యాభైమూడేళ్లలో తొలిసారి ఆ ఊరికి కాంగ్రెస్ మేయర్

రైతుల పోరు ఎఫెక్ట్ :పంజాబ్ బీజేపీకి ఓట‌ర్ల షాక్‌!

History has been made today!
Bathinda will get a Congress Mayor for the 1st time in 53 years!
Thank you to ALL Bathinda residents.

Congratulations to the people of Bathinda for a spectacular victory.
Kudos to all Congress candidates and workers, who toiled for this day.

– పంజాబ్ పుర‌పోరులో కాంగ్రెస్ చారిత్ర‌క విజ‌యం అనంత‌రం ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి మ‌న్ ప్రీత్ సింగ్ బాద‌ల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసిన ఉద్వేగ‌భ‌రిత ట్విట్ ఇది.

గ‌త‌ 53 ఏళ్లుగా శిరోమణి అకాలీదళ్‌ కంచుకోటగా ఉన్న భాటిండాతో పాటు ఇత‌ర కార్పొరేష‌న్‌ల‌లోనూ కాంగ్రెస్ గెలుపు బావుటా ఎగురవేయడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌ ట్విటర్‌లో షేర్ చేస్తూ భాటిండా ప్ర‌జ‌ల‌కు, పోటీదారుల‌కు, విజేత‌ల‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఎన్టీయేపై స్థానికంగా ఉన్న వ్య‌తిరేక‌త‌ను ముందే గుర్తించిన శిరోమ‌ణి అకాలీద‌ళ్ ఎన్డీయే నుంచి వైదొలిగినా ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. 24 ఏళ్ల పాటు బీజేపీతో చేసిన సావాసం కార‌ణంగానే ప్ర‌జ‌లు అకాలీద‌ళ్‌కు కూడా వ్య‌తిరేక తీర్పు ఇచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

అయితే విజ‌యం సాధించ‌లేక‌పోయిన‌ప్ప‌టికీ బీజేపీ కంటే మెరుగైన స్థానంలోనే ఉండి ప‌ర్వాలేద‌నిపించుకుంది. ఎటుచూసినా పంజాబ్ పుర‌పోరులో బీజేపీకి గ‌ట్టి షాక్ త‌గిలిన‌ట్లుగా ఫ‌లితాలు తెలియ‌జేస్తున్నాయి. మొత్తం 8 మున్సిపల్‌ కార్పొరేషన్లలో 7 చోట్ల కాంగ్రెస్ జ‌య‌కేత‌నం ఎగుర‌వేయ‌గా, అకాలీద‌ళ్‌, ఆప్ త‌ర్వాత నాలుగో స్థానానికి బీజేపీ ప‌రిమిత‌మైన‌ట్లు క‌నిపిస్తోంది.

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో పంజాబ్‌ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న వేళ.. రాష్ట్రంలో జ‌రిగిన పురపాలక ఎన్నికల్లో బీజేపీ ఓట‌మి చ‌విచూడ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాష్ట్రంలోని మొత్తం 8 మున్సిపల్‌ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో గల 2,302 వార్డులకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరిగాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇప్పటివరకు వెలువడిన సమాచారం ప్రకారం.. అబోహర్‌, భాటిండా, కపూర్తల, హొషియార్‌పుర్‌, మోగ మున్సిపల్‌ కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మరో రెండు కార్పొరేషన్లు బటాలా, పఠాన్‌కోట్‌ల‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది.

పంజాబ్‌ స్థానిక సంస్థల ఎన్నికల ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అపూర్వ విజయం సాధించిన‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేర‌కంగా రైతులు చేస్తున్న పోరాటానికి మ‌ద్ద‌తు తెలుపుతూ ఆ పార్టీ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లితాలు ఇస్తున్న‌ట్లుగా క‌నిపిస్తున్నాయి. ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌, హరియాణా రైతులు సుదీర్ఘ కాలంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో స్థానిక ఎన్నికల ద్వారా కేంద్రంపై తమ అసహనాన్ని ప్రదర్శించేందుకు పంజాబ్‌ ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నారు. దీంతో 71.39 పోలింగ్‌ నమోదైంది. అదే విధంగా అనివార్య కారణాల వల్ల పోలింగ్‌ నిలిచిపోయిన కొన్ని స్థానాల్లో తిరిగి మంగళవారం ఓటింగ్‌ జరిగింది. వీటి ఫలితాలు రేపు వెలువ‌డ‌నున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగిన బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు శిరోమణి అకాలీదళ్‌కు కూడా భాటిండాలో చేదు అనుభవం ఎదురైంది.

పంజాబ్ రాష్ట్రంలో 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 117 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ గ‌త ఏడాది చివ‌ర్లో ప్రకటించారు. వ్యవసాయ బిల్లుపై అకాలీదళ్ బీజేపీతో సంబంధాలు తెంచుకున్నఅనంత‌రం బీజేపీ కొత్తగా నియమించిన జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుంగ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. పంజాబ్ రాష్ట్రానికి బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పారు. పుర‌పోరు ఫ‌లితాలు చూస్తే బీజేపీ ఘోరంగా ఓట‌మి పాలైంది. ఈ నేప‌థ్యంలో సాగు చ‌ట్టాల‌పై కేంద్రం రైతుల‌కు ఆమోద‌యోగ్య‌మైన నిర్ణ‌యం తీసుకోకుంటే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా అక్క‌డి ప్ర‌జ‌లు వ్య‌తిరేక తీర్పు ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Show comments