Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతాయి, తమకు పోటీ చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్న వారి ఆశలు ఇప్పట్లో తీరేలా లేవు. రాష్ట్ర విభజన తర్వాత సీట్ల పెంపుపై పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే సీట్ల సంఖ్య పెంపు మాత్రం రాజ్యాంగంలో పొందుపరిచిన నియమ నిబంధనల ప్రకారం జరగాల్సి ఉండడంతో ఈ అంశంపై ఊగిసలాట నడుస్తోంది. తాజాగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై కేంద్ర హోం శాఖ స్పష్టత ఇచ్చింది. 2031 తర్వాతనే సీట్ల పెంపు ఉంటుందని మల్కాజ్ గిరి ఎంపీ, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానమిచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల అనంతరం అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు చేయాల్సి ఉంటుందని నిత్యానంద్ రాయ్ స్పష్టం చేశారు.
అప్పుడు.. ఇప్పుడు..
రాష్ట్ర విభజన చట్టంలో తెలుగు రాష్ట్రాలలో సీట్ల సంఖ్య పెంపును ప్రస్తావించారు. ఏపీలో 175 సీట్లు 225గా, తెలంగాణలో 119 సీట్లు 153గా పెంచాలని పేర్కొన్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లు ఫిరాయింపులు ప్రోత్సహించారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాల పెట్టి చేర్చుకున్నారు. సీట్ల సంఖ్య పెరుగుతుందనే విషయాన్ని చెప్పి.. ఆది నుంచి రాజకీయంగా కత్తులు దూసుకున్న ప్రత్యర్థులను సైతం టీడీపీ గూటికి చేరేలా చంద్రబాబు రాజకీయం నడిపారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ప్రకాశం జిల్లా అద్దంకి గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాంలు ఒకే గూటిలో రాజకీయాలు చేశారు. సీట్ల సంఖ్య పెంపుపై చంద్రబాబు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. వెంకయ్య నాయుడు ద్వారా కేంద్రంపై ఒత్తిడి చేశారు. అయినా పని కాలేదు.
Also Read : అధికారులకు ఒంగి ఒంగి దండాలు.. జేసీ నాటకాలు
గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై స్పష్టత ఇచ్చింది. అయినా రేవంత్ రెడ్డి మళ్లీ ఈ ప్రశ్న అడిగేందుకు కారణం ఉంది. కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి వంటి నేతలకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఈ ఫిరాయింపుల వల్ల కాంగ్రెస్ శాసనసభా పక్షం గల్లంతైంది. నియోజకవర్గాలకు మించి తాజా, మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న కేసీఆర్.. వారికి అసెంబ్లీ సీట్ల పెంపు విషయం చెబుతున్నారనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు బ్రేక్ వేసేందుకు.. అదే సమయంలో ఫిరాయింపుదారుల్లో ఆందోళన రేపేందుకు, టీఆర్‌ఎస్‌లోకి వలసలు నిలువరించేందుకు.. రేవంత్ రెడ్డి లోక్‌సభలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై ప్రశ్న అడిగారని అర్థమవుతోంది.
లోక్ సభ సీట్ల పెంపు పై కూడా క్లారిటీ..
కేంద్ర హోం శాఖ ప్రకటనతో మరో అంశంపైనా క్లారిటీ వచ్చింది. నిన్న మొన్నటి వరకు లోక్‌సభ సీట్లు కూడా వేయికి పెరుగుతాయని, 2024లోపే ఆ పని చేసేందుకు బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్న చర్చ సాగింది. కాంగ్రెస్ నేత మనోజ్ తివారి ట్విట్‌తో దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. లోక్‌సభలో సీట్ల పెంపు కూడా జనాభా లెక్కల ఆధారంగానే చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో 2031 తర్వాతనే ఆ ప్రక్రియకు కార్యరూపం చేపట్టడం అనివార్యమని తేలిపోయింది.
Also Read : లోక్‌సభ సభ్యుల సంఖ్యను 545 నుంచి 1000కి పెంచడం సాధ్యమా..?