నంద్యాల మోడల్ – ఎమ్మెల్యేల రాజీనామా కోసం పట్టుబడుతున్న ప్రజలు

‘‘ఎమ్మెల్యే గారూ రాజీనామా చేయండి.. రాజీనామా ఉప ఎన్నిక వ‌స్తుంది. ఉప ఎన్నిక వ‌స్తే.. కేసీఆర్ సార్ భారీ నిధులు కేటాయిస్తారు. మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది.’’ ఈ త‌ర‌హా నినాదాలు, వివాదాలు ఇప్పుడు తెలంగాణ‌లో హోరెత్తుతున్నాయి. ప్రత్యేకించి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఈ త‌ర‌హా ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పుడు తాజాగా.. బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామంటూ కొత్త స్వ‌రం అందుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం రాజీనామా చేయాల‌నుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టిస్తున్నారు. ఇంత‌కీ ఈ గోలంత ఏంటి, ఎందుకు అనుకుంటున్నారా..?

రాష్ట్రాన్ని హీటెక్కిస్తున్న హుజూరాబాద్‌

హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా చేసిన విష‌యం తెలిసిందేగా.., దీంతో అక్క‌డ ఉప ఎన్నిక రావడం.. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ఆ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌రాల జ‌ల్లు కురిపించ‌డం ఈ ర‌చ్చ అంత‌టికీ కార‌ణ‌మైంది. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో తెరపైకి వచ్చిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికను సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం, ఆ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుండడంతో.. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ప్రత్యేకించి అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులకే ఈ పరిస్థితి ఎక్కువగా ఎదురవుతోంది.

అక్క‌డ చ‌క‌చ‌కా అభివృద్ధి ప‌నులు

రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం దళితబంధు పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి.. తొలుత దీనిని హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.1500-రూ.2000 కోట్లు కేటాయిస్తామన్నారు. దీంతోపాటు ఆ నియోజకవర్గంలో రెండో విడత గొర్రెల పంపిణీ, దళిత కాలనీల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం, కుల సంఘాల భవనాలకు స్థలాలు ఇవ్వడం, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం కూడా జరుగుతోంది. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ, కొత్త పెన్షన్లు, రేషన్‌కార్డుల జారీ వంటివీ వేగవంతమయ్యాయి.

అందువ‌ల్లే కొత్త త‌ర‌హా డిమాండ్ తెర‌పైకి..

హుజూరాబాద్‌పై సర్కారు ఇలా ప్రత్యేక దృష్టి సారించడం.. రాష్ట్ర ప్రజలందరి చూపు ఆ నియోజకవర్గంపై పడేలా చేసింది. దీంతో తమ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందాలన్నా, పథకాలు అమలు కావాలన్నా.. ఉప ఎన్నిక రావాలన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగింపజేసింది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ కూడా ‘‘ఎమ్మెల్యే గారూ రాజీనామా చేసి.. ఉప ఎన్నికకు సిద్ధపడండి! మన నియోజకవర్గానికి కూడా నిధులు వస్తాయి’’ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చాయి. వివిధ కార్యక్రమాలతోపాటు సోషల్‌ మీడియా వేదికగానూ దీనిని ప్రచారంలోకి తెస్తున్నాయి. గతంలో హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలకూ సీఎం కేసీఆర్‌ ఇలాగే నిధులు, హామీల వరద పారించారని గుర్తు చేస్తున్నాయి.

సోష‌ల్ మీడియాలో పొలిటిక‌ల్ సెగ‌లు

రాజీనామా చేయాలంటూ వస్తున్న డిమాండ్లతో ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతోంది. సోషల్‌ మీడియాలోనూ ఇలాంటి పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. హుజూరాబాద్‌ పక్క నియోజకవర్గాల్లోనైతే ఇవి సెగలు పుట్టిస్తున్నాయి. తమ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలంటూ ఉమ్మడి కరీంనగర్‌లో జిల్లాలోని చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల ప్రజలు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అక్కడక్కడ ఆందోళనలు కూడా చేపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో ఒత్తిడి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజీనామా చేసినవారినే మళ్లీ గెలిపించుకుంటామని హమీ కూడా ఇస్తున్నారు.

తాజాగా కరీంనగర్‌ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్‌ రాజీనామా చేయాలంటూ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుకు నియోజకవర్గ ప్రజలపై ప్రేమ ఉంటే రాజీనామా చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో దండేపల్లిలో రాస్తారోకో నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావుకూ ఈ తలనొప్పి తప్పలేదు. సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి హరీశ్‌రావు రాజీనామా చేయాలని స్థానిక కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో..

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రాజీనామా కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు జరిగాయి. బీజేపీ ఆధ్వర్యంలో.. ‘‘ఎమ్మెల్యే సారూ రాజీనామా చేయండి’’ అంటూ హోర్డింగ్‌లు వెలిశాయి. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ రాజీనామా చేయాలంటూ దళిత జేఏసీ నాయకులు గురువారం ఆందోళనకు దిగారు.

సేవాలాల్‌ బంజార సంఘం విద్యార్థి విభాగం నిరసన చేపట్టింది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు రాజీనామా చేస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న డిమాండ్‌ను సోషల్‌ మీడియాలో స్థానిక ప్రజలు వైరల్‌ చేస్తున్నారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ రాజీనామా చేయాలంటూ ఆదివారం దళిత సింహగర్జన పేరుతో దళిత, బీజేపీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. మంత్రి జగదీష్‌రెడ్డి, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ రాజీనామా చేస్తే నియోజకవర్గాలు బాగుపడుతాయనే కామెంట్లతో కూడిన వీడియోలు ఆయా నియోజకవర్గాల్లో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో..

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యల రాజీనామా డిమాండ్‌ ఎక్కువగా కనిపిస్తోంది. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ రాజీనామా చేయాలంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు పంపుతున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని స్థానిక బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే జి.సాయన్న రాజీనామా చేయాలంటూ కొందరు రూపొందించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అయితే ఈ డిమాండ్లు ప్రస్తుతానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు న్యూసెన్స్‌గా మారినా.. భవిష్యత్తులో తీవ్రరూపం దాలిస్తే పరిస్థితేంటన్న ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

రాజీనామా చేస్తున్నా : రాజాసింగ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. గోషామహాల్‌ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన కీలక ప్రకటన చేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని నియోజకవర్గ ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని, సీఎం నిధులు ప్రకటించిన వెంటనే స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని పేర్కొన్నారు. ఉపఎన్నిక వస్తే కేసీఆర్‌కు బడుగులు, రైతులపై ప్రేమ వస్తోందన్నారు. అంతేకాకుండా గోషామహాల్‌ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సైతం పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇస్తే ఖచ్చితంగా స్పీకర్ దగ్గరకు వెళ్లి రాజీనామా పత్రాన్ని అందజేస్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఆయ‌న నిజంగానే రాజీనామా చేస్తే.. ఈ త‌ర‌హా డిమాండ్ల‌ను మ‌రింత బ‌లంగా లేవ‌నెత్తేందుకు విప‌క్షాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అధికార ప‌క్షం దీన్ని ఎలా తిప్పికొడుతుందో చూడాలి.

Show comments