వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ: పోస్కోతో కేంద్ర ఒప్పందం వెనుక వాస్తవాలు, ప్రచారాలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. నష్టాల పేరుతో ఏపీలోనే అతి పెద్ద పరిశ్రమను ప్రైవేటుపరం చేసేందుకు పూనుకుంటోంది. ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ నిర్ణయం చేయగా తాజాగా కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీ విజయసాయి రెడ్డి గారి ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాజ్యసభలో ఆసక్తికర ప్రకటన చేశారు. 2018 అక్టోబర్ లోనే దక్షిణ కొరియాకు చెందిన పోస్కో సంస్థ ప్రతినిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతినిధులతో కలిసి తాము సమావేశం నిర్వహించాం అని 2019 అక్టోబర్ లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ మిగులు భూముల్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి పోస్కో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని, విశాఖ ఉక్కు యాజమాన్యం పోస్కోతో ఒప్పందం కుదుర్చుకున్న విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తో ఇప్పటి వరకు ఎలాంటి సంప్రదింపులు చెయ్యలేదని ప్రకటించారు.

Also Read: ఆంధ్రుల హ‌క్కు చాటిన జ‌గ‌న్..! కేంద్రానికి లేఖ.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చంద్రబాబు ప్రభుత్వ హయాం 2018లో మొదలైనా 2019 ఎన్నికల్లో ఆయన అధికారం కోల్పోయి జగన్ విజయం సాధించి ప్రభుత్వం మారడంతో 2019 జూన్ 20న పోస్కో ప్రతినిధులు కొత్తగా ఏర్పడిన జగన్ ప్రభుత్వాన్ని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ పై తమకున్న ఆలోచనను వ్యక్తపరిచారు. అయితే నాడే జగన్ వారితో విశాఖలో ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఉన్నందున తాము అనుకుంటున్న స్టీల్ ప్లాంట్ ను కడప జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరారు. దానికి పోస్కో ప్రతినిధులు అంగీకరిస్తూ మూడు నెలల్లో సాధ్యసాధ్యాలపై ఒక నివేదిక సమర్పిస్తాం అని చెప్పి వెళ్లారు . ఇది ఆనాడు అన్ని ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన విషయమే.

తదనంతర పరిణామాలతో పోస్కో సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ మిగులు భూముల్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రంతో ఒప్పందం చేసుకున్న విషయం విజయసాయిరెడ్డి గారు రాజ్యసభలో అడిగిన ప్రశ్న ద్వారా వెల్లడైంది. ఆ తర్వాత 2020 అక్టోబర్ లో పోస్కో ప్రతినిధులు ఏపీ సీఎంతో జగన్ తో భేటీ అయిన విషయాన్ని ఈ ఒప్పందంతో ముడిపెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఆనాడు పోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రితో భేటీ అయింది రాష్ట్రంలో తమకి పెట్టుబడులు పెట్టెందుకు వీలు కల్పించి సహకరించమని కోరడం జరింది. ఆ విషయం కూడా ఆన్ని పత్రికల్లో వచ్చింది. కానీ సీఎం జగనే పోస్కో ప్రతినిధులని విశాఖకు తీసుకుని వచ్చి విశాఖ ఉక్కు పరిశ్రమను వారికి కట్టబట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడం రాజకీయ స్వలాభం కోసం మాట్లాడుతున్న మాటలుగా స్పష్టం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటాల అమ్మకానికి ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకపోయినా తాజాగా విపక్ష సోషల్ మీడియా బృందాలు దానిని జగన్ కి ముడిపెట్టే యత్నం చేయడం విస్మయకరం.

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సుముఖంగా ఉన్నామంటూ పోస్కో ఇండియా గ్రూప్ చైర్మన్ కం ఎండీ సుంగ్ లీ చున్, చీఫ్‌ పైనాన్సింగ్ ఆఫీసర్ గూ యంగ్ ఆన్ సహా బృందం సీఎంతో భేటీ అయ్యిన నాటికే కేంద్రం ఈ ఒప్పందం చేసుకున్న విషయం గమనించాలి. అయితే ఈ ప్రక్రియ దాదాపుగా 9 ఏళ్లుగా జరుగుతుందనే విషయాన్ని గుర్తించాలి. 2010లోనే భెల్, సెయిల్ తో కలిసి విశాఖ స్టీల్ లో జాయింట్ వెంచర్ గా ప్రాజెక్టు చేపట్టేందుకు పోస్కో ముందుకొచ్చింది. అప్పటి నుంచి పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ అవన్నీ ముందుకు సాగలేదు. దానికన్నా ముందు ఒడిషా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని 2005లో ఆ రాష్ట్రంలోని జగత్ సింగ్ పూర్ జిల్లాలో 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ కోసం ప్రయత్నాలు చేసింది. 2700 ఎకరాల్లో పరిశ్రమ స్థాపన కోసం పోస్కో చేసిన ప్రయత్నాన్ని స్థానికులు ప్రతిఘటించారు. భూసేకరణ కు అడ్డుపడి, ఆ తర్వాత ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. చివరకు 2017లో ఈ ప్రాజెక్ట్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది.

Also Read: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎలా అయ్యింది? చరిత్ర !

సరిగ్గా ఒడిశా ప్లాంట్ ముందుకెళ్లే అవకాశం లేదని తేలుతున్న సమయంలో పోస్కో విశాఖ ప్లాంట్ మీద కన్నేసింది. నాటి నుంచి వివిద రకాల ప్రయత్నాలు చేసింది. చివరకు దానికి మోడీ సర్కారు అంగీకరించడంతో 2019లోనే ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం విశాఖ స్లీల్ ప్లాంట్ సామర్థ్యం 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 11.5 మి. మె. టన్నులకు పెంచేందుకు ప్లాంట్ భూముల్లోనే పోస్కో, ఆర్ఐఎన్ఎల్(వైజాగ్ స్టీల్ యజమాని) కలిసి ప్రయత్నాలు చేస్తారు. దానికి అవసరమైన ఇనుపఖనిజం సరఫరా చేసేందుకు పోస్కో సంస్థ సెయిల్ తో ఒప్పందం చేసుకుంది. తద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ కి అనుబంధంగా కొత్త ప్లాంట్ నిర్మాణం పోస్కో నేతృత్వంలో జరుగుతుంది. దానిలో వైజాగ్ స్టీల్, పోస్కో భాగస్వాములుగా ఉంటాయన్నది ఆ ఒప్పందం.

అయితే పోస్కో ప్రవేశాన్ని స్టీల్ ప్లాంట్ కార్మికులు వ్యతిరేకించారు. ఇప్పటికే 1.2 మిలియన్ మెట్రిక్ టన్ను నుంచి క్రమంగా సొంతంగానే సామర్థ్యం పెంచుకున్న సంస్థ ఇప్పుడు విదేశీ సంస్థ భాగస్వామ్యంతో విస్తరణ చేయాల్సిన అవసరం లేదని వాదించారు. దాంతో ఒప్పందం జరిగినప్పటికీ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. అయితే ప్లాంట్ నిర్మాణం కన్నా ఆ పేరుతో సెయిల్ ద్వారా లభించే ఐరన్ ఓర్ వాటాల కోసమే పోస్కో ఆరాటపడుతుందనే విమర్శ కూడా ఉంది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తి సంస్థగా ఉన్న పోస్కోకి వివిధ దేశాల్లో ప్లాంట్లు పేరుతో ఐరన్ ఓర్ తీసుకోవడం, దానిని కొరియా తరలించి స్టీల్ ఉత్పత్తి చేయడం ఆనవాయితీగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర చెబుతున్న ఒప్పందం ఈనాటిది కాదు. పైగా అది అమలు చేసేందుకు అనేక ఆటంకాలు ఎదురువుతున్నాయి. ఒడిశాలో ఓసారి చేతులు కాల్చుకున్న పోస్కో ఈసారి విశాఖ స్టీల్ విషయంలో ఎలా ముందుకెళుతుందన్నది చూడాల్సి ఉంది. అయితే ఈలోగా పోస్కో ఒప్పందాన్ని ఏపీ ప్రభుత్వానికి ముడిపెట్టే ప్రయత్నాలను మాత్రం కొందరు చేయడం విస్మయకరంగా కనిపిస్తోంది.

Show comments