చిత్తూరు లో హాంకాంగ్ ఫుట్ వేర్ కంపెనీ

రాష్ట్రంలో హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ భారీ పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అట్లనాగులూరు గ్రామంలో 298 ఎకరాల్లో దాదాపు రూ.700 కోట్ల (100 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడితో ఈ యూనిట్‌ ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. సంస్థ సీఎఫ్‌వో టిమ్‌కుతు, డైరెక్టర్లు మిన్‌ హిసు తస్సాయి, హాసాయోయన్‌లీ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి, పెట్టుబడుల ప్రతిపాదనలను వివరించారు. 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కింద ఇచ్చే రాయితీలు, పారిశ్రామిక విధానం ప్రకారం వచ్చే రాయితీలు తప్ప అదనపు రాయితీలేవీ అవసరం లేదని కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే పదేళ్లలో రూ.700 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఫుట్‌వేర్‌ సెజ్‌తో మహిళలకు ఉపాధి కల్పించనున్నట్లు ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. తొలుత రూ.350 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని, సెజ్‌ హోదా వచి్చన తర్వాత మిగిలిన మొత్తాన్ని పెట్టుబడి పెడతామని తెలిపారు. ఈ యూనిట్‌కు అవసరమైన 298 ఎకరాలను ఏపీఐఐసీ ఎకరం రూ.6.5 లక్షల చొప్పున కేటాయించనుంది.

Show comments