Idream media
Idream media
నారా చంద్రబాబునాయుడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవలందించారు. అంతకు రెండింతలు రాజకీయ నాయకుడిగా ప్రజా జీవితంలో ఉన్నారు. రాజకీయంగానే కాదు.. వ్యక్తిగతంగానూ ఆయనకున్న పేరుప్రఖ్యాతలు తక్కువేం కావు. కానీ, నలభై ఏళ్ల పొలిటికల్ కెరియర్ లో సాధించిన కీర్తి కేవలం రెండేళ్లలోనే కరిగిపోతుండడం ఆలోచించాల్సిన విషయమే. సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతుండగానే మరో వ్యక్తికి జై కొడుతుండడం, మున్సిపల్ ఎన్నిల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లాలో బాబు పర్యటనను న్యాయవాదులు అడ్డగించడం, విశాఖలో కూడా బాబూ.. మీరు రావొద్దంటూ నిరసనలు పెల్లుబికడం.. ఇప్పుడు తాజాగా గొల్లపూడిలో చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినదించడం.. ఇవన్నీ దేనికి సంకేతాలో చంద్రబాబు అర్థం చేసుకోవాలి.
నారా చంద్రబాబునాయుడు గతంలో కూడా ప్రతిపక్షంలో కూర్చున్నారు. కానీ ఎప్పుడూ ఇంతలా ఆయనపై వ్యతిరేకత పెరగలేదు. ఆయన రాజకీయ ప్రస్థానం 2019కు ముందు వరకు ఒకలా.. ఆ తర్వాత మరోలా మారిందనే చెప్పొచ్చు. ఇందుకు కారణం గతంలో కూడా చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇంత బలమైన అధికార పక్షాన్ని చూడలేదు. అలాగే.. ప్రజల్లో అంతకంతకూ ఆదరణ పెరిగే జగన్ వంటి నాయకుడిని చూసి ఉండకపోవచ్చు. ఇక పార్టీ పరంగా చూసినా వైసీపీ అసెంబ్లీ ఎన్నికల కంటే ఇప్పుడు మరింత స్ట్రాంగ్ అయింది. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా ఆ విషయం స్పష్టమైంది. వ్యక్తిగతంగా జగన్ గ్రాఫ్ కూడా అంతకంతకూ ఎగబాకుతోంది. దీంతో చంద్రబాబు గతానికి కంటే భిన్నంగా రాజకీయాలు ప్రారంభించాల్సి వచ్చింది. అవి ప్రజలను ఆకట్టుకోకపోగా, మరింత దూరం చేశాయని తాజా పరిస్థితులను బట్టి తెలుస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గొల్లపూడి పర్యటనలో దళిత సంఘాల నుంచి ఆ స్థాయిలో నిరసనలు ఎదురవ్వడం యాధృచ్చికమే. ఎందుకంటే.. అక్కడ జరిగిన ఇష్యూ లో దేవినేని ఉమా వ్యవహరించిన తీరు వారికి నష్టం చేకూర్చేలా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత జగన్ పుణ్యమా అని అక్కడ దళితులకు కొంత భూమి దక్కుతోంది. సొంత ఇల్లు సమకూరుతోంది. పదిహేనేళ్లు అధికారంలో ఉన్న దేవినేని ఉమా దళితులకు సెంటు భూమి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం పేదలకు స్థలాలు ఇస్తే.. అది అక్రమం అంటూ దేవినేని అడ్డుకునే ప్రయత్నం చేయడం వారి ఆందోళనకు కారణమైంది. అవి రెవెన్యూ భూములా.. ఫారెస్ట్ భూములా అనేది దేవినేనికి తెలియంది కాదు. 2016 డిసెంబర్ 4న 143 సర్వే నంబర్‌లో దేవినేని మైనింగ్ ప్రారంభించారు. 2018లో దేవినేని ఉమా క్రషర్ కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఆయన అవాస్తవాలను చెబుతుండడం వివాదస్పదంగా మారింది.
ఈ క్రమంలో అలాంటి వ్యక్తికి చంద్రబాబుకు వంతపాడడం దళితుల్లో ఆగ్రహానికి కారణమైంది. దళితులపై దాడి చేసిన దేవినేని ఉమాకు మద్దతు తెలపడంపై పలు దళిత సంఘాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. చంద్రబాబు గో బ్యాక్ అంటూ గళం విప్పాయి. గొల్లపూడి పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్న దళితుల సంఖ్యను గమనించి అయినా, చంద్రబాబు అర్థం చేసుకుని ఉండాల్సింది. దేవినేని చర్యలు పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ చేస్తున్నాయని. ఇదే ఇష్యూ లో కొందరు దళితులపై దాడి జరిగింది. కుల, మత, పార్టీ బేధాలు చూడకుండా ఓ ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు వారిని కూడా పరామర్శించాలి. నిజా నిజాలు తెలుసుకోవాలి. కానీ, దేవినేని ఉమ ఇంటికి వెళ్లడం విమర్శలకు తావిస్తోంది.
పైగా.. ఆ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన స్థాయికి తగినట్లుగా లేవు. వాటిని పరిశీలిస్తే.. రాష్ట్రంలో పార్టీపైన, ఆయనపైన పెరుగుతున్న వ్యతిరేకతతో బాబులో అసహనం పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న వాళ్లు కాలగర్భంలోకి కలిసిపోయారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమ కుటుంబీకులకు చంద్రబాబు పరామర్శ నేపథ్యంలో ఆయన ఇతరులకు శాపనార్థాలు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ శాపనార్థాలు పెట్టడం ఏమిటో, కాలగర్భంలో కలిసిపోవడం అంటే ఏమిటో.. ఆయనకే తెలియాలి. ఒకప్పుడు చంద్రబాబు మాట్లాడారంటే అందులోని పాయింట్లకు విపక్షాలు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉండేది. అలాంటిది ఎన్నడూ లేని రీతిలో కొత్త రకమైన వ్యాఖ్యలు… ఆయనలోని మార్పును తెలియజేస్తున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా టీడీపీని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లలేక ఆయనలో సహనం నశించిపోతుందన్న విషయం అర్థమవుతోంది.