జ‌గ‌న్ విష‌యంలో ముగ్గురూ.. ఒక్క‌టేనా..!?

ఎన్ని ప‌న్నాగాలు ప‌న్నినా ఫ‌లించ‌క‌పోవ‌డంతో.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై హిందూ వ్య‌తిరేక ముద్ర వేసేందుకు ఆది నుంచీ ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాయి. జ‌గ‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు వారి కుయుక్తుల‌ను తిప్పికొడుతూ ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పొందుతూనే ఉన్నారు. ఇక్క‌డ విశేషం ఏంటంటే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడును ఎన్నో అంశాల్లో బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు విమ‌ర్శించారు. బాబు హ‌యాంలో జ‌రిగిన అవినీతిని కూడా ప‌లు సంద‌ర్భాల్లో తెర‌పైకి తెచ్చారు. అలాగే బీజేపీతో జ‌త క‌ట్ట‌క ముందు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ పార్టీపై విమ‌ర్శ‌లు చేసిన దాఖ‌లాలు ఉన్నాయి. బాబుపై కూడా పంచ్ లు వేసిన సంద‌ర్భాలూ ఉన్నాయి. కానీ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటే.. దాన్ని వ్య‌తిరేకించ‌డంలో మాత్రం మూడు పార్టీలూ ఒకే స్టాండ్ తీసుకుంటున్నాయి. సోము, బాబు, ప‌వ‌న్ ఒకే పంథాలో వెళ్తున్నారు. ఏపీలో వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌పై ఆ ముగ్గురి వ్యాఖ్య‌లే అందుకు నిద‌ర్శ‌నం.

వినాయక చవితి ఉత్సవాల నిర్ణ‌యంపై చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలతో జరిగిన టెలి కాన్ఫరెన్సులో మాట్లాడుతూ జగన్ హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నట్లు మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్సార్ వర్దంతి సందర్భంగా లేని ఆంక్షలు వినాయక చవితి ఉత్సవాలకే వచ్చిందా ? అని విమ‌ర్శించారు. జగన్ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని 175 నియోజకవర్గాల్లోని నేతలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తు చవితి ఉత్సవాలను జరపాలంటూ పిలుపిచ్చారు.

బాబు కంటే ముందే.. బీజేపీ చీఫ్ సోమువీర్రాజు కూడా ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలే వేస్తూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని జనాలకు పిలుపిచ్చారు. సోము మ‌రో అడుగు ముందుకు వేసి అన్ని వర్గాల‌నూ రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజా సినీ ప్ర‌ముఖుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. షూటింగ్ ల ప్రారంభానికి ముందు వినాయ‌కుడికి టెంకాయ‌లు కొట్టేవారంతా జ‌గ‌న్ నిర్ణ‌యంపై స్పందించ‌రా అంటూ వివాదాస్పదం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వినాయకచవితి వేడుకలపై ఇన్నాళ్లు బీజేపీ మాత్రమే పోరుబాట పట్టింది. ఆ తర్వాత దీనిపై టీడీపీ అందుకుంది.. ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వారికి వంత పాట మొద‌లు పెట్టారు.

ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి ఉత్సవాలపై ఎందుకు నిషేధం విధించారో నాకు నిజంగా అర్ధం కాలేదని అన్నారు. కొన్ని వేల సంవత్సరాలుగా మన సంస్కృతి సంప్రదాయాలు ధర్మానికి ముడిపడి ఉన్న వినాయక చవితి పండగకు కోవిడ్ నిబంధల వల్ల అనుమతులు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పడం నమ్మశక్యంగా లేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలు కేవలం వినాయక చవితి పండగకు మాత్రమే వర్తిస్తాయా? వైసీపీ ప్రజా ప్రతినిధులు వారి కుటుంబ సభ్యుల పుట్టిన రోజులకు పండగలకు పబ్బాలకు వర్తించవా? అని నిలదీశారు. ఎక్కడ అవకాశం దొరికినా జ‌గ‌న్ ను హిందూ వ్యతిరేక వ్యక్తిగా ముద్ర వేయటానికి వీర్రాజుతో పాటు చంద్రబాబు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ఇప్పుడు ప‌వ‌న్ కూడా తోడ‌వ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

అయితే వీళ్ళంద్ద‌రికీ తెలంగాణా హైకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. వినాయక విగ్రహం నిమజ్జనం సందర్భంగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా కరోనా వైరస్ నేపథ్యంలో చవితి ఉత్సవాల పేరుతో జనాలు గుమిగూడకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పమని ప్రభుత్వాన్ని నిలదీసింది. వినాయక చవితి ఉత్సవాల పేరుతో జనాలంతా ఒకచోట గుమికూడితే మళ్ళీ కరోనా వైరస్ విజృంభించే ప్రమాదముందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా నేత‌లు మ‌రిచిపోయిన మ‌రో అంశం ఏంటంటే.. జగన్ ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిందేమీ కాదని. కేంద్ర ప్రభుత్వం ఆగష్టు 28వ తేదీన అన్ని రాష్ట్రాలకు జారీచేసిన మార్గదర్శకాలనే ఏపిలో జగన్ ప్రభుత్వం కూడా జారీ చేసింది. దీనిపైనే వీర్రాజు చంద్రబాబు నానా గోలచేస్తున్నారు. తాము చేస్తున్న ఆరోపణలకు విమర్శలకు తెలంగాణాను మద్దతుగా చూపించుకుంటున్నారు. అయితే విచారణలో భాగంగా జనాలు గుమిగూడకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్న హైకోర్టు ఆదేశాలతో వాళ్ల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది.

Show comments