సార్, వ్యాపారాన్నిమ‌రింత అభివృద్ధి చేసుకోమని సీఎం రమేష్ రాజ్యసభకు పంపారా?

క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లో బాబుకు చేదు అనుభ‌వం

క‌డ‌ప జిల్లాలో మూడురోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి చేదు అనుభ‌వం ఎదురైంది. ధిక్కార స్వ‌రాన్ని బాబు ఏ మాత్రం స‌హించ‌లేడు. అలాంటిది కార్య‌క‌ర్త‌లు త‌న‌ను విమ‌ర్శిస్తుంటే ప‌ట్ట‌రాని కోపం వ‌స్తున్నా త‌ట్టుకోవాల్సిన దుస్థితి. క‌డ‌ప జిల్లాలో పార్టీ పూర్తిగా మునిగిపోవ‌డానికి మీరే కార‌ణ‌మంటూ కార్య‌క‌ర్త‌లు అన్న మాట‌లు మ‌న‌సును కెలుకుతుండ‌గా, బాధాత‌ప్త హృద‌యంతో ఆయ‌న మూడురోజుల ప‌ర్య‌ట‌న ముగించుకుని వెళ్లాల్సి వ‌చ్చింది. కాని వారి నిల‌దీత‌లు నీడ‌లా వెంటాడుతూనే ఉంటాయ‌నంలో ఎలాంటి సందేహం లేదు.

మ‌న‌సులోని భావాల‌ను ముఖం మీదే చెప్పే గుణ‌మున్న క‌డ‌ప‌వాసులు చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపించారని స‌మాచారం. మూడురోజుల విస్తృత స్థాయి స‌మావేశాల్లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు పార్టీకి ఈరోజు ఇలాంటి గ‌డ్డు ప‌రిస్థితి రావ‌డానికి మీరే కార‌ణ‌మ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు త‌మ అభిప్రాయాల‌ను ఎదురుగానే చెప్ప‌డంతో బాబు షాక్‌కు గుర‌య్యాడ‌ని పార్టీ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

“సార్ జిల్లాలో పార్టీ ప‌రిస్థితి అంతంత మాత్ర‌మే. ఉన్న‌ది కూడా నిట్ట‌నిలువునా మున‌గ‌డానికి మీరే కార‌ణం. ప‌ద‌వీ వ్యామోహం, అవ‌కాశ‌వాదుల‌ను మీరు అంద‌లం ఎక్కించారు. దీనికి ఉదాహ‌ర‌ణ సీఎం ర‌మేష్‌, మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డిల‌కు ప‌ద‌వులు క‌ట్ట‌బ‌ట్ట‌డ‌మే. వారిని నెత్తికెక్కించుకుని మ‌మ్మ‌ల్ని(కార్య‌క‌ర్త‌ల్ని) ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు త‌గిన మూల్యం చెల్లించుకున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు మాగోడు ప‌ట్టించుకున్న వారెవ‌రో చెప్పండి” అని ప‌లువురు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు చంద్ర‌బాబును నిల‌దీసిన‌ట్టు తెలిసింది.

ముఖ్యంగా కమలాపురం,జమ్మలమడుగు నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయ‌కులు చంద్రబాబు పై విమర్శల దాడి చేశారని స‌మాచారం. కమలాపురం సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు సాయినాథశర్మ చంద్రబాబు పై ఒక రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేశాడ‌ని తెలిసింది. “ఇప్పుడైనా చెప్పేది వినండి” సార్‌ అంటూ చంద్ర‌బాబుకు క్లాస్ పీకాడని తెలిసింది. బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నా ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని ధ్వజమెత్తినట్టు సమాచారం.

జమ్మలమడుగు సమీక్షా సమావేశంలో కూడా చంద్రబాబుపై మండిప‌డ్డారని తెలిసింది. జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో ఒక ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మ‌రో మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి ఉన్నా పార్టీ సభ్యత్వం జరగలేదని గుర్తు చేశార‌ని తెలిసింది. ఎందుకు జరగలేదని దీనిపై ఎప్పుడైనా సమీక్షించారా? అని సుమంత్‌ అనే కార్యకర్త చంద్రబాబును నిలదీశాడని స‌మాచారం.

అలాగే నాగేశ్వ‌ర‌రావు అనే కార్య‌క‌ర్త మాట్లాడుతూ సీఎం రమేష్ ఓ వ్యాపార‌వేత్త‌ని, వ్యాపారాన్ని మ‌రింత అభివృద్ధి చేసుకోవాల‌ని రాజ్యసభకు పంపారా అని ప్ర‌శ్నించిన‌ట్టు తెలిసింది. సీఎం ర‌మేష్ వ‌ల్ల పార్టీకి తీరని నష్టం జరిగిందని నాగేశ్వ‌ర‌రావు వాపోయిన‌ట్టు స‌మాచారం. సీఎం ర‌మేష్‌ను న‌మ్మ‌డం కంటే త‌ప్పిదం మ‌రేదైనా ఉందా అని చంద్ర‌బాబును అత‌ను నిల‌దీసిన‌ట్టు తెలిసింది.

ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకోవద్ద‌ని ఎంత వేడుకున్నా ఫ‌లితం లేక‌పోయింద‌ని, ఆయ‌న‌ వల్ల ఎన్నో అవమానాలు పడ్డామని జమ్మలమడుగుకు చెందిన రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన పలువురు చంద్ర‌బాబు ఎదుట త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. ఆదినారాయ‌ణ‌రెడ్డిపై ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, దానివల్లే పార్టీ నష్టపోయిందని మండిస‌డ్డిన‌ట్టు తెలిసింది.

రామ‌సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ ప‌ద‌విని ఆదినారాయ‌ణ‌రెడ్డి త‌మ్ముడు శివ‌నాథ‌రెడ్డికి ఇచ్చార‌ని, మ‌రిప్పుడు వారెక్క‌డ‌ని ప్ర‌శ్నించ‌డంతో బాబు మౌనంగా విన‌డం త‌ప్ప నోరు మెద‌ప‌లేక‌పోయిన‌ట్టు తెలిసింది. ఇలా ఒక‌రిని చూసి మ‌రొక‌రు చంద్ర‌బాబు వైఖ‌రిపై ధ్వ‌జ‌మెత్త‌డంతో ఒక దశలో సహనం కోల్పోయిన చంద్రబాబు కార్యకర్తలపై సీరియస్ అయ్యిన‌ట్టు తెలిసింది.

Show comments