Inspiring Journey : సైకిల్ మెకానిక్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకూ.. వరుణ్ బరన్వాల్ IAS ప్రయాణమిది

IAS అవ్వాలంటే చాలా కష్టపడాలి. వినోదాలను పక్కనపెట్టి దృష్టంతా చదువుపైనే నిమగ్నం చేయాలి. కానీ.. పని చేసుకుంటూ ఐఏఎస్ కు ప్రిపేర్ అవ్వడమే కాక.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడో సైకిల్ మెకానిక్. అతనే వరుణ్ బరన్వాల్. కఠోర శ్రమ, మార్గదర్శకత్వం, పట్టుదల ఉంటే.. UPSC అభ్యర్థులు IAS పరీక్షను అలవోకగా చేధిస్తారు. కృషి, అంకితభావంతో ఐఏఎస్ లో విజయం సాధించిన వరుణ్ బరన్వాల్ Inspiring Journey ఇది.

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా బోయిసర్ అనే చిన్న ఊరికి చెంది వరుణ్ బరన్వాల్ చిన్నప్పటి నుంచీ ఐఏఎస్ కావాలని కలలు కనేవాడు. కానీ.. చిన్న వయసులో 2006లో తండ్రిని కోల్పోయారు. కుటుంబ పోషణ బాధ్యత తనపై పడటంతో చదువుకు స్వస్తి చెప్పాలనుకున్నారు. కానీ.. కొందరు వ్యక్తుల సహాయంతో చదువును కొనసాగించారు. దాతలు వరుణ్ బరన్వాల్ ఐఏఎస్ అధికారి అయ్యేందుకు తగిన సహాయం అందించారు. వరుణ్ తండ్రి సైకిల్ మెకానిక్ కావడంతో.. వరుణ్ కూడా అదే పని నేర్చుకుని తండ్రి సైకిల్ రిపేర్ షాపులోనే.. సైకిళ్లను రిపేర్ చేస్తూ.. కుటుంబాన్ని పోషించాడు. కుటుంబ బాధ్యతను నిర్వర్తిస్తూనే చదువును కొనసాగించాడు వరుణ్. 10వ తరగతి పరీక్షల్లో టాపర్ గా నిలిచాడు.

అప్పట్నుంచీ.. కొడుకుకి చదువుపై ఉన్న మక్కువను చూసిన వరుణ్ తల్లి.. సైకిల్ షాపు బాధ్యతను తాను తీసుకుని వరుణ్ ను చదువు కొనసాగించమని కోరింది. వరుణ్ తండ్రి స్నేహితుడైన డా. కాంప్లి అతను చదువుకు ఎంతో సహాయం చేశాడు. పాఠశాల విద్య పూర్తయిన అనంతరం మెడికల్ కాలేజీలో చేరాలనుకున్నాడు. కానీ.. ఫీజు ఎక్కువగా ఉండటంతో ఇంజినీరింగ్ చేయాలనుకుని దానికి ప్రిపేర్ అయ్యాడు. పూణేలోని MIT కాలేజీలో అడ్మిషన్ పొందాడు. స్కాలర్ షిప్ తో ఇంజినీరింగ్ చదువును పూర్తి చేశాడు. ఆ తర్వాత ఒక MNCలో మంచి ఉద్యోగం వచ్చింది. కానీ వరుణ్ లక్ష్యం ఉద్యోగం కాదు. ఐఏఎస్ అవ్వాలి.

ఐఏఎస్ అయ్యేందుకు ఏవేం కావాలి. ఏం చదవాలి అన్నీ తెలుసుకున్నాడు. పరీక్షకు సిద్ధమయ్యేందుకు NGOల సహాయం కోరగా.. వారు పుస్తకాలు అందజేశారు. ఇలా అందరి సహాయంతో.. తనకున్న కొద్దిపాటి వనరులు, వసతులతో వరుణ్ బరన్వాల్ లక్ష్యాన్ని చేరుకున్నాడు. UPSC IAS 2016 పరీక్షలో 32వ ర్యాంక్ సాధించి IAS అధికారి అయ్యాడు. తనకున్న అనుభవంతో తాను మంచి సివిల్ సర్వెంట్ గా ఉండాలని వరుణ్ భావిస్తున్నాడు. చదువుకోవాలన్న కోరిక, తపన ఉంటే పేదరికం పెద్ద సమస్య కాదని వరుణ్ బరన్వాల్ రుజువు చేశారు. వరుణ్ బరన్వాల్ జీవిత ప్రయాణం.. చదువుకోవాలనుకునే ఎంతో మంది యువతకు స్ఫూర్తి దాయకం.

Show comments