చావుతో చల్లని కామెడీ లీక్ ?

ఆరెక్స్ 100 లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత హీరో కార్తికేయకు ఆ స్థాయి సక్సెస్ మళ్ళీ దక్కలేదు కానీ అవకాశాలకు మాత్రం లోటు లేకుండా సాగుతోంది. నాని గ్యాంగ్ లీడర్ లో విలన్ గా చేశాక ఇప్పుడు ఏకంగా అజిత్ వలిమై లో ప్రతినాయకుడిగా అవకాశం దక్కించుకున్నాడు. ఇది కనక హిట్టు కొడితే కోలీవుడ్ లోనూ మంచి ఆఫర్లు దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా ఇతని కొత్త సినిమా చావు కబురు చల్లగా మార్చ్ 19 విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.

తాజాగా దీని కథకు సంబంధించిన లీక్ ఒకటి చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం హీరో బాలరాజు స్మశానంలో భర్త చనిపోయిన హీరోయిన్ ని తొలి చూపులోనే ఇష్టపడతాడట. ఆమె హాస్పిటల్ నర్స్. మనోడు శవాలు మోసుకెళ్లే వాహనం డ్రైవర్. వీళ్ళు కలుసుకునే సందర్భం కూడా ఈ కారణంగానే వస్తుందట. దీంతో ఆ నర్సమ్మను లవ్ లో పడేయడానికి మన బాలరాజు పడే పాట్లు, విధవను ప్రేమించినందుకు ఎదురుకునే ఇబ్బందులు అన్నీ వినోదాత్మకంగా రూపొందించినట్టు వినికిడి. ఇది నిజమో కాదో కానీ ప్రోమోలు పోస్టర్లు చూస్తే దగ్గరగానే మ్యాచ్ అవుతోంది. నిన్నే హీరో పాత్రను పరిచయం చేసే ఇంట్రో సాంగ్ ని విడుదల చేశారు.

చావు కబురు చల్లగా ద్వారా కౌశిక్ పెగల్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రమోషన్ మెటీరియల్ చూస్తే టేకింగ్ ప్రామిసింగ్ గానే కనిపిస్తోంది. జేక్స్ బెజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొంత గ్యాప్ వచ్చిన లావణ్య త్రిపాఠి దీని రూపంలో పెద్ద బ్రేక్ ఆశిస్తోంది. అటు కార్తికేయకూ ఇది హిట్ కావడం చాలా అవసరం. హిప్పీ, గ్యాంగ్ లీడర్, గుణ 369, 90 ఎంఎల్ వరసగా నిరాశ పరిచిన నేపథ్యంలో ఆశలన్నీ దీని మీదే పెట్టుకున్నాడు. గీత బ్యానర్ కాబట్టి అంత ఈజీగా కంటెంట్ ని ఒప్పుకోరు. అన్నట్టు ఇలా చావుని టైటిల్ లో పెట్టుకున్న ఎంటర్ టైనర్ దాదాపు ఇప్పటిదాకా రాలేదని చెప్పాలి

Show comments