అర్జున అవార్డు కోసం మహిళా క్రికెటర్‌ల పేర్లను సిఫార్సు చేయనున్న బీసీసీఐ

భారత్ తరఫున అంతర్జాతీయ క్రీడలలో ఉత్తమ ప్రదర్శన చేసిన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ కేంద్రం ప్రతి ఏటా అర్జున అవార్డులతో సత్కరిస్తుంది. ప్రతి ఏడాదిలాగే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, అర్జున అవార్డులతో సహా జాతీయ క్రీడా పురస్కారాలు-2020 కోసం మే 5 న క్రీడా మంత్రిత్వ శాఖ నామినేషన్‌లను ఆహ్వానించే సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఇ-మెయిల్ ద్వారా నామినేషన్‌లను పంపాలని మంత్రిత్వ శాఖ కోరింది.సాధారణంగా ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఈ నామినేషన్‌ల ప్రక్రియ కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా కొంత ఆలస్యం అయింది.

ఈ ఏడాది అర్జున అవార్డు కోసం శిఖా పాండే మరియు దీప్తి శర్మ పేర్లను బీసీసీఐ సిఫార్సు చేయబోతున్నట్లు వార్తలు వెలువడ్డాయి.ఐసీసీ ఉమెన్ టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో భారత్ ఓటమి చెంది రన్నరప్‌గా నిలిచింది. కానీ గత సీజన్‌లో నిలకడగా రాణించిన శిఖా పాండే, దీప్తి శర్మలను అర్జున అవార్డు నామినేషన్‌కి పంపాలని ఇరువురి పేర్లు ఆఫీసు-బేరర్‌లకు ఫార్వార్డ్ చేయబడ్డాయి.ఈ మహిళా క్రికెటర్ల పేర్లు ఆమోదించిన తర్వాత అర్జున అవార్డుల కోసం క్రీడా మంత్రిత్వ శాఖకు పంపనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

మహిళ టీ20 వరల్డ్‌కప్‌లో శిఖా పాండే ఐదు మ్యాచ్‌లాడిన శిఖా పాండే 3/14 ఉత్తమ గణాంకాలతో ఏడు వికెట్లు పడగొట్టింది.ఇక ప్రపంచ కప్‌లో ఆల్‌రౌండర్‌ పాత్రను దీప్తి శర్మ పోషించింది.ఐసీసీ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి దిగిన దీప్తి శర్మ అజేయంగా 49 పరుగులు చేసి ఛాంపియన్స్ ఆస్ట్రేలియాను ఓడించడంలో కీలక పాత్ర పోషించింది.ఈ టోర్నీలో ఆమె 116 పరుగులు సాధించింది.

2018లో భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అర్జునా అవార్డుని గెలుచుకోగా, 2019లో టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి ఆ గౌరవం దక్కింది.అయితే ఈ ఏడాది అర్జునా అవార్డుకి భారత ఫురుష క్రికెటర్లను ఎవరిని బీసీసీఐ నామినేట్ చేస్తున్న దాఖలాలు లేవు.

Show comments