హిందీ సినిమాలకు రెక్కలు వచ్చేశాయి

ఏడాదిన్నర పైగా కరోనా దెబ్బకు సరిగ్గా థియేటర్లు తెరుచుకోక తీవ్రమైన క్షోభను అనుభవిస్తున్న బాలీవుడ్ కు ఎట్టకేలకు ఊరట దక్కబోతోంది. అక్టోబర్ 22 నుంచి సినిమా హాళ్లు తెరుచుకునే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేయనుంది. ఒక్క ముంబై మూతబడటం వల్లే ఇప్పటికే వేల కోట్ల నష్టాన్ని ఎదురుకుంటున్న పరిశ్రమకు ఇది గొప్ప ఊరట. అందులోనూ అక్కడి థియేటర్లు మూసే ఉంచడం వల్ల కరోనా ఇంకా పూర్తిగా పోలేదేమోననే భయంతో నార్త్ లోని ఇతర రాష్ట్రాల ఆడియన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంగానే బెల్ బాటమ్, చెహరే, తలైవిలు ఆశించిన స్థాయిలో వసూళ్లు తేలేకపోయాయి.

మొదట వచ్చే సినిమాగా అక్షయ్ కుమార్ సూర్య వంశీ మీదే అందరి కళ్ళు ఉన్నాయి. 2020 ఏప్రిల్ లోనే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ భారీ మల్టీ స్టారర్ ని ఎన్ని ఓటిటి ఆఫర్లు వచ్చినా కూడా నిభాయించుకుని మరీ ఎదురు చూశారు. దీపావళి కానుకగా దీన్ని వెండితెరకు అందించబోతున్నట్టు దర్శకుడు రోహిత్ శెట్టి ప్రకటించడం అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. అజయ్ దేవగన్, రణ్వీర్ సింగ్ ప్రత్యేక పాత్రలు చేయడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇండియా మొదటి వరల్డ్ కప్ విక్టరీ నేపథ్యంలో రూపొందిన 83 డేట్ ని కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారు. ల్యాబులో ఉన్న సినిమాలన్నీ క్యూ కట్టబోతున్నాయి.

ఒకరకంగా చెప్పాలంటే దీనికి స్ఫూర్తి టాలీవుడ్ అనే చెప్పాలి. జులై 30న థియేటర్లు తెరుచుకున్నాక తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి, బాగున్న వాటిని జనం బ్రహ్మాండంగా ఆదరించారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం 8 కోట్లు రాబట్టగా లవ్ స్టోరీ రెండు రోజులకే 12 కోట్లను దాటిందని ట్రేడ్ రిపోర్ట్. నిరాశ పరిచిన సీటిమార్ సైతం 9 కోట్లకు దగ్గరగా వెళ్ళింది. రాజరాజచోర 6 కోట్లకు పైగానే రాబట్టింది. సో విషయమున్న వాటికి ఆదరణ దక్కుతోంది. బాలీవుడ్ కూడా ఇప్పుడీ ఆశలతోనే థియేటర్లు తెరుచుకున్నాక వందల కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ కళకళలాడుతుందని గట్టి నమ్మకంతో ఉంది

Also Read : అభయం ఇచ్చిన ‘లవ్ స్టోరీ’.. రిలాక్స్ అవుతున్న టాలీవుడ్!

Show comments