తెలియజేస్తున్నాయి. లోకాయుక్త, హెచ్ ఆర్‌సీ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీర్మానించడం ద్వారా ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం కింద హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి గతంలో అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానం ద్వారా ఏపీకి మూడు రాజధానులు ఉన్నట్లు కేంద్రం ఇప్పటికే నిర్ణయానికి వచ్చిందని విషయం స్పష్టమైంది. ఇప్పుడు న్యాయ రాజధాని కర్నూలు వైపు న్యాయ సంబంధిత కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మూడు రాజధానులపై మరోసారి చర్చ జరుగుతోంది.
గత నెలలో విశాఖ రాజధాని గురించి, పరిపాలన గురించి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, త్వరలో ఏ రోజైనా, ఏ క్షణమైనా విశాఖ నుంచి ప్రభుత్వం పరిపాలన ప్రారంభించవచ్చని చెప్పారు. సీఎం జగన్ ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చున్నారు. పెద్దిరెడ్డి ఆ మాటలు చెప్పి నెల కూడా గడవక ముందే రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో న్యాయ శాఖకు చెందిన కార్యాలయాలను కర్నూలుకు తరలించాలని నిర్ణయించారు. దీంతో త్వరలోనే జగన్ విశాఖ నుంచి పరిపాలన సాగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. అయితే చంద్రబాబు అడ్డుపుల్లలు పెట్టకపోతే ఇప్పటికే కార్యరూపం దాల్చేది.
అమరావతి లెజిస్లేటివ్ కేపిటల్ గా, విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా, కర్నూలును జ్యూడీషియల్ కేపిటల్ గా చేయాలని జగన్ నిర్ణయించారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకి అసెంబ్లీ ఆమోదం కూడా తెలిపింది. కేంద్రం సానుకూలంగా ఉంది. అధికారిక ముద్ర వేయించుకునేందుకు సీఎం జగన్ తనదైన శైలిలో ఢిల్లీలో చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. రాజధానుల అంశంపై టీడీపీ వేసిన కేసులు, సెక్షన్లపై ఏపీ సర్కార్ న్యాయ నిపుణులతో సంప్రదించి వాటిని వీగిపోయేలా చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తూనే, కేంద్ర పరిధిలోని అంశాల విషయంలో క్లియరెన్స్ కోసం ఇప్పటికే జగన్ చర్చించారు. తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలోనే ఏపీలో మూడు రాజధానులు కార్యరూపం దాల్చనున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి లోకాయుక్తకు జగన్ సర్కారు తొలుత విజయవాడ ఆర్‌అండ్‌బీ భవన్ మొదటి అంతస్తులో కార్యాలయాలు కేటాయించాలని నిర్ణయించింది. అప్పటికే అక్కడ ఏపీఏటీకి ఆఫీసు స్పేస్ కేటాయించినప్పటికీ దాన్ని రద్దుచేసి మరీ లోకాయుక్తకు ఆఫీసును కేటాయిస్తూ గతంలోనే జీవో జారీ చేసింది. అందుకు కావాల్సిన అన్ని వసతుల ఏర్పాటుకు నిధులు కూడా కేటాయించింది. గత ఏడాదిలోనే ఆర్‌అండ్‌బీ భవన్‌లో సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇక సిబ్బంది కూర్చుని పని ప్రారంభించడమే తరువాయి అన్న క్రమంలో హఠాత్తుగా కర్నూలుకు తరలించే నిర్ణయం తీసుకోవడం వెనుక మూడు రాజధానులపై ప్రభుత్వానికి పక్కా సమాచారం ఉందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అదెప్పుడో ఎదురుచూడాల్సిందే.