iDreamPost
iDreamPost
ఆరేళ్ల క్రితం సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో సాగించిన తంతు చాలామంది ఇప్పటికీ మరచిపోలేదు. 13 జిల్లాల ప్రజలను సుదీర్ఘకాలం పాటు రోడ్డు మీదకు తీసుకొచ్చి సాగించిన వ్యవహారం చివరకు ఉసూరుమనిపించింది. నిర్ధేశిత లక్ష్యాలు లేకుండా సాగించిన కార్యక్రమాలు ఫలితం లేకుండా పోయాయి. పేరుకే ఉద్యమం అయినా పట్టువిడుపులు లేని రీతిలో వ్యవహరించడం ద్వారా ప్రజల ఆకాంక్షలు నీరుగారిపోయాయి. అప్పట్లో చంద్రబాబు వంటి వారు తెరవెనుక నుంచి ఆ ఉద్యమానికి తోడ్పాటునందించారు. టీడీపీ నేతలంతా ముందుపీఠిన నిలిచారు. ఇప్పుడు మళ్లీ అదే రీతిలో అమరావతి పరిరక్షణ పేరుతో 30 రోజుల పాటు సాగించిన కార్యక్రమాల పరంపర ముగింపునకు వచ్చింది.
సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా ఆంధ్రప్రదేశ్ కి ఏం కావాలన్నది అడగకుండా, అప్పటికే తీసుకున్న నిర్ణయం చుట్టూ తిరిగారు. ఇప్పుడు కూడా అదే రీతిలో అమరావతి రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ఏం చేయాలనే డిమాండ్ ముందుకు రాలేదు. మూడు రాజధానుల విషయంలో విస్పష్టంగా ఉన్నట్టు కనిపిస్తున్న సర్కారుని వెనక్కి తీసుకొచ్చేస్తామంటూ రంగంలో దిగారు. అందుకు తగ్గట్టుగానే ఏదో జరుగుతోందనే రీతిలో ప్రజలను నమ్మించే ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా మీడియా సంస్థల ద్వారా కొన్నాళ్లు కేంద్రం జోక్యం చేసుకుంటుందని, ఇంకొంత కాలం పాటు న్యాయస్థానాలు అంగీకరించవని, ఇప్పటికీ ముందుకెళ్లలేరనే రీతిలో మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి వాటిని నమ్మి కొందరు సామాన్యులు అమరావతి చుట్టూ కట్టుకున్న భ్రమలను తొలగించుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది.
రాష్ట్రాల రాజధానుల అంశంలో కేంద్రం జోక్యం ఉండదనే విషయాన్ని విస్మరించి ఇప్పటికీ సుజనా చౌదరి వంటి వారు చూస్తూ ఊరుకోమని చెబుతున్నారు. చంద్రబాబు అయితే ఒక్క అడుగు కదలనివ్వం అంటూ భీకరాలు పలుకుతున్నారు. మేమున్నామంటూ జనసేన చెబుతోంది. బీజేపీ నేతలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఒక్కో పార్టీ ఒక్కో తీరున వ్యవహరిస్తూ అమరావతి గ్రామాల ప్రజలను ఆశల్లో ఊరేగించారు. ఇప్పటికే ఎన్నడూ లేని రీతిలో అవేశకావేశాల కారణంగా కేసులు, జైళ్లు పాలుకావాల్సిన పరిస్థితికి వచ్చారు. తాజాగా క్యాబినెట్ మీటింగ్, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరోసారి సచివాలయ ముట్టడి పేరుతో జనాలను సమీకరించే యత్నాలు చేస్తున్నారు.
ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్న తర్వాత పున్నసమీక్ష చేసుకుని, వెనక్కి మళ్లిన విషయాలు అరుదుగా ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు. అందుకే జగన్ తీసుకున్న నిర్ణయం ఇక అమలులోకి రావడమే తరువాయి అని పలువురు భావిస్తున్నారు. అలాంటి సమయంలో ప్రజలను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చివరకు గత అనుభవాలనే పునరావృతం చేస్తాయనడంలో సందేహం లేదు. ఈ విషయం గ్రహించిన వారు జాగ్రత్తలు పడతారు..లేదంటే మరోమారు ఏదో సాధిద్దామనే ఆశతో బయలుదేరి చతికిలపడతారు.