iDreamPost
iDreamPost
ఫేస్ బుక్ లో ఓ ప్రొఫైల్. అందులో అందమైన అమ్మాయి. చాలా చలాకీగా పోస్ట్ లు పెడుతుంది. చాట్ చేస్తుంది. జూబ్లీహిల్స్ వాసి ప్రవీణ్ కుమార్ కు ఆమె నచ్చింది. ఆన్ లైన్ ప్రేమాయణం మొదలైంది. ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు. అమ్మాయి గొంతుకూడా అతనికి నచ్చింది. ఆమె అవసరాల కోసం రూ.45 లక్షలు ఇచ్చాడు. మరి పెళ్లెప్పుడు? ఎప్పుడూ చాటింగ్ ఎందుకు? డైరెక్ట్ గా కలుద్దాం అనేసరికి అవతల నుంచి రెస్పాన్స్ లేదు. అనుమానించిన ప్రవీణ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పుడు తెలిసింది ఆమె కాదని…అతను అని.
ఏపీలోని నూజివీడుకు చెందిన మోథె అశోక్, బీటెక్ చివరి ఏడాది డిస్ కంటిన్యూ చేశాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. ఆవారాగా తిరగడానికి అలవాటు పడ్డాడు. యూట్యూబ్ ఛానల్ లో చూసిన ఓ క్రైమ్ న్యూస్ స్ఫూర్తితో, ఈజీ మనీ కోసం 2020 ఫిబ్రవరిలో ఇందుష తుమ్మల పేరుతో ,ఫేస్ బుక్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసి, ఎంతోమందికి రిక్వెస్ట్ లు పంపాడు. జూబ్లిహిల్స్ కు చెందిన ప్రవీణ్.. అశోక్ వలలో చిక్కాడు. అంతే.. ఆన్ లైన్లో చాటింగ్, వాయిస్ చేంజ్ యాప్ తో, ఫోన్లో అమ్మాయిలా మాట్లాడి, ప్రేమలోకి దింపాడు. కాలేజీ ఫీజు కట్టాలంటూ రూ.3 లక్షలు, కరోనా ఫస్ట్ వేవ్ లో అమ్మకు బాలేదంటూ రూ.10 లక్షలు, సెకండ్ వేవ్ లో తనకు కోవిడ్ సోకిందని మరో రూ.15 లక్షలు, ఇలా రెండేళ్లలో ప్రవీణ్ కు ఏమాత్రం అనుమానం రాకుండా.. రూ.45 లక్షలు కాజేశాడు.
ప్రవీణ్ తన ఆన్‌లైన్ ప్రేమ విషయాన్ని సమీప బంధువుకు చెప్పగా, ఇదేదో తేడాగా ఉందని అతను అన్నాడు. నిజం తెలుసుకోవాలంటే డైరెక్ట్ గా కలవమన్నాడు. అతని సలహాతో ఇందుష (అశోక్)ను ఎన్నిసార్లు కలవాలని కోరినా విషయం దాటేసేవాడు. తాను మోసపోయానని గ్రహించిన ప్రవీణ్.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు అశోక్ ను అరెస్ట్ చేశారు. అతని నుంచి ఫోన్ ను రికవరీ చేశారు. మొత్తం రూ45 లక్షలు ఆన్ లైన్ గేమింగ్ లో ఖర్చు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.