Idream media
Idream media
అప్పుడే కొత్తగా టీం లోకి వచ్చిన ప్లేయర్ లో ఉండే ఉత్సాహం, టీం లోకి రావడానికి ఉండే ఆత్రుత అంతా ఇంతా కాదు. సీనియర్ల పనైపోయింది… నేను వెళ్తే స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది, ప్రత్యర్థి వికెట్ లు టప టపా పడిపోవడం ఖాయమనే ధీమాలో ఉంటాడు. రెండు ఓవర్లు బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేసిన తర్వాత సినిమా అర్థమవుతుంది… బంతి స్వింగ్ పరిస్థితి, బ్యాటింగ్ కు పిచ్ అనుకూలిస్తుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు ఉన్న అంచనాలు రెండు ఓవర్లలో పులిహోర అవుతుంది. ఇప్పుడు తెలంగాణాలో రేవంత్ రెడ్డి పరిస్థితి అదే.
ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ఆయనతో కాంగ్రెస్ నడవదు, నేను వస్తే గాని పనవ్వదు అని పక్క రాష్ట్ర మాజీ సిఎం రికమెండేషన్ తో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టి… పార్టీలో సమూల మార్పులు, సీనియర్లకు, పార్టీ కోవర్ట్ లకు వార్నింగ్ లు అంటూ నానా హడావుడి చేశారు. కానీ సినిమా… రోజులు గడుస్తున్న కొద్ది అర్థమవుతుంది. పార్టీ పరిస్థితి తెలంగాణాలో ఎలా ఉంది, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఎలా ఉన్నారు… స్థానిక నాయకత్వం ఏ విధంగా ఉంది అనేది ఒకటి క్లారిటీ వచ్చినట్టు ఉంది.
పార్టీ ని గాడిలో పెట్టేందుకు ఎంత కష్టపడుతున్నా సరే పార్టీ మాత్రం గాడిలో పడటం కాదు కదా… పక్క రాష్ట్ర మాజీ సిఎం ను సపోర్ట్ చేసే చానల్స్ లో కూడా కనపడే వాతావరణం లేదు. ఏదైనా పార్టీకి జవసత్వాలు నింపే కార్యక్రమం చేద్దామనే ఆలోచన వచ్చే లోపు సిఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి… బండి సంజయ్ కు వార్నింగ్ ఇవ్వడం, మోడీని తిట్టడం వంటివి చేయడంతో మీడియా డైవర్షన్ మొత్తం అటు వెళ్తుంది. కనీసం గాంధీ భవన్ మీడియా సమావేశాలు కూడా ప్రసారంకాలేని వాతావరణం టీ కాంగ్రెస్ లో ఉంది.
బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా నలుగురు ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని విమర్శించలేని పరిస్థితి. బడ్జెట్ రోజు… కేసీఆర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యాఖ్యలను పట్టుకుని దళిత ఓటు బ్యాంకు ని టార్గెట్ చేయాలని నిరసనలు ప్లాన్ చేసినా… బిజెపి చేసిన నిరసనలకు, కేసీఆర్ తిట్లకు మీడియా హైప్ ఇవ్వడంతో రేవంత్ సైలెంట్ అయిపోయారు. ఇక అంతకుముందు హుజూరాబాద్ ఫలితం కూడా తెలంగాణా కాంగ్రెస్ ను వెనక్కు లాగింది.
ఒక్కటంటే ఒక్క వ్యూహం కూడా సమర్ధవంతంగా అమలు చేయకపోవడం ఒకటి అయితే అభ్యర్థి ని చివరి నిమిషం వరకు నాన్చి… బలహీన అభ్యర్థి ని నిలబెట్టడం మరొకటి. వార్డు మెంబర్ కూడా లేని ఏపీలో కాంగ్రెస్ కు 7 వేల ఓట్లు వరకు వస్తే తెలంగాణాలో నలుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండి కనీసం డిపాజిట్ రాలేదు. ఇక ప్రజా సమస్యల మీద దీక్షలు, నిరసనలు ఎక్కడా లేవు. పార్టీలో కీలకంగా ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అవుతున్నారు. పార్టీ మారే వాళ్ళు… వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. దీనితో ఇప్పుడు టీ కాంగ్రెస్ కు దిక్కు లేదని, రేవంత్ తో ఉపయోగం లేదని అర్థం అయింది. ఇక రేవంత్ కూడా తిట్ల తో ఉపయోగం లేదనే విషయాన్ని గ్రహించి దాదాపుగా సైలెంట్ గానే ఉంటున్నారు.