దేవినేని లోకేష్ అరెస్టును కోరుకుంటున్నారా.. లేక‌..?

ఏపీలో తెలుగుదేశం నాయ‌కులు ఒక్కొక్క‌రూ అరెస్టు అవుతున్నారు. కాదు.. కాదు.. గ‌తంలో చేసిన త‌ప్పులు అరెస్టు కావాల్సి వ‌స్తోంది. అధికారంలో ఉండ‌గా, చేసిన స్కాములు బ‌య‌ట‌ప‌డుతుండ‌డంతో జైలుకు వెళ్లాల్సి వ‌స్తోంది. వీటిలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సి వ‌చ్చింది ఈఎస్ ఐ స్కాం. ఈ కేసులో ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు జైలు పాలు కావాల్సి వ‌చ్చింది. మరో ఇద్దరు మాజీ మంత్రులు సైతం జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చిన వారే. టీడీపీ సీనియర్ నేత మ‌రో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా జైలుకెళ్లి ఇటీవ‌లే బెయిల్ పై బయటకు వచ్చారు. ఆయ‌న విడుద‌లైన వ‌చ్చిన సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

బెయిలుపై వ‌చ్చిన తర్వాత దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ వచ్చే నెలలో అరెస్ట్ కాబోతున్నార‌ని, దీనిపై త‌న‌కు అనుమానాలు ఉన్నాయ‌ని చెప్పారు. రెండేళ్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అర డజనుకు పైగా టీడీపీ సీనియర్ నాయకులు అరెస్టయ్యారు. ఈ క్ర‌మంలో ఉమా తాజా మాటలు కలకలం రేపుతున్నాయి. ఉమ సందేహాస్పదంగా అన్నారా? లేక లోకేష్ అరెస్టుకు సంబంధించి నిర్దిష్ట సమాచారం ఏదైనా ఉందా అనే చ‌ర్చ మొద‌లైంది. ఎందుకంటే.. లోకేష్ పై కూడా అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్ నెట్ స్కామ్ లో లోకేష్ పాత్ర కూడా ఉంద‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వెల్లువెత్తుతున్నాయి. కొన్నాళ్ల క్రితం జ‌గ‌న్ స‌ర్కారు కూడా ఫైబర్ నెట్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ప్రస్తుత ఫైబర్ నెట్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఐడీ విచారణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఫైబర్ నెట్ స్కామ్ పై విచారణ జరపాలని గతంలోనే సీబీఐను జగన్ సర్కార్ కోరింది. విచారణ చేపట్టే అంశంపై సీబీఐ స్పందించకపోవడంతో సీఐడీకి విచారణకు అప్ప‌గించింది. సుమారు రూ. 700-1000 కోట్ల మధ్య ఫైబర్ నెట్ ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని గతంలోనే ఆరోపణలు వ‌చ్చాయి. సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్లు.. ఫైబర్ నెట్ కు సంబంధించి వివిధ టెండర్లను ఖరారు చేసే క్రమంలో అక్రమాలు జరిగాయన్నది ప్రధాన అభియోగంగా ఉంది.

టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టేలా అప్పటి టీడీపీ సర్కార్ వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు పత్రాలతో ఫైబర్ నెట్లో నిబంధనలకు విరుద్దంగా నియామకాలు జరిగాయని కూడా వార్తలు వచ్చాయి. అప్పడు లోకేష్ ఐటీ మంత్రి గా ఉండ‌డంతో ఆయ‌న‌కు తెలియ‌కుండా ఇంత భారీ స్థాయిలో అక్ర‌మాలు జ‌రిగి ఉండ‌వ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ కేసు విచార‌ణ‌ను ప్ర‌భుత్వం సీఐడీ విచార‌ణ‌కు అప్ప‌గించ‌డం, ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న క్ర‌మంలో దేవినేని లోకేష్ అరెస్టుపై వ్యాఖ్య‌లు చేయ‌డం అనుమానాల‌కు తావిస్తోంది.

ఒక‌వేళ ఈ కేసుకు సంబంధించిన కీల‌క ఆధారాలను సీఐడీ సేక‌రించిందా, ఇప్ప‌టికే దీనికి సంబంధించిన చ‌ర్చ టీడీపీలో జ‌రుగుతుందా, ఈ నేప‌థ్యంలోనే లోకేష్ అరెస్టు కానున్నార‌ని ఊహిస్తున్నారా వంటి ప్ర‌శ్న‌లు దేవినేని వ్యాఖ్య‌ల ద్వారా ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఏం జ‌ర‌గ‌బోతుందో మున్ముందు చూడాలి.

Show comments