హుజురాబాద్ కాదు.. వాసాలమర్రి.. దళిత బంధు అమలుపై కేసీఆర్ మొదటి అడుగు

టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితుల అభివృద్ధి కోసం చేపట్టిన దళిత బంధు పథకాన్ని కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో అమలు చేయడానికి సిద్ధం అయ్యారు. నిన్న వాసాలామర్రిలో దళిత వాడల్లో ఇంటింటికి కాలినడకన పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. గ్రామస్తులకు దళిత బంధు పధకం మీద ఏమేరకు అవగాహన ఉందో తెలుసుకున్నారు. వాసాలమర్రిలో ఉన్న 76 దళిత కుటుంబాలకు వెంటనే దళితబంధు అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

దీని ప్రకారం గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు 7 కోట్ల 60 లక్షలు విడుదల చేస్తూ జీవో ఇచ్చారు అధికారులు. SC అభివృద్ధి శాఖ పేరుతో నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. రూ.7.6 కోట్లను తక్షణం విడుదల చేయాల్సిందిగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఆదేశాలు జారీ చేశారు. రూ.7.6 కోట్లను ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పంచనున్నారు. ఎన్నికైన లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా 10లక్షల రూపాయలు వేయనుంది ప్రభుత్వం. ఆ డబ్బుతో లబ్ధిదారు కుటుంబాలు మెరుగైన ఉపాధి కోసం ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

దళిత రక్షణ నిధి ఏర్పాటు…

ప్రభుత్వం అమలు చేస్తున్నా దళితబంధు లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు దళిత రక్షణను ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఒక్కో దళితబంధు లబ్ధిదారుల నుండి 10వేలు కట్ చేసి దానికి ప్రభుత్వం తరపున మరో 10వేలు కలిపి దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. ఆలేరులో ఉన్న 15వేల కుటుంబాలకు దళితబంధు అమలు చేసి వారినుండి ఒక్కో లబ్ధిదారుల నుండి 10వేలు ప్రభుత్వం జమ చేసే 10వేలు మొత్తం కలిపి 30కోట్లతో దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేయనున్నారు. దళితబంధు లబ్ధిదారులకు అనారోగ్యం, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ దళిత రక్షణ నిధినుండి సహాయం అందిస్తారు. ఆలేరు నియోజికవర్గంలో ఏర్పాటు చేసే దళితబంధు, దళిత రక్షణ నిధి రాష్ట్రానికి ఆదర్శం కావాలి అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

దళితబంధు అమలు పర్యవేక్షణ..

వాసాలమర్రిలో అమలు చేసే దళితబంధు పథకం అమలును పర్యవేక్షిస్తామని కేసీఆర్ తెలిపారు. దళితబంధు పొందిన లబ్ధిదారులకు కార్డు ఇస్తామని దీని ద్వారా లబ్ధిదారులకు ఇచ్చిన డబ్బు ఖర్చును పర్యవేక్షిస్తారు. దళితబంధు ద్వారా లబ్దిపొందిన డబ్బులలో పదిపైసలు కూడా వృథా చేయొద్దని సూచించారు. వీటిద్వారా సంపాదించిన సొమ్ముతో దళితులు అభివృద్ధి చెందాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

గ్రామ సమస్యల పరిష్కారం..

గ్రామంలోని దళిత వాడలో పురాతన ఇళ్లను కూల్చేసి ఎర్రవల్లి మాదిరిగా కొత్త ఇళ్ళు కట్టిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని ఇతర సమస్యలు కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు సీఎం. వాసాలమర్రిలోని ప్రభుత్వ భూమి 612 ఎకరాలు ఉందని, దళితుల దగ్గర భూమి తక్కువ ఉందని, మరో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కలిపి దళితులకు అందించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

అయితే దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయలని భావించినప్పటికీ ముందుగా వాసాలమర్రిలోనే మొదలు పెట్టారు. త్వరలో రాష్ట్రమంతా ఉన్న దళిత కుటుంబాల డేటా సేకరించి అర్హులైన దళిత కుటుంబాలకు అమలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది

Show comments